ఫ్యాన్సీ నెంబర్ కోసం ఎమ్మెల్సీ బెదిరింపులు!
విజయవాడ: వాహనానికి ఫ్యాన్సీ నెంబర్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తిపై టీడీపీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్ అనుచరులు వీరంగం చేశారు. టెండర్ నుంచి తప్పుకోకపోతే ఎత్తేస్తామని, ఎమ్మెల్సీ వాహనానికే పోటీ వచ్చేటంతటోడివా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. తనలాంటి వీఐపీలకే ఇలాంటి నెంబర్స్ అవసరం కానీ, లేబర్ వాడికి ఎందుకు అంటూ ఎమ్మెల్సీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఉయ్యూరు ఆర్టీవో కార్యాలయం వద్ద గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీ 16డీడీ 7777 నెంబర్ కోసం ఇద్దరు దరఖాస్తు చేసుకున్నారు. ఒకరు ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అనుచరుడు ప్రవీణ్‌కుమార్ కగా, మరోవ్యక్తి పేరు వినయ్‌కుమార్. ఫ్యాన్సీ నెంబర్ తమకే దక్కాలంటూ ఎమ్మెల్సీ అనుచరులు రెచ్చిపోయారు.
ఆర్టీవో కార్యాలయం వద్దకు ఇరువర్గాలు రావడంతో ఆ ఫ్యాన్సీ నెంబర్ తమ వాహనానికే దక్కాలని, టెండర్ నుంచి తప్పుకోవాలని వినయ్‌కుమార్‌పై బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ తతంగాన్ని రవివర్మ అనే వ్యక్తి తన మొబైల్లో చిత్రీకరించడానికి యత్నించాడు. అనుచరులు ఫోన్ కలుపగా ఫోన్లోనే ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, రవివర్మను దుర్భాషలాడారు. నాలాంటి వీఐపీకి ఫ్యాన్సీ నెంబర్ కావాలి కానీ.. లేబర్ వాడికి కాదు.. మరోసారి ఎవరినైనా కొట్టేటప్పుడు మళ్లీ మొబైల్లో రికార్డు చేసుకో అంటూ రవివర్మ అనే వ్యక్తిపై కూడా బెదిరింపులకు పాల్పడ్డారు.