పట్టాలు తప్పిన రైలింజన్
గుత్తి (గుంతకల్లు) : షంటింగ్ చేస్తున్న రైలింజిన్ ప్రమాదవశాత్తు పట్టాలు తప్పిన సంఘటన అనంతపురం జిల్లా గుత్తిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రైలింజిన్ (నంబర్ డబ్ల్యూడీజీ 3ఏ 13100) రాత్రి 8.30 గంటల సమయంలో బే–1 వద్ద నుంచి వాషింగ్ పాయింట్ వద్దకు బయలు దేరింది.
అయితే.. డీజిల్ షెడ్లోని వాషింగ్ పాయింట్ వద్ద పట్టాలు తప్పింది. ఎలాంటి ఆస్తి నష్టమూ సంభవించలేదు. సమాచారం తెలుసుకున్న రైల్వే ఉన్నతాధికారులు టెక్నీషియన్లను, మెకానిక్‌లను పంపి ఇంజిన్‌ను తిరిగి యథాస్థితికి తెచ్చారు. ఇదే ప్రాంతంలో గతంలో ఐదారు సార్లు షంటింగ్ ఇంజిన్లు పట్టాలు తప్పాయి.