వెబ్‘డబ్బు’
తప్పుల తడకగా భూ రికార్డులు
- ఆన్లైన్ నమోదులో రెవెన్యూ లీలలు
- వీఆర్వోలు, కంప్యూటర్ ఆపరేటర్ల మిలాఖత్
- దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం
- నెలలు గడుస్తున్నా పెండింగ్‌లోనే దరఖాస్తులు
- దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు
- ఘర్షణలు.. ఆత్మహత్యాయత్నాలు
ఆన్లైన్ దరఖాస్తులు: 1,67,263
మంజూరుకు అనుమతి: 1,14,926
తిరస్కరణ: 46,953
పెండింగ్: 5,384
భూ సమస్యలకు పరిష్కారం చూపాల్సిన వెబ్‌ల్యాండ్ అక్రమార్కులకు ఆదాయవనరుగా మారుతోంది. అక్షర జ్ఞానం లేని రైతులకు రెవెన్యూ అధికారులు చుక్కలు చూపుతున్నారు. ఆన్లైన్ నమోదులో లెక్కకు మించిన తప్పులు చేస్తూ.. పల్లెల్లో ఘర్షణలకు కారణమవుతున్నారు. తాత ముత్తాతల కాలం నుంచీ సాగు చేసుకుంటున్న పొలాలు ఇతరుల పేరు మీద ఉండటం చూసి దిక్కుతోచని స్థితిలో పలువురు రైతులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు.
అనంతపురం అర్బన్: రెవెన్యూ శాఖ అవినీతికి చిరునామాగా మారుతోంది. పారదర్శకంగా వ్యవహరించాల్సిన అధికారులు కొందరు అందినంతా దోచుకుంటున్నారు. వెబ్‌ల్యాండ్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. పలువురు తహసీల్దార్లు.. వీఆర్వోలు.. కంప్యూటర్ ఆపరేటర్లు కుమ్మక్కై భూ విస్తీర్ణంతో పాటు యజమాని పేర్లనే మార్చేస్తున్నారు. ఒకరి భూమిని మరొకరి పేరిట 1-బీ, అడంగల్ సృష్టిస్తున్నారు. సమస్య పరిష్కరించాలని బాధితులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడమే తప్పిస్తే ఫలితం లేకపోతోంది.
తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వీఆర్వో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ-పట్టాదారు పాసు పుస్తకం జారీకి రూ.10వేల నుంచి రూ.15వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. పాసు పుస్తకంలో తప్పుల సవరణకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు గుంజుతున్నట్లు తెలుస్తోంది. ఇతనిపై ఇటీవల కొందరు బాధితులు డీఆర్వోకు సైతం ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు.
తహసీల్దార్, ఆర్ఐలదీ అదే తంతు
కొన్ని మండలాల్లో తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పెద్ద ఎత్తున్న అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఇష్టానుసారంగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వ భూములకు కూడా పట్టాలు మంజూరు చేస్తున్నారు. వంకలు, వాగు స్థలాల్లో పట్టాలు ఇవ్వడంపై నిషేధం ఉన్నా ఖాతరు చేయని పరిస్థితి ఉంది. శింగనమల తహసీల్దార్(ఇటీవల బదిలీ అయ్యారు) అక్రమాలకు పాల్పడ్డారంటూ డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవికి ఆ మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు రెండు సార్లు, జాయింట్ కలెక్టర్ టి.కె.రమామణికి ఒకసారి ఆధారాలు సహా ఫిర్యాదు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.
దరఖాస్తులు, అర్జీలు పెండింగ్‌లో..
భూముల వివరాలు తప్పుగా ఉన్నాయని, సరిచేయాలని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా, అర్జీలు ఇచ్చినా పరిష్కారం కావట్లేదు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఆన్లైన్లో 7,432 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 3,494 పరిష్కరించారు. 3,538 పెండిగ్లో ఉన్నాయి.
పరిష్కారానికి చర్యలు
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాం. అందులో భాగంగా రైతు సేవలో రెవెన్యూ కార్యక్రమం జిల్లాలో కొనసాగుతోంది. అందులో వచ్చిన సమస్యల పరిష్కారానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. గతంలో మాదిరి కంప్యుటర్ ఆపరేటర్ ద్వారా కాకుండా, వచ్చిన సమస్యల్లో ఏది ఎవరు చేయాలనేది మండలం వారీగా ఒక ఆర్డర్లో ఉంచి పరిష్కరిస్తాం.
– టి.కె.రమామణి, జాయింట్ కలెక్టర్