పులిని ఎదిరించిన మేకపిల్ల కథ ప్రేరణ. కరువున కురిసిన వాన కథ ప్రేరణ. పేగు అడ్డుపడినా జన్మించి కేర్‌మనడం ప్రేరణ. ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు జవాబుగా మారడం ప్రేరణ. ప్రేరణ అందరూ కలిగించలేరు. అందుకు అర్హత కలిగిన వారు పలికిన మాట నుంచే అది జనిస్తుంది. విరాళి మోది డిజెబిలిటి యాక్టివిస్ట్. మోటివేషనల్ స్పీకర్. ప్రయోజనకరమైన చలనం మనిషికి అవసరం అని ఆమె చెబుతుంది. ఆమె తన వీల్‌చైర్‌లో నుంచి లేచి నిలబడలేదు. కూర్చుని నేను ఎగర గలుగుతున్నప్పుడు మీకేం తక్కువ? అని సూటిగా అడిగి దమ్మునింపుతుంది.
ఆమె పరిచయం...
విరాళి మోది వయసు ఇప్పుడు 30 ఏళ్లు. 2006 లో ఆమె తన కాళ్లలో చలనం పోగొట్టుకుంది. అప్పటి నుంచి ఆమె వీల్‌చైర్‌కే పరిమితం అయ్యింది. అయితే ఆ తర్వాతి నుంచి ఆమె ఎలా ఎగిరిందో చూద్దాం.
► 2014లో ‘మిస్ వీల్‌చైర్ ఇండియా’ టైటిల్ గెలుచుకుంది.
► భారతీయ రైల్వేలలో దివ్యాంగుల సౌకర్యాలు కల్పించేలా ఉద్యమం లేవదీసి గెలిచింది.
► 2017లో ‘ప్రభావవంతమైన 100 మంది స్త్రీలు’ బిబిసి జాబితాలో నిలిచింది.
► ఆమె చేసిన ‘మై ట్రైన్ టూ’ ప్రచారం ప్రాముఖ్యం పొందింది.
► ‘ర్యాంప్ మై రెస్టరెంట్’ కాంపెయిన్ రెస్టరెంట్‌లలో దివ్యాంగుల ప్రవేశపు వీలును గుర్తించేలా చేసింది.
► గొప్ప మోటివేషనల్ స్పీకర్‌గా గుర్తింపు పొందింది.
► వీల్ చైర్ మీద కూచునే ఫ్యాషన్ షోలలో పాల్గొంది.
► స్కూబా డైవింగ్ చేసింది.
నిజానికి విరాళి మోదికి ‘దివ్యాంగులు’, ‘డిఫరెంట్లీ ఏబుల్డ్’ అనే మాటలు నచ్చవు. ‘మనందరం ఒకటే. మాకు ఏవేవో పేర్లు పెట్టి బుజ్జగించే పనులు చేయకండి. మీరు కాళ్ల మీద ఆధారపడతారు. మేము వీల్‌చైర్ మీద ఆధారపడతాం. మిగిలిన అన్ని పనుల్లో మేము సమానమే కదా’ అంటుందామె. విరాళి మోది ముంబై లో ఉంటుంది. దివ్యాంగుల హక్కుల సాధన విషయంలో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇవాళ ఆమె మోటివేషనల్ స్పీచెస్ వినడానికి వందలాదిగా తరలి వస్తారు. ఆమె కథ ఎందుకు అంత ప్రేరణ కలిగిస్తోంది?
అమెరికా అమ్మాయి
విరాళి మోది ఇండియాలో జన్మించినా హైస్కూలు వయసు వరకూ అమెరికాలోనే పెరిగింది. ఆమె తల్లిదండ్రులు పల్లవి, జితేష్ మోదీలు ‘మజూరి’లో స్థిరపడ్డారు. 2006లో విరాళికి పదహారు పదిహేడు సంవత్సరాలున్నప్పుడు ఆమె ఇండియా పర్యటనకు వచ్చి తిరిగి అమెరికా వెళ్లింది. వెళ్లినప్పటి నుంచి ఆమెకు తలనొప్పి పట్టుకుంది. ఆ తర్వాత తీవ్రమైన జ్వరం. డాక్టర్లు పరీక్ష చేస్తే టెస్టుల్లో ఏమీ తేలలేదు. విరాళి ఇండియా వచ్చింది వానాకాలం కనుక మలేరియా వచ్చి ఉంటుందని తల్లిదండ్రులు చెప్పినా టెస్టుల్లో తేల్లేదు కనుక మందులు ఇవ్వం అని డాక్టర్లు చెప్పారు.
