ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ తిండి,నిద్ర ఇక అక్కడే
నాచారం: ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ‘సాక్షి’ దినపత్రిక వినూత్న రీతిలో చేపట్టిన ‘సాక్షి జనసభ’ ఫలాలు ప్రజలకు చేరే సమయం ఆసన్నమైంది. ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో ‘సాక్షి’ జనసభల సందర్భంగా ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రకటించిన మేరకు ‘48 గంటల బస్తీల్లో బస’ కార్యక్రమానికి శనివారం అంకురార్పణ జరుగుతోంది. నాచారం డివిజన్ జనసభ హెచ్ఎంటీ నగర్ కమ్యూనిటీ హాల్లో మే 13న సాక్షి జనసభ జరిగింది. ఆ సందర్భంగా డివిజన్లో 48 గంటలపాటు బస చేసి.. బస్తీల్లో వివిధ అభివృద్ధి పనులకు రూ. 48 లక్షలు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే ప్రభాకర్ ప్రకటించారు.
అలాగే నియోజకవర్గం పరిధిలో జరిగిన ప్రతి డివిజన్ జనసభలోనూ ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని.. ‘సాక్షే సాక్ష్యం’గా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఎమ్మెల్యే ప్రకటించిన విషయం పాఠకులకు విదితమే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు నాచారం డివిజన్లోనే గడపనున్నట్లు ఎమ్మెల్యే ప్రభాకర్ స్పష్టం చేశారు. ‘48 గంటల పాటు బస్తీల్లోనే తిండి.. నిద్ర సర్వస్వం’ అని ఎమ్మెల్యే ప్రకటించారు.
శనివారం ఉదయం స్నేహపురి కాలనీ పార్క్ నుంచి పాదయాత్ర ప్రారంభించి వీఎస్టీ కాలనీ, భవానీగనర్, కార్తికేయ నగర్, ఎర్రకుంట, నాచారం విలేజ్, అంబేడ్కర్ నగర్, సావర్కర్ నగర్ కాలనీల మీదుగా కొసాగుతుందన్నారు. రెండో రోజు ఆదివారం రాఘవేంద్ర నగర్, అన్నపూర్ణ కాలనీ, ఇందిరానగర్, సాయినగర్, బాపూజీనగర్, హెచ్ఎంటీనగర్ కాలనీలలో పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. 48 గంటలు నాచారం డివిజన్లో 13 విభాగాల అధికారులతో కలిసి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తానని తెలిపారు.