కొందరు దరికి.. కానరాని కొందరి ఉనికి
కాకినాడ: అల్పపీడనానికి ముందు ఈనెల 16న కడలిపైకి వేటకు వెళ్లి, ప్రతికూలవాతావరణంలో జాడ తెలియకుండా పోయిన బోట్లలో కొన్ని సోమవారం సురక్షితంగా తీరాన్ని చేరుకున్నాయి. కాకినాడ కుంభాభిషేకం వద్దకు చేరుకున్న మూడు బోట్లలో 16 మంది, విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు చేరుకున్న మరో 10 బోట్లలో 61 మంది సురక్షితంగా తీరం చేరారు. ఉప్పాడకు చెందిన ఆరు బోట్లు, తొండంగి మూడు, ఉప్పలంక ఆరు బోట్లు తీరం చేరినట్లు ఆ ప్రాంతాల అధికారులు చెపుతున్నారు. అయితే వాటిలో ఎందరున్నారన్నది తెలియలేదు. మొత్తం మీద వందమంది వరకు సురక్షితంగా తీరానికి చేరుకున్నట్టు అంచనా. కాగా కుంభాభిషేకం వద్ద ఒడ్డుకు చేరుకున్న మత్స్యకారులను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మత్స్య శాఖ డీడీ డి.గోవిందయ్య, ఇతర శాఖల అధికారులు పరామర్శించారు. విశాఖ చేరిన మత్స్యకారులను అక్కడి అధికారులు స్వగ్రామాలకు పంపుతున్నారు. తిరిగి వచ్చిన మత్స్యకారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
పొంతన లేని బోట్లు, మత్స్యకారుల లెక్కలు
నిన్నటి వరకూ 41 బోట్లు గల్లంతయ్యాయన్న మత్స్య శాఖ అధికారులు సోమవారం ఆ సంఖ్య 72 అని, వాటిలో 29 సురక్షితంగా తీరానికి వచ్చాయని అంటున్నారు. వారి లెక్క ప్రకారం ఇంకా 43 బోట్లు రావాలి. అయితే జిల్లా నుంచి 33 బోట్లు సముద్రంలోకి వెళ్లగా 17 వచ్చాయని, 16 రావాల్సి ఉందని కలెక్టరేట్ వర్గాలు ప్రకటించాయి.
ఇక ప్రాంతాలవారీగా మత్స్యకార నాయకులు, బోట్ల యజమానులు చెబుతున్న లెక్కలకు, అధికారుల లెక్కలకు మరీ పొంతనలేదు. మెరైన్ పోలీసులు, కోస్ట్‌గార్డు, నేవల్ అధికారులు ఆయా ప్రాంతాల మత్స్యకారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఇంకా సముద్రంలో ఎన్ని బోట్లులో ఎంత మంది మత్స్యకారులు చిక్కుకున్నారనే అంశంపై మత్స్య, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు ప్రస్తుతం దృష్టి సారించారు. 16న వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న పలు బోట్ల ఇంజన్లను వాటిలోని వారు నిలిపివేయడంతో గాలి ఉధృతికి సుదూర ప్రాంతాలకు కొట్టుకుపోయాయని సమాచారం. బోట్లకున్న వలల కారణంగా మునిగిపోయే ప్రమాదముందని కోసివేయడంతో రూ.లక్షల విలువైన వలలు పోగొట్టుకున్నారు.
నడికడలిలో ఇద్దరి గల్లంతు
కాకినాడ పర్లోపేటకు చెందిన కంచుమర్తి వెంకటేశ్వరరావు (41) బోటు తెరచాప కడుతుండగా సముద్రంలో జారి గల్లంతయ్యాడని తీరం చేరుకున్న సాటి మత్స్యకారులు తెలిపారు. కరప మండలం ఉప్పలంకకు చెందిన బొమ్మిడి పెద కామేశ్వరరావు (65) కూడా ప్రమాదవశాత్తు సముద్రంలో పడి గల్లంతయ్యాడని అతనితో వేటకు వెళ్లిన వారు చెప్పారు. ఆ ఇద్దరి కుటుంబాల్లో వి షాదం నెలకొనగా ఇప్పటి వరకూ తీరం చేరుకోని వారి కుటుంబసభ్యులను ఆందోళన వెన్నాడుతోంది.
ఆచూకీకై ముమ్మర గాలింపు: కలెక్టర్
సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు, బోట్ల ఆచూకీకై గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు కలెక్టర్ అరుణ్‌కుమార్ తెలిపారు. మంగళవారం విశాఖ-కళింగపట్నం-గోపాలపురం మధ్య ఎయిర్‌క్రాఫ్ట్‌తో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. కాగా కొన్ని పడవలు సోమవారం సాయంత్రం విశాఖకు చేరుకున్నాయని తెలిపారు.