Missamma Movie: ఆ హీరోయిన్‌పై నిర్మాత ఆగ్రహం.. సావిత్రికి అవకాశం
1955 జనవరి 12న విడుదలైన ‘మిస్సమ్మ’ టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్. చక్రపాణి నిర్మాతగా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కింది. ‘మిస్సమ్మ’ మంచి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు, సావిత్రి వంటి దిగ్గజ నటులు ప్రధాన పాత్రలు పోషించారు. హీరోయిన్ సావిత్రికి జమున చెల్లిగా నటించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘మిస్సమ్మ’. అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్నార్ హీరోలుగా నిలదొక్కుకున్నారు. అయినప్పటికీ ఈ సినిమాలో ఎలాంటి కమర్షియల్ హంగులూ ఉండవు. చక్కని హాస్యం, భావోద్వేగాలు, గిల్లికజ్జాలతో సాగుతుంది. సాలూరి రాజేశ్వరరావు అందించిన మ్యూజిక్ ఓ మ్యాజిక్.భానుమతి ప్లేస్‌లో సావిత్రి ‘మిస్సమ్మ’లో ఎస్వీ రంగారావు, సావిత్రి నటన... ఎన్టీఆర్, ఏఎన్నార్లను డామినేట్ చేసేలా ఉంటుంది. సావిత్రి హీరోయిన్గా ఎదుగుతున్న రోజుల్లో వచ్చిన ఈ సినిమా ఆమె కెరీర్‌కి చాలా ప్లస్ అయ్యింది. తన ఇమేజ్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇందులో ఆత్మవిశ్వాసం కలిగిన స్ట్రాంగ్ లేడీ రోల్ సావిత్రిది. అలాగే ముక్కోపి. ఈ పాత్రకు భానుమతి కరెక్ట్ అని తొలుత దర్శక–నిర్మాతలు భావించారు. అప్పటికే ఆమె పరిశ్రమకు వచ్చి చాలా ఏళ్లయింది. ‘మల్లీశ్వరి’ వంటి బ్లాక్ బస్టర్లో నటించారు. నిజ జీవితంలో భానుమతి వ్యక్తిత్వం... ‘మిస్సమ్మ’లో మేరీ పాత్రలా ఉంటుంది. భానుమతితో ‘మిస్సమ్మ’ షూటింగ్ కొంత మేర జరిగింది కూడా. అయితే ఓ రోజు ఆమె షూటింగ్‌కి ఆలస్యంగా వచ్చారట. దీంతో నిర్మాత చక్రపాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం షూటింగ్ అయితే మధ్యాహ్నం రావడమేంటి క్షమాపణలు చెప్పాలన్నారట. అయితే... ఆలస్యమవుతుందని మేనేజర్‌తో కబురు పంపానని... కాబట్టి క్షమాపణలు చెప్పేది లేదన్నారట భానుమతి. దీంతో చక్రపాణి ఆమెను సినిమా నుంచి తొలిగించి అప్పటివరకు షూట్ చేసిన రీల్స్‌ను తగలబెట్టేశారట. అలా ‘మిస్సమ్మ’లో మెయిన్ హీరోయిన్గా చేస్తున్న భానుమతి స్థానంలోకి సావిత్రి వచ్చారు. లేదంటే హీరోయిన్ చెల్లెలుగా చేసిన జమున పాత్ర చేయాల్సి వచ్చేది. బెంగాలీ నవల మన్మొయీ గర్ల్స్ స్కూల్ అనే హాస్య రచన ఆధారంగా నిర్మాత చక్రపాణి ‘మిస్సమ్మ’ తెలుగు కథను సమకూర్చారు. సినిమా చిత్రీకరణంతా మద్రాసు చుట్టు పక్కలే జరిగింది. ‘మిస్సమ్మ’ను తమిళంలో మిస్సియమ్మగా ఏక కాలంలో చిత్రీకరించారు. ఇందులో జెమినీ గణేశన్, సావిత్రి నటించారు. తెలుగు, తమిళ వెర్షన్లు రెండూ కూడా కమర్షియల్‌గా బంపర్ హిట్టయ్యాయి. 1957లో ఏవీఎం ప్రొడక్షన్స్ ఈ సినిమాను హిందీలోనూ తీసింది. హిందీలో మేరి పాత్రను మీనాకుమారి పోషించగా ‘మిస్ మేరి’గా నిర్మించారు. ఇది ఎల్వీ ప్రసాద్‌కి బాలీవుడ్లో దర్శకుడిగా తొలి చిత్రం.– ఇంటూరు హరికృష్ణ