ఎడారి నివారణ.. ఎండమావే!
► రాయదుర్గం నియోజకవర్గంలో వేగంగా ఎడారీకరణ
► నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలం
► అమలు కాని ‘కాలవ’ హామీలు
► సంబరాలకే సరి
రాయదుర్గం :
టీడీపీ రెండేళ్ల పాలనలో రాయదుర్గం నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధికీ నోచుకోలేదు. నీరు– చెట్టు, మేల్కొలుపు, చదువుల ఒడి అంటూ సంబరాలు చేసుకున్నారు తప్ప.. అభివృద్ధి మాత్రం ఏమీ లేదు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ)కు నీరు, ఎడారి నివారణ చర్యలు, రవాణా వ్యవస్థ మెరుగుదల, పరిశ్రమల స్థాపన, ఎన్‌హెచ్–4తో రోడ్ల అనుసంధానం.. ఇలా అన్ని హామీలు అలాగే ఉండిపోయాయి.
రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్, కణేకల్లు మండలాల్లో 20,334 హెక్టార్ల విస్తీర్ణంలో ఇసుక మేటలు వెలిశాయి. దీనివల్ల పది పంచాయతీల్లో ప్రజల జీవన విధానంపై ప్రత్యక్ష ప్రభావం పడుతోంది. ఇక్కడ ఎడారీకరణ శరవేగంగా సాగుతోంది. ఎడారి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక బృందాల ద్వారా రూ.61 కోట్లతో రూపొందించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు గత ఏడాది జనవరి 14న ప్రకటించారు. అంతకు మునుపే ఎడారి నివారణకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కోరానని, ఆయన రూ.16 కోట్లు మంజూరు చేశారని చెప్పారు.
మొత్తం రూ. 77 కోట్లతో శాశ్వత ప్రణాళిక ద్వారా ఎడారి నివారణకు చర్యలు చేపడతామన్నారు. అలాగే 2015 ఏప్రిల్ 23న కణేకల్లు మండలం నాగేపల్లి, తుంబిగనూరు గ్రామాల వద్ద ఇసుక తొలగింపు పనులు ఆర్భాటంగా ప్రారంభించారు. ఇసుక దిబ్బలను తొలగిస్తూ, ఆ ఇసుకను రైతుల నల్లరేగడి భూముల్లో వేస్తామని ప్రకటించారు. దీంతో ఈ ప్రాంత రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అయితే.. వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఇసుక తొలగింపులో ప్రభుత్వపరంగా చిత్తశుద్ధి చూపలేదు. రైతులు సొంత ఖర్చుతో ఇసుకను పొలాలకు తోలుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు, జరిగిన పనులకు పొంతనే కన్పించడం లేదు. కోట్లాది రూపాయల నిధులు ఇసుకలో కలిసిపోయాయి. రైతులకు ఒరిగిందేమీ లేదు.
సర్వేతోనే సరి
‘హంద్రీ–నీవా ద్వారా జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరిన కృష్ణా జలాలను లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతిలో బీటీ ప్రాజెక్టుకు చేర్చి కరువు రైతు కన్నీటిని తుడిచేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రూ.1.42 కోట్లతో డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) సర్వే పనులకు తొలి అడుగు పడింది’ అని ఈ ఏడాది జనవరి 27న భైరవానితిప్పలో నిర్వహించిన రైతుల సమావేశంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుతో పాటు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి ప్రకటించారు. ఇది కూడా ప్రచార ఆర్భాటమేనని తేలిపోయింది. మూడు నెలల్లో సర్వే నివేదికలు వస్తాయని అప్పట్లో కాలవ చెప్పారు. ఏడు నెలలు గడిచినా అతీగతీ లేదు.