MLA Geeta Reddy
-
దేశంలో మహిళలకు రక్షణ కరువు
జహీరాబాద్ టౌన్ : మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని, మహిళలను పూజించే భారత దేశంలో అత్యాచారాలు, లైంగిక వేధింపుల విషయంలో అగ్రస్థానంలో ఉందని ఎమ్మెల్యే గీతారెడ్డి, పీఏసీ చైర్మన్ గీతారెడ్డి ఆరోపించారు. పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో గల ఆమె నివాసగృహంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యుద్దవాతావరణం ఉన్న అప్ఘనిస్తాన్, సిరియా దేశంలో సైతం మహిళలపై అఘాయిత్యాలు జరగడం లేదన్నారు. శాంతి దేశమైన భారత్‌లో మహిళలకు రక్షణ కరువైందని, హత్యచారాలు, వివక్ష, లైంగిక దాడుల్లో అగ్రస్థానంలో నిలవడం శోచనీయమన్నారు. ఈ విషయం ఎన్‌ఆర్‌పీసీ సర్వే ద్వారా వెల్లడైందన్నారు. ఎన్‌ఆర్‌పీసీ నివేదిక ప్రకారం 2016 సంవత్సంలో 15 వేలు, 2017 సంవత్సరంలో 14 వేల నేరాలు జరిగాయన్నారు. నేషనల్ క్రైమ్స్ రిసర్చ్ బ్యూరో వారు ఇచ్చిన గణాంకల ప్రకారం మహిళల వేదింపుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో రెండవ స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల వివక్షత చూపుతుందన్నారు. రాష్ట్ర క్యాబినేట్లో ఒక్క మహిళ కూడా లేరని, మహిళా కమిషన్ కూడా లేదని ఆమె ఆరోపించారు. ఆర్థికాభివృద్ధిలో రాష్ట్ర నంబర్ వన్ స్థానంలో ఉంటే మహిళల వివిక్షలో కూడా రెండవ స్థానంలో నిలవడం విచారకమన్నారు. రాష్ట్రంలోని దళిత గిరిజన ఐఏఎస్ అధికారుల పట్ల ప్రభుత్వం వివక్షత చూపుతుందని ఆమె ఆరోపించారు. సినియర్ ఐఏఎస్ అధికారులను కాదని జూనియర్స్‌కు పదొన్నతులు కల్పిస్తుందన్నారు. టీఎస్ఐపాస్ పాలసిని రూపొందించిన ఐఏఎస్ అధికారి ప్రదీప్ చంద్రను ప్రిన్సిపల్ సెక్రటరీగా పొడగించలేక పొయిందన్నారు. ప్రభుత్వ విధానం వల్లే పంచాయతీ ఎన్నికలకు బ్రేక్ పండిదని ఎమ్మెల్యే ఆరోపించారు. బీసీలోని అన్ని ఉపకులాలకు న్యాయం జరిగిలా రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు వెళ్లాలని ఆమె కోరారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మంకాల్ సుభాశ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింలు, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల అధ్యక్షులు హన్మంత్‌రావు, పాల్గొన్నారు. -
ప్లీనరీ పేరుతో జల్సాలా?
♦ కరువుతో జనం పస్తులుంటే.. ♦ విందులు చేసుకుంటారా? ♦ టీఆర్ఎస్ తీరును తప్పుపట్టిన ఎమ్మెల్యే గీతారెడ్డి జిల్లాలో కరువు సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నర్సాపూర్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్వహిం చిన నిరసనలో డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే గీతారెడ్డి ఆధ్వర్యంలో జహీరాబాద్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరువు సమయంలో ప్రజలను, రైతులను ఆదుకోవాల్సిన టీఆర్ఎస్ ప్లీనరీ పేరుతో జల్సాలు చేస్తోందని విమర్శించారు. జహీరాబాద్: కరువుతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతుంటే టీఆర్ఎస్ నేత లు మాత్రం ప్లీనరీ పేరుతో జల్సాలు చేయడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యే జె.గీతారెడ్డి విమర్శించారు. బుధవారం ఆమె జహీరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఓవైపు కరువు, మరో వైపు రైతుల ఆత్మహత్యలతో రాష్ట్రం అట్టుడికిపోతుంటే ప్లీనరి పేరుతో 55 రకాల వంటకాలతో సీఎం, మంత్రులు, టీఆర్ఎస్ నేతలు విందు ఆరగించడం ఎంతమాత్రం సబబు కాదన్నారు. ప్రజలు గుక్కెడు నీరు, అన్నం ముద్ద కోసం అల్లాడుతున్నారని గుర్తుచేశారు. ఇటు జనం కడుపులు మాడుతుంటే నేతలు మాత్రం పసందైన వంటకాలతో విందారగించడం విచారకరమన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీని జరుపుకోవడం సరైందే అయినా కరువు పరిస్థితుల దృష్ట్యా సాదా సీదాగా నిర్వహిస్తే సరిపోయేదన్నారు. ఖమ్మం జిల్లా పాలేరులో ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునే టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహిస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. ఖేడ్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసమే ఆ పార్టీ ప్రయత్నిస్తోంది తప్ప ప్రజల బాగోగుల కోసం కాదని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధమవుతున్నారన్నారు. జహీరాబాద్ మండలం రంజోల్ సర్పంచ్ పదవికి ఉప ఎన్నిక జరగనున్నందున అక్కడ అభివృద్ధి కూడా ఇప్పుడే గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలు మేఘనారెడ్డి, కాంగ్రెస్ నాయకులు మంకాల్ సుభాష్, కండెం నర్సింలు, శ్రీనివాస్‌రెడ్డి, షిలారమేష్ పాల్గొన్నారు. -
కొద్దిసేపు ప్యానెల్ స్పీకర్‌గా గీతారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే గీతారెడ్డి శనివారం స్పీకర్ స్థానం నుంచి ప్యానెల్ స్పీకర్‌గా కొద్దిసేపు సభను నడిపారు. హెచ్‌సీయూ, ఉస్మానియా యూనివర్సిటీ ఘటనలపై హోంమంత్రి ప్రకటన అనంతరం ఆ అంశంపై చర్చ జరిగింది. అస్వస్థత కారణంగా స్పీకర్ శనివారం అసెంబ్లీకి రాలేదు. దీంతో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి విధులు నిర్వహించారు. ఆమె భోజన విరామానికి వెళ్లగా స్పీకర్ స్థానంలో గీతారెడ్డి ఉండి కొద్దిసేపు సభను నడిపారు. కాగా, తొలుత ప్యానెల్ స్పీకర్‌గా రావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డిని కోరగా తనకంటే సీనియర్ అయిన గీతారెడ్డి పేరును ఆయన సూచించారు. ‘ఆస్థానంలో కూర్చున్న ఎవరైనా సభను ఆర్డర్లో పెట్టాల్సిందే. గీతారెడ్డి కూడా అదేపని చేశారు. ఆ కుర్చీకి ఉన్న పవర్ అది’ అని అసెంబ్లీ అనంతరం పద్మాదేవేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
ఎస్సీ, ఎస్టీల సంక్షేమాన్ని విస్మరించారు
ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి ధ్వజం ♦ సబ్‌ప్లాన్ నిధుల ఖర్చులో ప్రభుత్వం విఫలం ♦ దళితులపై అత్యాచారాలు జరుగుతున్నా చలనం లేదని విమర్శ సాక్షి, హైదరాబాద్: బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జె.గీతారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 85 శాతం ఉన్నా వారికి బడ్జెట్లో కేవలం 13,400 కోట్ల మేర మాత్రమే కేటాయింపులు చేశారని దుయ్యబట్టారు. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం తెచ్చిందని, కాంగ్రెస్ హయాంలో అదో చరిత్రాత్మక అడుగని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ చట్టాన్ని అన్వయించుకోలేదని, కనీసం మార్గదర్శకాలను తయారు చేసుకోలేదని విమర్శిం చారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్లో కేవలం 50 శాతమే ఖర్చు చేశారన్నారు. గడచిన మూడునాలుగేళ్ళలో రూ.15 వేల కోట్ల సబ్‌ప్లాన్ నిధులు మురిగిపోయాయని అన్నారు. కల్యాణలక్ష్మి పథకంలో కల్యాణం తప్ప లక్ష్మి కనిపించడం లేదని, వచ్చే మొత్తాలకు సైతం లంచాలు ఇవ్వాల్సి వస్తోందని అన్నారు. విదేశాల్లో విద్యనభ్యసించే దళిత విద్యార్థులకు ప్రస్తుతం రూ.10లక్షలు మాత్రమే ఇస్తున్నారని, దాన్ని కనీసం రూ.25లక్షలు పెంచాలన్నారు. అత్యాచారాలు జరుగుతున్నా పట్టదా? కరీంనగర్ జిల్లాలో దళిత యువతిపై అత్యాచారం, అంతకుముందు వరంగల్‌లో జిల్లాలో ఇద్దరు గిరిజన విద్యార్థినుల అనుమానాస్పద హత్యల అంశాలను గీతారెడ్డి ప్రస్తావించారు. ‘వీణవంక కేసులో దళిత యువతి తనపై అత్యాచారం జరిగిందని పోలీస్ స్టేషన్‌కు వస్తే రాత్రి ఎనిమిన్నర నుంచి తెల్లవారు మూడున్నర వరకు సీఐ స్టేషన్లో ఉంచి మానసిక క్షోభకు గురిచేశారు. ఈ విషయంలో ఎస్సైని సస్పెండ్ చేసి డీఎస్పీ, సీఐలను వదిలేశారు. వారినీ సస్పెండ్ చేయాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి. వరంగల్ గిరిజన విద్యార్థుల కేసును మూసేసే ప్రయత్నం చేశారు. కడియం , చందూలాల్ జిల్లా మంత్రులే అయిఉండి న్యాయం చేయలేకపోయారు’ అని అన్నారు. సమయం ఇవ్వకుంటే ధర్నా చేస్తా.. గీతారెడ్డి మాట్లాడుతున్నప్పుడు త్వరగా ముగించాలని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి సూచించారు. మహిళలకు సంబంధించిన అంశంపై మాట్లాడుతున్నప్పుడు అడ్డుపడరాదని అన్నారు. అయినా త్వరగా ముగించాలని డిప్యూటీ స్పీకర్, మంత్రులు కడియం, హరీశ్‌రావులు కోరారు.స్పందించిన గీత ‘మీరు ఇలాగే ప్రవర్తించి నన్ను మాట్లాడనివ్వకుంటే ధర్నా చేస్తా’ అని అన్నారు. దళితులపై జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడేందుకు ఐదు నిమిషాలు ఇవ్వరా? అని ఆమె ప్రశ్నించడంతో డిప్యూటీ స్పీకర్ అదనపు సమయం కేటాయించారు. -
రైతు భరోసాకే రాహుల్ యాత్ర
కొల్చారం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న రైతు వ్యతిరేక విధానాల వల్లే అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారని మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, డీసీసీ అధ్యక్షురాలు వి.సునీతారెడ్డి అన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ ఈనెల 11న జిల్లాలో ‘రైతు భరోసా పాదయాత్ర’ నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం వారు మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే గీతారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి, పీసీసీ ప్రతినిధి శ్రవణ్‌కుమార్ తదితరులతో కలిసి కొల్చారం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా చిన్న ఘనపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. పంజాబ్, విదర్భ, బీహార్‌లో రాహుల్ ‘రైతు భరోసా యాత్ర’ నిర్వహించినట్టు తెలిపారు. తెలంగాణ పర్యటనలో భాగంగా మెదక్ జిల్లాలోని కొల్చారం మండలంలో, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ భరోసా యాత్ర చేపడుతున్నట్టు చెప్పారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లాలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తోన్న రైతు వ్యతిరేక విధానాల వల్లే వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు చెప్పారు. భూసేకరణ ఆర్డినెన్స్ సరికాదు.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్ రైతులకు ఏ మాత్రం ఆమోద యోగ్యం కాదని కాంగ్రెస్ నేత, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వాలు వ్యవహరించాలని సూచించారు. బడ్జెట్లో రూ.23,480 కోట్లు వ్యవసాయం కోసం ప్రకటించినా అందులో ఖర్చుచేసింది స్వల్పమేనన్నారు. ఇందులో యాంత్రీకరణ పరికరాల కోసం జిల్లాకు రూ.100 కోట్లు మంజూరు చేశామని చెబుతున్న ప్రభుత్వం వాటి లెక్కలను చూపడం లేదన్నారు. దీనిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 20 వేల మంది యువ రైతులతో.. రాహుల్‌గాంధీ రైతు భరోసా యాత్రను కార్యకర్తలు, పార్టీ నాయకులు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గీతారెడ్డి కోరారు. పాదయాత్రలో పాల్గొనేందుకు 20 వేల మంది యువ రైతులు తరలివస్తున్నారని చెప్పారు. సమావేశంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ఎం.జైపాల్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి శశిధర్‌రెడ్డి, డాక్టర్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మధుసూదన్‌రావు, సేవాదళ్ కమిటీ జిల్లా అధ్యక్షులు అమరసేనారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, ఆప్కో డెరైక్టర్ అరిగే రమేశ్, మండల పరిషత్ ఉపాధ్యక్షులు మేఘమాల సంతోష్‌కుమార్, మండల పార్టీ నాయకులు నరేందర్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.