కుక్కకాటుపై స్పందించరేం!
అసెంబ్లీలో జలీల్‌ఖాన్ ధ్వజం
కొల్లేరు సమస్యపై చిత్తశుద్ధితో వ్యవహరించాలని సూచించిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని
రోజాపై గోరంట్ల వ్యాఖ్యలను ఖండించిన పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన
కృష్ణానదిలో మురుగునీరు కలవకుండా నిరోధించాలన్న గద్దె
జవాబులకే పరిమితమైన జిల్లా మంత్రులు
నగరంలో ఒక బాలుడిని కుక్కలు కరిస్తే.. ప్రభుత్వాస్పత్రిలో మందులే అందుబాటులో లేకపోవడాన్ని చూస్తే ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుస్తోంది. కుక్కకాటుకు మందు లేకుండా ఆస్పత్రులు నడుస్తున్నాయి. నగరంలో కుక్కలు స్వైరవిహారం చేస్తుంటే పాలకులు పట్టించుకోవడం లేదు. అని పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మంగళవారం అసెంబ్లీలో గళమెత్తారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతున్నప్పుడు అసెంబ్లీలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లేకపోవడం గమనార్హం.
విజయవాడ : ఐదురోజులపాటు జరిగిన రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల్లో పలు సమస్యలపై జిల్లా ఎమ్మెల్యేలు చర్చించారు. రాష్ట్ర అసెంబ్లీలో జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, డెప్యూటీ స్పీకర్ ఉన్నప్పటికీ జిల్లాకు అవసరమైన అనేక అంశాలపై స్పందించలేదు. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ శాసనసభ్యులు.. కొల్లేరు, సీఆర్డీఏ, ఆస్పత్రుల్లో మందుల కొరత తదితర అంశాలపై అధికారపక్షాన్ని నిలదీశారు. సీఆర్డీఏ బిల్లుపై చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ శాసనసభ డెప్యూటీ ఫ్లోర్‌లీడర్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) మాట్లాడుతూ రైతుల భూములతో ప్రభుత్వం వ్యాపారం చేయడం మంచిది కాద న్నారు. పైగా అక్కడ నివసిస్తున్న పేదలు, వ్యవసాయకూలీలు, కార్మికులు, చేతివృత్తుల వారి గురించి సీఆర్డీఏ బిల్లులో ఎటువంటి ప్రస్తావనా లేకపోవడాన్ని నిలదీశారు. వారికి అన్యాయం చేయాలని చూస్తే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
రాజధాని కోసం భూములు సేకరించే తాడేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలను విన్నామని, వారు చెబుతున్న ప్రకారం అక్కడ భూములు లేని పేదలు, కౌలు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని చెప్పారు. వారికి తగిన విధంగా ప్రభుత్వం భారీస్థాయిలో సాయం అందించకుంటే పోరాటాన్ని ఉధృతం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కొల్లేరు కాంటూరు అంశంపై చర్చలో భాగంగా నాని మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి తీర్మాన కాపీలు ఇచ్చారని, ఇప్పుడేదో ప్రత్యేకంగా కొల్లేరుపై ఐదు నుంచి మూడు వరకు కాంటూరును తగ్గిస్తున్నట్లు చెప్పుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని తెలిపారు. ఇప్పటికైనా చిత్తశుద్ధితో కాంటూరు కుదింపు చేసి అక్కడి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు.
గోరంట్ల వ్యాఖ్యలకు ఖండన
వైఎస్సార్సీపీ పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ మహిళలపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని ప్రశ్నించారు. టీడీపీ నాయకులకు మహిళలపై ఏపాటి గౌరవం ఉందో అర్థమవుతోందన్నారు. తూర్పు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ నగరంలోని మురుగునీరు కృష్ణానది, కాలువల్లో కలుస్తుండటంతో మంచినీరు కలుషితమవుతోందన్నారు. జిల్లాలోని పలు మండలాల్లో ఉన్న ప్రజలు ఈ నీటినే తాగుతున్నారని, ఇందువల్ల తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మురుగునీటిని కాలువల్లో కలపకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మంత్రులు కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరావు ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. మిగిలిన ఎమ్మెల్యేలు కుర్చీలకే పరిమితమయ్యారు.