Miss Wheelchair
-
హీనా శర్మ.. శాపాన్ని వరంగా మార్చుకుంది
కొందరికి పుట్టుకతోనే వైకల్యం ప్రాప్తిస్తుంది. కొందరు ప్రమాదవశాత్తు వైకల్యం బారిన పడతారు. వీరిలో చాలామంది ఈ జీవనం ‘శాపం’ అంటూ భారంగా రోజులు గడిపేస్తుంటారు. అతి కొద్ది మంది మాత్రమే అత్యంత అరుదుగా శాపాన్ని కూడా వరంగా మార్చుకుంటారు. అలాంటి అరుదైన వారిలో ఒకరు 28 ఏళ్ల హీనా శర్మ. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉంటున్న హీనా శర్మ అనారోగ్యం కారణంగా చిన్నప్పుడే వీల్‌చెయిర్‌కి పరిమితమైంది. కానీ, పడి లేచిన కెరటంలా తన జీవితాన్ని తనే మలుచుకుంది. వీల్‌చెయిర్‌లో కూర్చొని డ్యాన్స్ చేస్తుంది. పాటలు పాడుతుంది. వేదికల మీద ప్రదర్శనలు ఇస్తుంది. మోడల్‌గా ర్యాంప్‌వాక్ చేస్తుంది. కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వీటితో పాటు మిస్ వీల్‌చెయిర్ ఇండియా 2022 ఫైనల్‌కి కూడా చేరింది. ‘వీల్ చెయిర్‌పై ఉండటమనేది విచారకరం కాదు. నిస్సహాయతతో కాకుండా సరదాగా జీవితాన్ని గడపడం నేర్చుకున్నాను’ అంటోంది. ఇతరులపై ఆధారపడకుండా, మిమ్మల్ని మీరు నమ్ముకోండి అని చెబుతున్న హీనా శర్మ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. తన జీవితంలోని ఆటుపోట్లను ఈ విధంగా వివరిస్తోంది.. పాటలు పాడుతూ.. కండరాల క్షీణత ‘‘అందరు పిల్లల్లాగే తొమ్మిది నెలల వయసులోనే తొలి అడుగులు వేశానట. కానీ, అనుకోకుండా ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్చారు అమ్మానాన్న. ఆరునెలలు ఆసుపత్రిలోనే ఉంచారు. ‘వెన్నెముక బలహీనంగా ఉంది. కండరాల క్షీణత వల్ల నిటారుగా నిలబడలేదు’ అని చెప్పారు డాక్టర్లు. అప్పటినుంచి నా కాళ్లలో కదలిక లేదు. వెన్నెముక ‘సి’ ఆకారంలోకి మారిపోయింది. అయినా, ఆశచావక అమ్మానాన్నలు చికిత్స కోసం నన్ను దేశమంతా తిప్పారు. డాక్టర్ల సలహా మేరకు పదే పదే ఆపరేషన్లు చేయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నా పాదాలకు శస్త్ర చికిత్స చేశారు. అటునుంచి గోరఖ్‌పూర్‌లో ఫిజియోథెరపీ చేయించారు. మరోసారి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది కానీ, ప్రాణానికి హామీ ఇవ్వలేమన్నారు డాక్టర్లు. అమ్మ భయపడి తిరిగి ఇంటికి తీసుకొచ్చేసింది. దీంతో ఆగిపోయిన చదువు మళ్లీ మొదలుపెట్టాను. స్కూల్లో అందరూ ఇష్టపడేవారు. అందరూ సాయంగా ఉండేవారు. పదవ తరగతిలో ఆటోమేటిక్ వీల్‌చైర్ వచ్చింది. అప్పటినుంచి నా జీవితం చాలా సరళంగా మారిపోయింది. ఎక్కడకు వెళ్లాలనుకున్నా ఒంటరిగానే వెళ్లేదాన్ని. సంగీతం క్లాసులు ఆరో తరగతిలో ఉన్నప్పుడు సంగీతం నేర్చుకోవాలనే ఆశ బలంగా మారింది. దీంతో స్కూల్ టైమ్ అయ్యాక, మా అక్కను తీసుకొని సంగీతం క్లాసులకు వెళ్లేదాన్ని. పై అంతస్తు లో క్లాస్ ఉంటే ఎత్తుకునే తీసుకు వెళ్లేది. అలా నాలుగేళ్లు సంగీతం నేర్చుకున్నాను. అక్క పెళ్లవడంతో సంగీతం నేర్చుకోవడం మధ్యలోనే ఆగిపోయింది. కానీ, నాకు వచ్చినంతవరకు నేనే ఇంటి వద్ద సంగీతం క్లాసులు తీసుకోవడం మొదలుపెట్టాను. కాలేజీ చదువు పూర్తయ్యాక ట్యూషన్లు చెప్పడం కూడా ఆరంభించాను. పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు స్నేహితులు, కుటుంబ సభ్యుల సహాయం, వీల్‌చెయిర్.. అన్నింటి వల్ల చదువు అంతా సవ్యంగానే సాగింది. ఆ తర్వాతనే నిజమైన పోరాటం అంటే ఏంటో తెలిసొచ్చింది. ఉద్యోగం ఓ సవాల్... ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా నిరాశే ఎదురయ్యింది. వెళ్లిన ప్రతిచోటా ‘ఎలా పనిచేస్తారు, ఎలా వస్తారు, ఎలా వెళతారు..’ ఇవే ప్రశ్నలు. చాలా నిరాశగా అనిపించేది. వికలాంగులకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు ఇప్పించే స్వచ్ఛంద సంస్థ ఉందని తెలిసి వారిని కలిసి, శిక్షణకు వెళ్లేదాన్ని. రోజూ ఘజియాబాద్ నుంచి నజాఫ్‌గడ్‌కు మూడు గంటలపాటు ఒంటరిగానే ప్రయాణించే దాన్ని. శిక్షణ సమయంలో రోజంతా సెంటర్లో కూర్చుంటే బాత్రూమ్కు తీసుకెళ్లేవాళ్లు లేక యూరిన్ బ్యాగ్ కూడా వీల్‌చెయిర్‌కు సెట్ చేసుకునేదాన్ని. రెండు నెలల శిక్షణ పెద్ద పోరాటమే అని చెప్పాలి. అయినా ఉద్యోగం రాలేదు. పోస్టుగ్రాడ్యుయేషన్ చేసినా పదవ తరగతి చదివేవారికి ఇచ్చే ఉద్యోగం కూడా ఇవ్వలేమన్నట్లే మాట్లాడేవారు. నన్ను నేను నమ్ముకున్నాను.. మళ్లీ ఆరు నెలల శిక్షణ తీసుకున్నాను. ఈసారి ఉద్యోగం కోసం పోరాటం కొనసాగించాను. వివిధ ఆన్లైన్ పోర్టళ్లలో నా పేరు నమోదు చేసుకున్నాను. దీంతో కొన్ని ఎన్జీవోలకు నా పూర్తి సమాచారం చేరింది. టెక్ మహీంద్రా కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇంటినుండి పని చేసుకునే పర్మనెంట్ అవకాశం గల ఉద్యోగం కావడంతో సులభంగా చేయగలుగుతున్నాను. సంగీత పరిజ్ఞానం ఉండటంతో వేదికల మీద ప్రదర్శనలు ఇస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో మార్కెటింగ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నాను. ‘రైజింగ్ స్టార్’ టీవీ షోస్‌లో పాల్గొన్నాను. ఆస్మాన్ ఫౌండేషన్ వారి కార్యక్రమంలో ఇళయరాజా పాట పాడటం నా జీవితంలో అతి ముఖ్యమైనది. అమితాబ్ బచ్చన్‌తోపాటు చాలా మంది ప్రముఖులు ఆ పాటను రీట్వీట్ చేయడంతో దేశవ్యాప్తంగా పేరు పొందాను. ఈ యేడాది ‘మిస్ వీల్ చెయిర్ ఇండియా’ పోటీల్లో ఫైనల్స్‌కి చేరాను. కూర్చొని డ్యాన్స్ చేస్తాను. పాడతాను. రోజంతా హుషారుగా గడుపుతాను. నా జీవితంలో నేను జాలిపడేది ఏమీ లేదని నాకు అర్థమైంది. చాలామంది వికలాంగులతో నాకు పరిచయం ఉంది. జీవితం పట్ల వారిలో భయాందోళనలను గమనించాను. సానుభూతిని కోరుకోవడం చూశాను. బతికినంత కాలం నా మనసులో ఏముందో అదంతా చేసేస్తాను. ఎవరైనా తమను తాము ఉన్నట్లుగా అంగీకరించాలి. అప్పుడు మన జీవితాన్ని నిస్సహాయతతో కాకుండా సరదాగా గడపగలుగుతాం’’ అని చెబుతున్న హీనా శర్మ మాటలే కాదు చేతలు కూడా నేటి యువతకు స్ఫూర్తిని కలిగిస్తాయి. -
విరాళి మోది.. కూర్చుని ఎగిరింది!
పులిని ఎదిరించిన మేకపిల్ల కథ ప్రేరణ. కరువున కురిసిన వాన కథ ప్రేరణ. పేగు అడ్డుపడినా జన్మించి కేర్మనడం ప్రేరణ. ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు జవాబుగా మారడం ప్రేరణ. ప్రేరణ అందరూ కలిగించలేరు. అందుకు అర్హత కలిగిన వారు పలికిన మాట నుంచే అది జనిస్తుంది. విరాళి మోది డిజెబిలిటి యాక్టివిస్ట్. మోటివేషనల్ స్పీకర్. ప్రయోజనకరమైన చలనం మనిషికి అవసరం అని ఆమె చెబుతుంది. ఆమె తన వీల్‌చైర్‌లో నుంచి లేచి నిలబడలేదు. కూర్చుని నేను ఎగర గలుగుతున్నప్పుడు మీకేం తక్కువ? అని సూటిగా అడిగి దమ్మునింపుతుంది. ఆమె పరిచయం... విరాళి మోది వయసు ఇప్పుడు 30 ఏళ్లు. 2006 లో ఆమె తన కాళ్లలో చలనం పోగొట్టుకుంది. అప్పటి నుంచి ఆమె వీల్‌చైర్‌కే పరిమితం అయ్యింది. అయితే ఆ తర్వాతి నుంచి ఆమె ఎలా ఎగిరిందో చూద్దాం. ► 2014లో ‘మిస్ వీల్‌చైర్ ఇండియా’ టైటిల్ గెలుచుకుంది. ► భారతీయ రైల్వేలలో దివ్యాంగుల సౌకర్యాలు కల్పించేలా ఉద్యమం లేవదీసి గెలిచింది. ► 2017లో ‘ప్రభావవంతమైన 100 మంది స్త్రీలు’ బిబిసి జాబితాలో నిలిచింది. ► ఆమె చేసిన ‘మై ట్రైన్ టూ’ ప్రచారం ప్రాముఖ్యం పొందింది. ► ‘ర్యాంప్ మై రెస్టరెంట్’ కాంపెయిన్ రెస్టరెంట్లలో దివ్యాంగుల ప్రవేశపు వీలును గుర్తించేలా చేసింది. ► గొప్ప మోటివేషనల్ స్పీకర్‌గా గుర్తింపు పొందింది. ► వీల్ చైర్ మీద కూచునే