హీనా శర్మ.. శాపాన్ని వరంగా మార్చుకుంది | Dancer and singer Heena Sharma enter to Miss Wheelchair India 2022 Finals | Sakshi
Sakshi News home page

హీనా శర్మ.. శాపాన్ని వరంగా మార్చుకుంది

Published Thu, Feb 24 2022 12:21 AM | Last Updated on Thu, Feb 24 2022 12:22 AM

Dancer and singer Heena Sharma enter to Miss Wheelchair India 2022 Finals - Sakshi

హీనా శర్మ, కీ బోర్డ్‌ వాయిస్తూ..

కొందరికి పుట్టుకతోనే వైకల్యం ప్రాప్తిస్తుంది. కొందరు ప్రమాదవశాత్తు వైకల్యం బారిన పడతారు. వీరిలో చాలామంది ఈ జీవనం ‘శాపం’ అంటూ భారంగా రోజులు గడిపేస్తుంటారు. అతి కొద్ది మంది మాత్రమే అత్యంత అరుదుగా శాపాన్ని కూడా వరంగా మార్చుకుంటారు. అలాంటి అరుదైన వారిలో ఒకరు 28 ఏళ్ల హీనా శర్మ.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉంటున్న హీనా శర్మ అనారోగ్యం కారణంగా చిన్నప్పుడే వీల్‌చెయిర్‌కి పరిమితమైంది. కానీ, పడి లేచిన కెరటంలా తన జీవితాన్ని తనే మలుచుకుంది. వీల్‌చెయిర్‌లో కూర్చొని డ్యాన్స్‌ చేస్తుంది. పాటలు పాడుతుంది. వేదికల మీద ప్రదర్శనలు ఇస్తుంది. మోడల్‌గా ర్యాంప్‌వాక్‌ చేస్తుంది. కార్పొరేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వీటితో పాటు మిస్‌ వీల్‌చెయిర్‌ ఇండియా 2022 ఫైనల్‌కి కూడా చేరింది. ‘వీల్‌ చెయిర్‌పై ఉండటమనేది విచారకరం కాదు. నిస్సహాయతతో కాకుండా సరదాగా జీవితాన్ని గడపడం నేర్చుకున్నాను’ అంటోంది. ఇతరులపై ఆధారపడకుండా, మిమ్మల్ని మీరు నమ్ముకోండి అని చెబుతున్న హీనా శర్మ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. తన జీవితంలోని ఆటుపోట్లను ఈ విధంగా వివరిస్తోంది..

పాటలు పాడుతూ..

కండరాల క్షీణత
‘‘అందరు పిల్లల్లాగే తొమ్మిది నెలల వయసులోనే తొలి అడుగులు వేశానట. కానీ, అనుకోకుండా ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్చారు అమ్మానాన్న. ఆరునెలలు ఆసుపత్రిలోనే ఉంచారు. ‘వెన్నెముక బలహీనంగా ఉంది. కండరాల క్షీణత వల్ల నిటారుగా నిలబడలేదు’ అని చెప్పారు డాక్టర్లు. అప్పటినుంచి నా కాళ్లలో కదలిక లేదు. వెన్నెముక ‘సి’ ఆకారంలోకి మారిపోయింది. అయినా, ఆశచావక అమ్మానాన్నలు చికిత్స కోసం  నన్ను దేశమంతా తిప్పారు. డాక్టర్ల సలహా మేరకు పదే పదే ఆపరేషన్లు చేయించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నా పాదాలకు శస్త్ర చికిత్స చేశారు. అటునుంచి గోరఖ్‌పూర్‌లో ఫిజియోథెరపీ చేయించారు. మరోసారి ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది కానీ, ప్రాణానికి హామీ ఇవ్వలేమన్నారు డాక్టర్లు. అమ్మ భయపడి తిరిగి ఇంటికి తీసుకొచ్చేసింది. దీంతో ఆగిపోయిన చదువు మళ్లీ మొదలుపెట్టాను. స్కూల్లో అందరూ ఇష్టపడేవారు. అందరూ సాయంగా ఉండేవారు. పదవ తరగతిలో ఆటోమేటిక్‌ వీల్‌చైర్‌ వచ్చింది. అప్పటినుంచి నా జీవితం చాలా సరళంగా మారిపోయింది. ఎక్కడకు వెళ్లాలనుకున్నా ఒంటరిగానే వెళ్లేదాన్ని.

