ఎస్సీ, ఎస్టీల సంక్షేమాన్ని విస్మరించారు
ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి ధ్వజం
♦ సబ్‌ప్లాన్ నిధుల ఖర్చులో ప్రభుత్వం విఫలం
♦ దళితులపై అత్యాచారాలు జరుగుతున్నా చలనం లేదని విమర్శ
సాక్షి, హైదరాబాద్: బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జె.గీతారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 85 శాతం ఉన్నా వారికి బడ్జెట్‌లో కేవలం 13,400 కోట్ల మేర మాత్రమే కేటాయింపులు చేశారని దుయ్యబట్టారు. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం తెచ్చిందని, కాంగ్రెస్ హయాంలో అదో చరిత్రాత్మక అడుగని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ చట్టాన్ని అన్వయించుకోలేదని, కనీసం మార్గదర్శకాలను తయారు చేసుకోలేదని విమర్శిం చారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్లో కేవలం 50 శాతమే ఖర్చు చేశారన్నారు. గడచిన మూడునాలుగేళ్ళలో రూ.15 వేల కోట్ల సబ్‌ప్లాన్ నిధులు మురిగిపోయాయని అన్నారు. కల్యాణలక్ష్మి పథకంలో కల్యాణం తప్ప లక్ష్మి కనిపించడం లేదని, వచ్చే మొత్తాలకు సైతం లంచాలు ఇవ్వాల్సి వస్తోందని అన్నారు. విదేశాల్లో విద్యనభ్యసించే దళిత విద్యార్థులకు ప్రస్తుతం రూ.10లక్షలు మాత్రమే ఇస్తున్నారని, దాన్ని కనీసం రూ.25లక్షలు పెంచాలన్నారు.
అత్యాచారాలు జరుగుతున్నా పట్టదా?
కరీంనగర్ జిల్లాలో దళిత యువతిపై అత్యాచారం, అంతకుముందు వరంగల్‌లో జిల్లాలో ఇద్దరు గిరిజన విద్యార్థినుల అనుమానాస్పద హత్యల అంశాలను గీతారెడ్డి ప్రస్తావించారు. ‘వీణవంక కేసులో దళిత యువతి తనపై అత్యాచారం జరిగిందని పోలీస్ స్టేషన్‌కు వస్తే రాత్రి ఎనిమిన్నర నుంచి తెల్లవారు మూడున్నర వరకు సీఐ స్టేషన్‌లో ఉంచి మానసిక క్షోభకు గురిచేశారు. ఈ విషయంలో ఎస్సైని సస్పెండ్ చేసి డీఎస్పీ, సీఐలను వదిలేశారు. వారినీ సస్పెండ్ చేయాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి. వరంగల్ గిరిజన విద్యార్థుల కేసును మూసేసే ప్రయత్నం చేశారు. కడియం , చందూలాల్ జిల్లా మంత్రులే అయిఉండి న్యాయం చేయలేకపోయారు’ అని అన్నారు.
సమయం ఇవ్వకుంటే ధర్నా చేస్తా..
గీతారెడ్డి మాట్లాడుతున్నప్పుడు త్వరగా ముగించాలని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి సూచించారు. మహిళలకు సంబంధించిన అంశంపై మాట్లాడుతున్నప్పుడు అడ్డుపడరాదని అన్నారు. అయినా త్వరగా ముగించాలని డిప్యూటీ స్పీకర్, మంత్రులు కడియం, హరీశ్‌రావులు కోరారు.స్పందించిన గీత ‘మీరు ఇలాగే ప్రవర్తించి నన్ను మాట్లాడనివ్వకుంటే ధర్నా చేస్తా’ అని అన్నారు. దళితులపై జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడేందుకు ఐదు నిమిషాలు ఇవ్వరా? అని ఆమె ప్రశ్నించడంతో డిప్యూటీ స్పీకర్ అదనపు సమయం కేటాయించారు.