ఫ్యాషన్ షోలలో పాల్గొంది. ► స్కూబా డైవింగ్ చేసింది. నిజానికి విరాళి మోదికి ‘దివ్యాంగులు’, ‘డిఫరెంట్లీ ఏబుల్డ్’ అనే మాటలు నచ్చవు. ‘మనందరం ఒకటే. మాకు ఏవేవో పేర్లు పెట్టి బుజ్జగించే పనులు చేయకండి. మీరు కాళ్ల మీద ఆధారపడతారు. మేము వీల్‌చైర్ మీద ఆధారపడతాం. మిగిలిన అన్ని పనుల్లో మేము సమానమే కదా’ అంటుందామె. విరాళి మోది ముంబై లో ఉంటుంది. దివ్యాంగుల హక్కుల సాధన విషయంలో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇవాళ ఆమె మోటివేషనల్ స్పీచెస్ వినడానికి వందలాదిగా తరలి వస్తారు. ఆమె కథ ఎందుకు అంత ప్రేరణ కలిగిస్తోంది? అమెరికా అమ్మాయి విరాళి మోది ఇండియాలో జన్మించినా హైస్కూలు వయసు వరకూ అమెరికాలోనే పెరిగింది. ఆమె తల్లిదండ్రులు పల్లవి, జితేష్ మోదీలు ‘మజూరి’లో స్థిరపడ్డారు. 2006లో విరాళికి పదహారు పదిహేడు సంవత్సరాలున్నప్పుడు ఆమె ఇండియా పర్యటనకు వచ్చి తిరిగి అమెరికా వెళ్లింది. వెళ్లినప్పటి నుంచి ఆమెకు తలనొప్పి పట్టుకుంది. ఆ తర్వాత తీవ్రమైన జ్వరం. డాక్టర్లు పరీక్ష చేస్తే టెస్టుల్లో ఏమీ తేలలేదు. విరాళి ఇండియా వచ్చింది వానాకాలం కనుక మలేరియా వచ్చి ఉంటుందని తల్లిదండ్రులు చెప్పినా టెస్టుల్లో తేల్లేదు కనుక మందులు ఇవ్వం అని డాక్టర్లు చెప్పారు. ఆ జ్వరంలోనే ఒక ఉదయం ఆమె కాళ్లు చచ్చుబడ్డాయి. ఆ తర్వాత ఆమెకు హార్ట్ ఎటాక్ వచ్చింది. 7 నిమిషాలు ఆమెలో చలనం లేదు. డాక్టర్లు చనిపోయిందనే అన్నారు. కాని ఆమె గుండె తిరిగి కొట్టుకుంది. ఆ తర్వాత కోమాలోకి వెళ్లిపోయింది. వెంటిలేటర్ మీద ఉన్న విరాళిని తల్లి మరికొన్ని రోజుల్లో రానున్న విరాళి పుట్టినరోజు వరకూ బతికించమని, ఆ తర్వాత వెంటిలేటర్ తీసేద్దామని కోరింది. డాక్టర్లు తల్లికోరిక కదా అని మన్నించారు. పుట్టినరోజు అందరూ చివరి చూపులకు వచ్చారు. కేక్ కోశారు. ఐసియులో సందడి చేశారు. ఆ సందడిలోనే విరాళి కోమా నుంచి బయటపడి కళ్లు తెరిచింది. అచలనం నుంచి చలనానికి విరాళి బతికింది కాని మెడ కింద నుంచి పూర్తి శరీరం చచ్చుబడింది. చేతులు కాళ్లు ఏవీ కదల్చలేని స్థితి. తల్లి కొన్నిరోజులు సేవ చేసింది. కాని ఇలాగే ఉంటే అమ్మాయి ఏం కాను? ఒకరోజు విరాళికి చాలా ఆకలి వేసింది. తల్లిని భోజనం అడిగితే ఎదురుగా తెచ్చి పెట్టి ‘నీకు కావాలంటే తిను. నేను నీ పనిమనిషిని కాను’ అని కావాలని విసుక్కుంది. విరాళికి పట్టుదల వచ్చింది. నా తిండి నేను