సంగీతం క్లాసులు
ఆరో తరగతిలో ఉన్నప్పుడు సంగీతం నేర్చుకోవాలనే ఆశ బలంగా మారింది. దీంతో స్కూల్‌ టైమ్‌ అయ్యాక, మా అక్కను తీసుకొని సంగీతం క్లాసులకు వెళ్లేదాన్ని. పై అంతస్తు లో క్లాస్‌ ఉంటే ఎత్తుకునే తీసుకు వెళ్లేది. అలా నాలుగేళ్లు సంగీతం నేర్చుకున్నాను. అక్క పెళ్లవడంతో సంగీతం నేర్చుకోవడం మధ్యలోనే ఆగిపోయింది. కానీ, నాకు వచ్చినంతవరకు నేనే ఇంటి వద్ద సంగీతం క్లాసులు తీసుకోవడం మొదలుపెట్టాను. కాలేజీ చదువు పూర్తయ్యాక ట్యూషన్లు చెప్పడం కూడా ఆరంభించాను. పోస్టు గ్రాడ్యుయేషన్‌ వరకు స్నేహితులు, కుటుంబ సభ్యుల సహాయం, వీల్‌చెయిర్‌.. అన్నింటి వల్ల చదువు అంతా సవ్యంగానే సాగింది. ఆ తర్వాతనే నిజమైన పోరాటం అంటే ఏంటో తెలిసొచ్చింది.

ఉద్యోగం ఓ సవాల్‌...
ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా నిరాశే ఎదురయ్యింది. వెళ్లిన ప్రతిచోటా ‘ఎలా పనిచేస్తారు, ఎలా వస్తారు, ఎలా వెళతారు..’ ఇవే ప్రశ్నలు. చాలా నిరాశగా అనిపించేది. వికలాంగులకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు ఇప్పించే స్వచ్ఛంద సంస్థ ఉందని తెలిసి వారిని కలిసి, శిక్షణకు వెళ్లేదాన్ని. రోజూ ఘజియాబాద్‌ నుంచి నజాఫ్‌గడ్‌కు మూడు గంటలపాటు ఒంటరిగానే ప్రయాణించే దాన్ని. శిక్షణ సమయంలో రోజంతా సెంటర్‌లో కూర్చుంటే బాత్రూమ్‌కు తీసుకెళ్లేవాళ్లు లేక యూరిన్‌ బ్యాగ్‌ కూడా వీల్‌చెయిర్‌కు సెట్‌ చేసుకునేదాన్ని. రెండు నెలల శిక్షణ పెద్ద పోరాటమే అని చెప్పాలి. అయినా ఉద్యోగం రాలేదు. పోస్టుగ్రాడ్యుయేషన్‌ చేసినా పదవ తరగతి చదివేవారికి ఇచ్చే ఉద్యోగం కూడా ఇవ్వలేమన్నట్లే మాట్లాడేవారు.

నన్ను నేను నమ్ముకున్నాను..
మళ్లీ ఆరు నెలల శిక్షణ తీసుకున్నాను. ఈసారి ఉద్యోగం కోసం పోరాటం కొనసాగించాను. వివిధ ఆన్‌లైన్‌ పోర్టళ్లలో నా పేరు నమోదు చేసుకున్నాను. దీంతో కొన్ని ఎన్జీవోలకు నా పూర్తి సమాచారం చేరింది. టెక్‌ మహీంద్రా కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇంటినుండి పని చేసుకునే పర్మనెంట్‌ అవకాశం గల ఉద్యోగం కావడంతో సులభంగా చేయగలుగుతున్నాను. సంగీత పరిజ్ఞానం ఉండటంతో వేదికల మీద ప్రదర్శనలు ఇస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో మార్కెటింగ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్నాను. ‘రైజింగ్‌ స్టార్‌’ టీవీ షోస్‌లో పాల్గొన్నాను. ఆస్మాన్‌ ఫౌండేషన్‌ వారి కార్యక్రమంలో ఇళయరాజా పాట పాడటం నా జీవితంలో అతి ముఖ్యమైనది.

అమితాబ్‌ బచ్చన్‌తోపాటు చాలా మంది ప్రముఖులు ఆ పాటను రీట్వీట్‌ చేయడంతో దేశవ్యాప్తంగా పేరు పొందాను. ఈ యేడాది ‘మిస్‌ వీల్‌ చెయిర్‌ ఇండియా’ పోటీల్లో ఫైనల్స్‌కి చేరాను. కూర్చొని డ్యాన్స్‌ చేస్తాను. పాడతాను. రోజంతా హుషారుగా గడుపుతాను. నా జీవితంలో నేను జాలిపడేది ఏమీ లేదని నాకు అర్థమైంది. చాలామంది వికలాంగులతో నాకు పరిచయం ఉంది.  జీవితం పట్ల వారిలో భయాందోళనలను గమనించాను. సానుభూతిని కోరుకోవడం చూశాను. బతికినంత కాలం నా మనసులో ఏముందో అదంతా చేసేస్తాను. ఎవరైనా తమను తాము ఉన్నట్లుగా అంగీకరించాలి. అప్పుడు మన జీవితాన్ని నిస్సహాయతతో కాకుండా సరదాగా గడపగలుగుతాం’’ అని చెబుతున్న హీనా శర్మ మాటలే కాదు చేతలు కూడా నేటి యువతకు స్ఫూర్తిని కలిగిస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement