రూ.250 కోట్లతో {పతిపాదనలు సిద్ధం
సీఎం రాకే తరువాయి
ఊపందుకోనున్నరాజన్న గుడి అభివృద్ధి
వేములవాడ అర్బన్ : తెలంగాణలోనే అతి పెద్ద దేవాలయమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి క్షేత్రాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. ఆలయ అభివృద్ధి కోసం రూ.250 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉంచారు. సీఎం కేసీఆర్‌ను వేములవాడకు తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే రమేశ్‌బాబు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం టూర్ ఖరారుకు ముందుగానే అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసి ఉంచుతోంది. నెల రోజులుగా ఇంజినీరింగ్ విభాగం అధికారులు రూ.250 కోట్ల ప్రతిపాదనల తయారీ, పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లపై దృష్టి సారించాయి.
ఇందులో భాగంగా వచ్చే 30 ఏళ్లకు సరిపడా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇందులో పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం 500 వసతిగదుల నిర్మాణం, ఆదాయవ్యయాలను చూపించే పట్టిక సిద్ధం చేశారు. రూ.15 కోట్లతో కల్యాణ మంటపాల ఏర్పాటు, రూ.80 కోట్లతో గుడి చెరువునకు ఉత్తర భాగంలో 121 ఎకరాల భూమి కొనుగోలు, రూ.15 కోట్లతో దేవస్థానం రెండో ప్రాకారం, రూ.10 కోట్లతో ధర్మగుండం పునరుద్ధరణ చేపట్టనున్నారు.
రూ.60 కోట్లతో గుడి చెరువు ఈశాన్యభాగం పునరుద్ధరణ, ఉత్తర భాగంలో ఆధ్యాత్మిక ఉద్యానవనం, రూ.30 కోట్లతో శివపురం, శంకరపురం వద్ద 300 వసతి గదులు, రూ.10 కోట్లతో వేద-ఆగమ-సంగీత-నాట్య కళాశాల ఏర్పాటు, రూ.5 కోట్లతో బద్దిపోచమ్మ ఆలయానికి క్యూ కాంప్లెక్స్, రూ.15 కోట్లతో రాజేశ్వరపురం వద్ద చౌల్ట్రీల నిర్మాణం, రూ.10 కోట్లతో నాంపల్లి దేవాలయం అభివృద్ధి పనులకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన బుక్‌లెట్‌ను సిద్ధం చేసి ఉంచారు. ఇప్పటికే సీఎం కార్యాలయానికి ఈ బుక్‌లెట్‌ను అందజేసినట్లు తెలిసింది. వీటితోపాటు సీఎం కేసీఆర్ రాకతో మరిన్ని అభివృద్ధి పనులు సాధించుకునే అవకాశం ఉంటుందని టీఆర్‌ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇందులో ఒక్కో అంశానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన బుక్‌లెట్‌ను అధికారులు సిద్ధం చేసి ఉంచారు. ఈ పనులన్నీ పూర్తయితే రాజన్న గుడి భూతల స్వర్గంగా భక్తులకు దర్శనమివ్వనుందని జనం చర్చించుకుంటున్నారు.
రాజన్నకు మహర్దశ
Published Mon, May 25 2015 5:02 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM
Advertisement