దళితుడిని సీఎం చేయకపోతే తలనరుక్కుంటా అన్నవ్...
హైదరాబాద్: గత ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జి. చిన్నారెడ్డి విమర్శించారు. నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును తాను ఏనాడూ సమర్థించలేదని, ఈ ప్రాజెక్టును సమర్థిస్తూ తన పేరుతో ఒక దినపత్రికలో వచ్చిన వ్యాసం తాను రాయలేదని తోసిపుచ్చారు. ఆ వ్యాసం తాను రాసినట్టు రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి పదే పదే తనపై విమర్శలు చేస్తున్నారని పేర్కొంటూ ఆయన పుష్కర ఘాట్ ల నిర్మాణంలో నాలుగు కోట్ల అవినీతికి పాల్పడ్డారని చిన్నారెడ్డి ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంచనాలను కేసీఆర్ సర్కారు 27 వేల కోట్ల నుంచి 50 వేల కోట్ల రూపాయలకు ఇష్టానుసారంగా పెంచిందని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్... అలా చేయకపోతే తల నరుక్కుంటానంటూ సవాల్ చేశారని, అధికారం రాగానే మాట తప్పారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.