Mla rameshbabu
-
రైతుకు నిజమైన పండుగరోజు
మేడిపెల్లి : రైతుకు రైతుబంధు చెక్కులను అందజేసిన ఈ రోజు రైతుకు పండుగరోజు అని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. మండలంలోని కట్లకుంటలో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా మొదట చెక్కుల పంపిణీ కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం రైతులకు పూలదండ వేసి చెక్కులు, పట్టాదారు పాస్నుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్‌బాబు మాట్లాడుతూ రైతులకు తెలంగాణ సర్కార్ అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. రైతులకు పంట పెట్టుబడి కోసం ఇతరుల వద్ద అప్పులు చేయవద్దన్న ఉద్దేశంతో రైతుబంధు చెక్కులను అందజేస్తుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండుగ చేసుకొంటున్నారని చెప్పారు. మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి మాట్లాడుతూ రైతులు రైతుబంధు చెక్కులను పంట పెట్టుబడికి మాత్రమే ఉపయోగించాలని సూచించారు. సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడంతో పాటు పండించిన పంటలకు మద్ధతు ధర కల్పిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. ఇప్పుడు పంట పెట్టుబడి కింద చెక్కులు ఇవ్వడం తెలంగాణ రైతుల అదృష్టమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కుందారపు అన్నపూర్ణ, వ్యవసాయశాఖ ఏడీఏ రాజేశ్వర్, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో హరికిషన్, ఏవో త్రివేదిక, జిల్లా రైతు సమన్వత కమిటీ సభ్యుడు కాటిపెల్లి శ్రీపాల్‌రెడ్డి, సర్పంచ్ చెట్ట గంగరాజు, ఎంపీటీసీ సురకంటి విజయ, సింగిల్‌విండో చైర్మన్లు మిట్టపెల్లి భూమరెడ్డి, వొద్దినేని హరిచరణ్‌రావు, మామిడి తిరుపతిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముక్కెర గంగాధర్, టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు సుధవేని గంగాధర్‌గౌడ్, నాయకులు నారాయణరెడ్డి, హైమద్, గంగారాం, భూమేశ్, దాసు, ప్రభాకర్, రవీందర్, గాజీపాషలు, గ్రామస్తులు, రైతులు, అధికారులు పాల్గొన్నారు. -
న్యాయం చేయండి
ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయూలి ఇసుకలారీలు అడ్డుకున్న సంకెపల్లి గ్రామస్తులు వేములవాడ రూరల్ : తమకు న్యాయం జరిగే వరకు గ్రామ శివారు నుంచి ఇసుకను తరలించేది లేదని సంకెపల్లి గ్రామస్తులు శుక్రవారం ఆందోళనకు దిగారు. మధ్యమానేరు నిర్మాణంతో సంకెపల్లి గ్రామస్తుల వ్యవసాయ భూములు ముంపునకు గురవుతుండగా.. కొన్ని భూములకు మాత్రమే పరిహారం వచ్చిందని, మిగతా భూములకు సైతం త్వరగా ఇవ్వాలని కోరారు. దీనిపై అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యే రమేశ్‌బాబును గురువారం కలిసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక తోడుతున్న వాహనాల ముందు బైఠాయించారు. ఈవిషయం తెలుసుకున్న పట్టణ సీఐ శ్రీనివాస్, తహశీల్దార్ రమేశ్, ఎస్సై సైదారావు సిబ్బందితో అక్కడికి చేరుకుని మాట్లాడిన గ్రామస్తులు పట్టించుకోలేదు. కలెక్టర్, ఆర్డీవోల నుంచి హామి వచ్చే వరకు తాము ఈ ఆందోళనను విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని సిరిసిల్ల ఆర్డీవో బిక్షానాయక్ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు . నిర్వాసితుల డిమాండ్లు గ్రామస్తులందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయూలి. పూర్తి స్థాయి ముంపు గ్రామంగా ప్రకటించి, పరిహారం అందించాకే ఇసుకను తీసుకువెళ్లాలి. -
రాజన్నకు మహర్దశ
రూ.250 కోట్లతో {పతిపాదనలు సిద్ధం సీఎం రాకే తరువాయి ఊపందుకోనున్నరాజన్న గుడి అభివృద్ధి వేములవాడ అర్బన్ : తెలంగాణలోనే అతి పెద్ద దేవాలయమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి క్షేత్రాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. ఆలయ అభివృద్ధి కోసం రూ.250 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉంచారు. సీఎం కేసీఆర్‌ను వేములవాడకు తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే రమేశ్‌బాబు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం టూర్ ఖరారుకు ముందుగానే అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసి ఉంచుతోంది. నెల రోజులుగా ఇంజినీరింగ్ విభాగం అధికారులు రూ.250 కోట్ల ప్రతిపాదనల తయారీ, పవర్ పాయింట్ ప్రజంటేషన్లపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా వచ్చే 30 ఏళ్లకు సరిపడా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇందులో పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం 500 వసతిగదుల నిర్మాణం, ఆదాయవ్యయాలను చూపించే పట్టిక సిద్ధం చేశారు. రూ.15 కోట్లతో కల్యాణ మంటపాల ఏర్పాటు, రూ.80 కోట్లతో గుడి చెరువునకు ఉత్తర భాగంలో 121 ఎకరాల భూమి కొనుగోలు, రూ.15 కోట్లతో దేవస్థానం రెండో ప్రాకారం, రూ.10 కోట్లతో ధర్మగుండం పునరుద్ధరణ చేపట్టనున్నారు. రూ.60 కోట్లతో గుడి చెరువు ఈశాన్యభాగం పునరుద్ధరణ, ఉత్తర భాగంలో ఆధ్యాత్మిక ఉద్యానవనం, రూ.30 కోట్లతో శివపురం, శంకరపురం వద్ద 300 వసతి గదులు, రూ.10 కోట్లతో వేద-ఆగమ-సంగీత-నాట్య కళాశాల ఏర్పాటు, రూ.5 కోట్లతో బద్దిపోచమ్మ ఆలయానికి క్యూ కాంప్లెక్స్, రూ.15 కోట్లతో రాజేశ్వరపురం వద్ద చౌల్ట్రీల నిర్మాణం, రూ.10 కోట్లతో నాంపల్లి దేవాలయం అభివృద్ధి పనులకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన బుక్‌లెట్‌ను సిద్ధం చేసి ఉంచారు. ఇప్పటికే సీఎం కార్యాలయానికి ఈ బుక్‌లెట్‌ను అందజేసినట్లు తెలిసింది. వీటితోపాటు సీఎం కేసీఆర్ రాకతో మరిన్ని అభివృద్ధి పనులు సాధించుకునే అవకాశం ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇందులో ఒక్కో అంశానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన బుక్‌లెట్‌ను అధికారులు సిద్ధం చేసి ఉంచారు. ఈ పనులన్నీ పూర్తయితే రాజన్న గుడి భూతల స్వర్గంగా భక్తులకు దర్శనమివ్వనుందని జనం చర్చించుకుంటున్నారు.