డిసెంబర్ నాటికి ‘భగీరథ’ నీరు
నల్లగొండ టూటౌన్ : మిషన్ భగీరథ పథకం ద్వారా డిసెంబర్ 31 నాటికి అన్ని గ్రామాలకు తాగునీరు అందించేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. సింగ్ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. పనులు వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేసే విధంగా కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఒంటరి మహిళలకు పెన్షన్లు మంజూరు చేయడంలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలన్నారు.
అర్హులైన ఒంటరి మహిళలకు ఈనెల 8వ తేదీ నుంచి 13 వరకు గ్రామ పంచాయతీల్లో దరఖాస్తులు స్వీకరించాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లో మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈనెల 18వ తేదీ వర కు దరఖాస్తులను పరిశీలించాలని, 19 నుంచి 21వరకు అర్హులైన వారి జాబితాను పంచాయతీలు, మున్సిపల్ వార్డులలో ప్రదర్శించి అభ్యం తరాలు స్వీకరించాలని కోరారు. అదే విధంగా సాదాబైనామాలపై సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో స్పెషల్‌చీఫ్ సెక్రటరీబీఆర్. మీనా, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, జిల్లా నుంచి కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జేసీ నారాయణరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.