ప్రజలపై భారం మోపడం తగదు
కర్నూలు (ఓల్డ్‌సిటీ) : పెట్రో ధరలు పెంచి ప్రజలపై భారాన్ని మోపడం తగదని ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు అన్నారు. శనివారం స్థానిక కళావెంకట్రావు కార్యాలయంలో డీసీసీ నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం.. చమురు కంపెనీలు కూడబలుక్కుని పెట్రోల్, డీజిల్ ధరలను తరచుగా తగ్గిస్తూ, అధికంగా పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నాయని ఆరోపించారు. మాజీ జెడ్పీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి మాట్లాడుతూ ధరలు పెంచడంలో ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు చూపడం లేదన్నారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు శివకుమార్, శ్రీనివాసులు రెడ్డి, వెంకటస్వామి, జయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
ఏఐటీయూసీ వినూత్న నిరసన
కర్నూలు: పెట్రో ధరలను వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినూత్న తరహాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.మునెప్ప, గౌరవాధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ శనివారం కలెక్టరేట్ వద్ద ఆటోలకు తాళ్లను కట్టి లాగుతూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మునెప్ప మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేపదే పెట్రో, డీజిల్ ధరలు పెంచుతూ వినియోగదారుల నడ్డి విరుస్తోందన్నారు. తక్షణమే పెంచిన పెట్రో, డీజిల్ ధరలను తగ్గించి చమురు ధరలపై నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆటో యూనియన్ నాయకులు రామునాయక్, ఈశ్వర్, రమణ, రాము, మధు, అక్బర్‌తో పాటు ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పెంచిన ధరలను తగ్గించాలి
కర్నూలు(రాజ్‌విహార్): పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం నగర కార్యదర్శి గౌస్‌దేశాయ్ డిమాండ్ చేశారు. శనివారం నగర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై భారాలు మోపడమే లక్ష్యంగా పనిచేస్తోందనన్నారు. అందులో భాగంగా నెల రోజుల వ్యవధిలో రెండో సారి చమురు ధరలు పెంచి మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంతో రవాణ చార్జీలు కూడా పెరుగుతాయన్నారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. నగర నాయకులు రాముడు, రాజగోపాల్, నాగరాజు, రాజశేఖర్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.