తినగలను అనుకుంది. పట్టుదలగా ముందు వేళ్లు కదిలించింది. తర్వాత చేతులు కదిలించింది. ఆ తర్వాత చేయి సాచి ఆహారాన్ని తినగలింది. ‘ఆ రోజు నా జీవితం మారింది. నేను అనుకున్నది గట్టిగా అనుకుంటే సాధించగలను అని అర్థమైంది. అంతా మన మైండ్‌లో ఉంటుంది. దానికి బలం ఇవ్వాలి అని తెలుసుకున్నాను’ అని చెప్పింది. ఆ తర్వాత ఆమె చేతులు ఆమె స్వాధీనానికి వచ్చాయి. కాళ్ల సమస్య? వీల్‌చైర్ ఉందిగా అనుకుంది. ఎందుకు చేయరు? ‘ఈ పని నా వల్ల కాదు.. ఆ పని నేను చేయలేను అని అందరూ అనుకుంటూ ఉంటారు. బద్దకిస్తుంటారు. భయపడుతుంటారు. కాని ఇందుకా మనం పుట్టింది. చేయాలి. సాధించాలి. ముందుకు వెళ్లాలి. జన్మను సార్థకం చేసుకోవాలి’ అంటుంది విరాళి. ఆమె తన సమూహానికే కాదు ప్రతి ఒక్కరికీ ‘లే.. నడు.. పరిగెత్తు.. ఎగురు’ అని ప్రేరణనిస్తుంది. నిరాశ చుట్టుముట్టినవారికి తన జీవితాన్నే అద్దంలా చూపి మనిషికి సమస్యలను దాటే శక్తి ఉంటుందని చెప్పింది. అదే కాదు... న్యాయమైన హక్కులను సాధించుకోలేకపోవడం కూడా ‘అచేతన చైతన్యాన్ని’ కలిగి ఉండటమే అని చెబుతుంది. పోరాడాలి.. సాధించాలి... జీవించాలి... జీవితాన్ని ఇవ్వాలి... ఇదే విరాళి ఇస్తున్న సందేశం. – సాక్షి ఫ్యామిలీ -
మిస్ వీల్‌చైర్‌గా బెలారస్ సుందరి
వార్సా: అందం అనేది శరీరానికి సంబంధించినదనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. చిన్న లోపమున్నా తాము అందంగా లేమని బాధపడేవారు ఎందరో. ఇక వికలాంగుల్లో చాలామంది తమ లోపాన్ని గురించి ఆలోచిస్తూ కుంగిపోతారు. కానీ.. అందం అనేది అవయవాలకు సంబంధించినది కాదని, మనసు సంబంధించినదనే విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది అలెగ్జాండ్రా చిచికోవా. వీల్‌చైర్‌కు పరిమితమైన 23 ఏళ్ల చిచికోవా.. అందాలపోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. మిస్ వీల్‌చైర్ కిరీటాన్ని దక్కించుకుంది. వార్సాలో జరిగిన ఈ పోటీల్లో విజేతగా తన పేరును ప్రకటించిన వెంటనే తీవ్ర ఉధ్వేగానికి లోనైన చిచికోవా.. కాసేపటి తేరుకొని మీడియాతో మాట్లాడింది. ‘మీలోని అపోహలు, భయాలతో పోరాడండి’ అంటూ ఒకే ఒక్కమాట చెప్పి అందరి మనసులు గెలుచుకుంది. దక్షిణాఫ్రికాకు చెందిన లెబొహాంగ్ మొన్యాట్సీ, పొలాండ్‌కు చెందిన ఆండ్రియన్నా జవాడ్జిన్స్కా.. రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. -
వైకల్యం అవయవాలకే... అందానికి కాదు