‘పోలవరం’పై రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం
ఎమ్మెల్సీ కంతేటి విమర్శ
భీమవరం : రాష్ట్రంలోని అధికార టీడీపీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తూ కలహాల కాపురం చేయకుండా కేంద్రంతో కలిసిమెలిసి ముందుకు సాగాలని ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు హితవు చెప్పారు. శుక్రవారం భీమవరంలో విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో నిధులు కేటాయించడంలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని, ఇది ఎంతమాత్రం తగదన్నారు.
ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులకు సరైన లెక్కలు చూపకపోవడం వల్లే పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయింపులో జాప్యం జరుగుతోందని సత్యనారాయణరాజు వివరించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వడం లేదంటూ టీడీపీ ఆరోపణలు చేస్తోందని అయితే ప్రత్యేక హోదా కంటే మెరుగైన అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపించడానికి కేంద్రం కృషి చేస్తుందన్నారు. కేంద్ర నిధులతో రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ పనులను పక్కన బెట్టి పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదాపై అసత్యప్రచారాన్ని ఆపి టీడీపీ నాయకులు కేంద్రంతో కలిసి పనిచేయాలని తద్వారా రాష్ట్రాభివృద్ధిని మరింత మెరుగుపర్చుకోవాలని సత్యనారాయణరాజు తెలిపారు.