పెళ్లి దుస్తుల్లోనే విగతజీవిగా ప్రవళిక.. పాడె మోసిన ఎమ్మెల్యే ఆనంద్
సాక్షి, వికారాబాద్: వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయిన సంఘటనతో మోమిన్‌పేట, రావులపల్లిలో విషాదఛాయలు నెలకొన్నాయి. మోమిన్‌పేటకు చెందిన సింగిడి దర్శన్‌రెడ్డి కుమార్తె ప్రవళికను మర్పల్లి మండలం రావులపల్లికి చెందిన నవాజ్‌రెడ్డికి ఇచ్చి శుక్రవారం వివాహం జరిపించారు. ఆదివారం ఉదయం తమ బంధువులతో కలిసి మోమిన్‌పేటకు వచ్చిన నవాజ్‌రెడ్డి విందు ముగించుకుని సాయంత్రం కారులో స్వగ్రామానికి బయలుదేరారు.
ఈ క్రమంలో తిమ్మాపూర్ వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎంత చెప్పినా వినకుండా కారు డ్రైవర్ రాఘవేందర్‌రెడ్డి వాహనాన్ని వాగు దాటించే ప్రయ త్నం చేశాడు. నీటి ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. ఈ దుర్ఘటనలో నవ వధువుతో పాటు పెళ్లి కొడుకు రెండో సోదరి శ్వేత మృతిచెందారు. బాలుడు శశాంక్‌రెడ్డి ఆచూకీ లభ్యం కాలేదు.
చదవండి: బంజారాహిల్స్: బ్యూటీ అండ్ స్పా పేరుతో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్
సహాయక చర్యల్లో ఎమ్మెల్యే..
పెళ్లి కారు వాగులో కొట్టుకుపోయిన సమాచారం తెలుసుకున్న వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సోమవారం ఉదయమే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. పోలీసులతో కలిసి గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. వాగు ప్రవాహం, బురద నీటిలో నాలుగు కిలోమీటర్లు నడిచారు. వధవు ప్రవళిక, పెళ్లి కొడుకు అక్క శ్వేత మృతదేహాలు దొరకడంతో స్వయంగా పాడెకట్టి, ఒడ్డుకు చేర్చారు.
బాధిత కుటుంబాలను పరామర్శించి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మోమిన్‌పేటలో ప్రవళిక అంత్యక్రియలు నిర్వహించారు. అందరితో కలుపుగోలుగా ఉండే ప్రవళిక పెళ్లి దుస్తుల్లోనే విగత జీవిగా కనిపించడం అందరినీ కంటతడి పెట్టించింది. నవ వధువు తల్లిదండ్రులు రోధించిన తీరు కలచివేసింది.
మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి సబితా
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగులో కొట్టుకుపోయిన కారు ప్రమాదంలో మృతి చెందిన నవ వధువు ప్రవళిక కుటుంబాన్ని, రావులపల్లిలో వరుడు నవాజ్ రెడ్డి కుటుంబాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ఆమెతోపాటు చేవెళ్ల ఎంపీ రంజీత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే మేతుకు ఆనంద్ ఉన్నారు. అదే విధంగా శంకర్పల్లి మండలం కొత్తపల్లి ఎల్లమ్మ వాగులో కారులో గల్లంతై మృతి చెందిన ఎన్కతల గ్రామానికి చెందిన వెంకటయ్య కుటుంబ సభ్యులను కూడా మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాలు పడే సమయంలో రోడ్లపై, కల్వర్టుల వద్ద వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ చెప్పినట్లు వెల్లడించారు.
డ్రైవర్ బతికే ఉండు..
వాగు ఉధృతిలో కొట్టుకుపోయిన కారు డ్రైవర్ రాఘవేందర్‌రెడ్డి ఆదివారం రాత్రే ప్రమాదం నుంచి బయటపడ్డాడని డీఎస్పీ సంజీవరావు తెలిపారు. మర్పల్లి పీఎస్‌లో సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. వరదలో కొట్టుకుపోయిన కారు కిలోమీటర్ దూరం వెళ్లి, చెట్టు కొమ్మలకు తట్టుకుని ఆగిందన్నారు. ఈ సమయంలో డ్రైవర్ కారులో నుంచి నీటిలో దూకి, ఈదుకుంటూ వెళ్లి రెండు గంటల పాటు చెట్టు కొమ్మలు పట్టుకుని ఉన్నాడన్నారు. వరద తగ్గిన తర్వాత అర్ధరాత్రి ఒడ్డుకు చేరుకున్నట్లు తెలిపారు. ఎవరైనా తనకు ప్రమాదం తలపెట్టే అవకాశం ఉందని భయపడి అదే రాత్రి అంరాద్కుర్దు గ్రామానికి వెళ్లి బంధువుల ఇంట్లో దాక్కున్నట్లు స్పష్టంచేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి రాఘవేందర్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
వృద్ధుడి దుర్మరణం
మోమిన్‌పేట మండల పరిధిలోని ఏన్కతలకు చెందిన శామల వెంకటయ్య(60) ఆదివారం గ్రామానికి చెందిన శ్రీనివాస్, సాయిలతో కలిసి కారులో కౌకుంట్లకు బయలుదేరారు. తిరిగి వచ్చే క్రమంలో శంకర్పల్లి మండలం కొత్తపల్లి వద్ద కారు వరద నీటిలో కొట్టుకుపోయింది. గ్రామస్తుల సహకారంతో శ్రీనివాస్, సాయి ప్రాణాలతో బయటపడగ వెంకటయ్యమృతి చెందాడు. సోమవారం ఏన్కతలలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.