సమాజాన్ని మేల్కొలిపేందుకే నాటికలు
మార్టూరు : సమాజాన్ని మేల్కొలపడంలో నాటికలు కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ఆయన మార్టూరులోని శ్రీకారం కళాపరిషత్ రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూరు వారి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి నాటికల పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీవీ, సినిమా రాక ముందు గ్రామీణులకు విజ్ఞానాన్ని, వినోదాన్ని నాటికలు అందించాయన్నారు. సమాజాన్నే ఇతివృత్తంగా తీసుకుని మంచి చెడులను బేరీజు వేస్తూ చక్కటి సందేశాన్ని నాటికలు అందిస్తాయన్నారు.
కళలను, కళాకారులను అందరం గౌరవించాలన్నారు. మన సంసృ్కతి సాంప్రదాయాలను నాటికలు ప్రతిబింబిస్తాయన్నారు. కార్యక్రమంలో సినీ నటి కవిత, రోటరీ గవర్నర్ మల్లాది వాసుదేవ్, శ్రీకారం కళాపరిషత్ అధ్యక్షులు కందిమళ్ల సాంబశివరావు, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ జాస్తి వెంకటమోహనరావు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సినీ నటి కవిత, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రోటరీ గవర్నర్ వాసుదేవ్లను ఘనంగా సన్మానించారు.
రైతును ఆదుకోకపోతే అధోగతే
సందేశాన్ని ఇచ్చిన ఆకుపచ్చ సూర్యుడు నాటిక
గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు రచించిన ఆకుపచ్చ సూర్యుడు నాటిక ప్రేక్షకులను అలరించింది. అన్నదాతల భారతంలో ఆత్మహత్యల పర్వం కొనసాగుతోంది. అప్పుల బాధతో రైతులు బలవన్మరణాలు పొందుతున్నారు. ఎన్నికలప్పుడు రైతే రాజు అంటున్న పార్టీలు ఎన్నికలయిన తర్వాత వారిని పట్టించుకోవడం లేదు. రైతుకి, భూదేవికి సహనం చచ్చిపోతే ఉక్రోశం, ఆక్రోశం, పగిలితే ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది. ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే దేశ ప్రగతి ఉండదనే సందేశం ఇచ్చింది. జనశ్రేణి విజయవాడు వారు ప్రదర్శించిన పరోపకారమే పరమావధి, బాధిత ఆడపిల్లలను గౌరవించాలని సందేశాన్నిచ్చిన అగ్నిపుష్పాలు నాటిక అందరినీ ఆకట్టుకున్నాయి.