ఆ జ్వరంలోనే ఒక ఉదయం ఆమె కాళ్లు చచ్చుబడ్డాయి. ఆ తర్వాత ఆమెకు హార్ట్ ఎటాక్ వచ్చింది. 7 నిమిషాలు ఆమెలో చలనం లేదు. డాక్టర్లు చనిపోయిందనే అన్నారు. కాని ఆమె గుండె తిరిగి కొట్టుకుంది. ఆ తర్వాత కోమాలోకి వెళ్లిపోయింది. వెంటిలేటర్ మీద ఉన్న విరాళిని తల్లి మరికొన్ని రోజుల్లో రానున్న విరాళి పుట్టినరోజు వరకూ బతికించమని, ఆ తర్వాత వెంటిలేటర్ తీసేద్దామని కోరింది. డాక్టర్లు తల్లికోరిక కదా అని మన్నించారు. పుట్టినరోజు అందరూ చివరి చూపులకు వచ్చారు. కేక్ కోశారు. ఐసియులో సందడి చేశారు. ఆ సందడిలోనే విరాళి కోమా నుంచి బయటపడి కళ్లు తెరిచింది.
అచలనం నుంచి చలనానికి
విరాళి బతికింది కాని మెడ కింద నుంచి పూర్తి శరీరం చచ్చుబడింది. చేతులు కాళ్లు ఏవీ కదల్చలేని స్థితి. తల్లి కొన్నిరోజులు సేవ చేసింది. కాని ఇలాగే ఉంటే అమ్మాయి ఏం కాను? ఒకరోజు విరాళికి చాలా ఆకలి వేసింది. తల్లిని భోజనం అడిగితే ఎదురుగా తెచ్చి పెట్టి ‘నీకు కావాలంటే తిను. నేను నీ పనిమనిషిని కాను’ అని కావాలని విసుక్కుంది. విరాళికి పట్టుదల వచ్చింది. నా తిండి నేను తినగలను అనుకుంది. పట్టుదలగా ముందు వేళ్లు కదిలించింది.
తర్వాత చేతులు కదిలించింది. ఆ తర్వాత చేయి సాచి ఆహారాన్ని తినగలింది. ‘ఆ రోజు నా జీవితం మారింది. నేను అనుకున్నది గట్టిగా అనుకుంటే సాధించగలను అని అర్థమైంది. అంతా మన మైండ్‌లో ఉంటుంది. దానికి బలం ఇవ్వాలి అని తెలుసుకున్నాను’ అని చెప్పింది. ఆ తర్వాత ఆమె చేతులు ఆమె స్వాధీనానికి వచ్చాయి. కాళ్ల సమస్య? వీల్‌చైర్ ఉందిగా అనుకుంది.
ఎందుకు చేయరు?
‘ఈ పని నా వల్ల కాదు.. ఆ పని నేను చేయలేను అని అందరూ అనుకుంటూ ఉంటారు. బద్దకిస్తుంటారు. భయపడుతుంటారు. కాని ఇందుకా మనం పుట్టింది. చేయాలి. సాధించాలి. ముందుకు వెళ్లాలి. జన్మను సార్థకం చేసుకోవాలి’ అంటుంది విరాళి. ఆమె తన సమూహానికే కాదు ప్రతి ఒక్కరికీ ‘లే.. నడు.. పరిగెత్తు.. ఎగురు’ అని ప్రేరణనిస్తుంది. నిరాశ చుట్టుముట్టినవారికి తన జీవితాన్నే అద్దంలా చూపి మనిషికి సమస్యలను దాటే శక్తి ఉంటుందని చెప్పింది. అదే కాదు... న్యాయమైన హక్కులను సాధించుకోలేకపోవడం కూడా ‘అచేతన చైతన్యాన్ని’ కలిగి ఉండటమే అని చెబుతుంది. పోరాడాలి.. సాధించాలి... జీవించాలి... జీవితాన్ని ఇవ్వాలి... ఇదే విరాళి ఇస్తున్న సందేశం.
– సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment