MNJ
-
కేన్సర్‌పై అవగాహన రన్
ఖైరతాబాద్: కేన్సర్‌పై అవగాహన కల్పిస్తూ ఆదివారం నెక్లెస్ రోడ్డులో సూరజ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో వాక్ పర్ హోప్ పేరుతో 5కే రన్ నిర్వహించారు. ఎంఎన్‌జే కేన్సర్ హాస్పిటల్ వైద్యులు, బసవతారకం కేన్సర్ హాస్పిటల్, గాంధీ, ఉస్మానియా, కిమ్స్, నిమ్స్, అపోలో హాస్పిటల్స్ వైద్యులతో పాటు వివిధ విభాగాల ఉన్నత స్థాయి ఇంజనీరింగ్, సామాజిక వాదులు కుటుంబ సమేతంగా రోజు రోజుకు పెరుగుతున్న కేన్సర్‌కి ప్రధాన కారణం అవగాహన లేకపోవడమేనన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ మొదటి దశలో కేన్సర్‌ను గుర్తించి సరైన చికిత్స అందిస్తే మహమ్మారి నుంచి పూర్తిగా తప్పించుకోవచ్చన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకే రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రన్లో డాక్టర్లు మధుసూదన్, డాక్టర్ విశాల్, డాక్టర్ పల్లవి, డాక్టర్ అశ్విని, సత్యనారాయణ, శ్యాంనాయక్, జగన్ యాదవ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
హ్యాట్సాఫ్ ఎంఎన్‌జే
అత్యాధునిక ల్యాపరోస్కోపి సర్జరీతో కేన్సర్ రోగులకు పునర్జన్మ 20 నెలల్లో 300కు పైగా శస్త్ర చికిత్సలు అడయార్, కిద్వాయ్లకు దీటుగా ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స అత్యాధునిక ల్యాపరోస్కోపి సర్జరీతో కేన్సర్ రోగులకు పునర్జన్మ ప్రసాదిస్తోంది ‘ఎంఎన్‌జే’. ఈ సర్జరీలు కేన్సర్ బాధితులకు వరంగా మారాయి. 20 నెలల్లో 300 సర్జరీలు చేసిన ‘ఎంఎన్‌జే’ వైద్యులు ఎంతో మందికి కేన్సర్ నుంచి విముక్తి కల్పించారు. అరణ్య రోదనలు, బాధితుల బాధలు, బంధువుల దు:ఖాలు.. కేన్సర్ రోగులతో ఎప్పుడూ రద్దీగా ఉండే ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో సహజంగా కనిపించే చిత్రమిది. అయితే ఇది కనిపించే గాథ.. కనిపించని ఆస్పత్రి విజయగాథ ‘ఆపరేషన్ థియేటర్’లో దాగుంది. ఒక్కసారి ఆపరేషన్ థియేటర్‌ను పలకరిస్తే ఈ బాధలకు మించిన సంతోషాలు, కాటేసే కేన్సర్ నుంచి విముక్తి పొందిన బాధితుల మోముల్లో చిరునవ్వు, అహరహం శ్రమించి శస్త్రచికిత్స చేసిన వైద్య నిపుణుల్లో సంతృప్తి మనకు కనిపిస్తాయి. - సాక్షి, సిటీబ్యూరో వారి ఆనందమే మాకు సంతృప్తి.. వ్యక్తిగత ఆసక్తితో ల్యాపరోస్కోపిపై ఫ్రాన్స్‌లో ఫెలోషిప్ చేశాను. మా ఆస్పత్రిలో ఈ సర్జరీలు బాగా జరుగుతున్నాయి. చాలా మంది కేన్సర్ నుంచి విముక్తి పొంది ఆనందంగా ఇంటికి వెళ్తున్నారు. ఎంఎన్జేలో జరిగిన సర్జరీల్లో వందశాతం సక్సెస్ అయ్యా యి. వాళ్ల ఆనందమే మాకు వృత్తి పరంగా ఎంతో సంతృప్తినిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో సర్జికల్ ఆంకాలజిస్ట్‌లకు ల్యాపరోస్కోపి నైపుణ్యం తప్పనిసరి . రోగికి ఉపశమనం పరంగా కూ డా ఇది ఎంతో మంచిది. - డా.మాటూరి రమేష్, సర్జికల్ ఆంకాలజిస్ట్, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి పైసా ఖర్చు లేకుండా.. ల్యాపరోస్కోపి మెషీన్ ధర రూ.1.5 కోట్లు. ఒక్కో పేషెంటుకు ఆపరేషన్ సమయంలో రూ.30 వేల విలువైన డిస్పొజబుల్స్ అవసరం. ఇవన్నీ ప్రభుత్వమే భరిస్తోంది. ఇదే చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో అయితే లక్షల్లో ఖర్చవుతుంది. అదే ఎంఎన్జేలో పైసా ఖర్చు లేకుండా చేస్తున్నారు. భోజన ఖర్చులు కూడా ఆస్పత్రే భరిస్తోంది. ఇన్నాళ్లూ కడుపులో వచ్చే కేన్సర్‌కు జానెడు పొడవు కోతవేసి ఆపరేషన్ చేసి గడ్డ తీసేసేవారు. అయితే ఇప్పుడా శ్రమ లేదు. సెంటీమీటర్ పొడవుతో కోత వేసి, గడ్డను తొలగించే అత్యాధునిక ల్యాపరోస్కోపి చికిత్సకు ఇప్పుడు ఎంఎన్‌జే వేదికైంది. 2014లో ఈ సర్జరీలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ మహిళలే ఎక్కువగా సర్జరీలు చేయించుకోవడం గమనార్హం. గర్భాశయ ముఖద్వారం, కిడ్నీ, చిన్నపేగు కేన్సర్ సర్జరీలు ఎక్కువ. వాటికి దీటుగా.. దక్షిణాదిన చెన్నైలోని అడయార్, బెంగళూర్‌లోని కిద్వాయ్లకు ప్రముఖ కేన్సర్ ఆస్పత్రులుగా పేరుంది. వాటి తర్వాత స్థానం ఎంఎన్జేది. కాగా అడయార్, కిద్వాయ్ ఆస్పత్రులకు దీటుగా ల్యాపరోస్కోపి సర్జరీలు చేయడంలో ఎంఎన్‌జే పైచేయి సాధించడం విశేషం. కడుపులో వచ్చే కేన్సర్లను తొలిదశలోనే గుర్తించి, ఇక్కడ శస్త్రచికిత్స చేయించుకున్న వందలాది మంది ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతున్నారు. రికవరీ ముఖ్యం.. ల్యాపరోస్కోపి చికిత్సల్లో మా వైద్యులు బాగా కృషి చేస్తున్నారు. సర్జరీ కంటే రోగి రికవరీ ముఖ్యం. ఈ సర్జరీతో బాధితులు రెండ్రోజుల్లో రికవరీ అవుతున్నారు. దీంతో దుష్ఫలితాల ప్రభావం తగ్గుతోంది. ఇంత అత్యాధునిక వైద్యం ఉచితంగా అందిస్తున్నామంటే అది ప్రభుత్వం చలవే. కేన్సర్ బాధితులకు ఈ సర్జరీ ఓ వరం. - డా.ఎన్.జయలత, డెరైక్టర్, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి ల్యాపరోస్కోపితో లాభాలేంటి.? చిన్న రంధ్రాల ద్వారా రోగి శరీరంలోకి నాణ్యమైన కెమెరాలు పంపించి, టీవీలో చూస్తూ కేన్సర్ భాగాన్ని తొలగించడమే ల్యాపరోస్కోపిక్.ఈ సర్జరీతో శరీర కండరాలకు హాని ఉండదు. నొప్పి కూడా ఉండదు.సాధారణ పద్ధతిలో ఆపరేషన్ చేస్తే కోలుకునేందుకు 10 రోజులు పడుతుంది. ఈ సర్జరీతో రోగి 48 గంటల్లోపే కోలుకుంటాడు. ఆహారం కూడా తీసుకోవచ్చు. గర్భాశయ, పొట్ట, పెద్దపేగు కేన్సర్లకు ఈ శస్త్రచికిత్స బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే ఈ చికిత్స చేసేందుకు వైద్యుడికి అనుభవం ఉండాలి. -
పదో షెడ్యూల్లోకి ఆరోగ్యశ్రీ
♦ ఎంఎన్‌జే, యోగాధ్యయన పరిషత్ కూడా.. ♦ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం.. త్వరలో ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్ : ఆరోగ్యశ్రీ ట్రస్టును విభజన చట్టంలోని పదో షెడ్యూల్లో చేర్చుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు సంబంధించి రాష్ట్ర పరిధిలోని ఆస్తులన్నీ తెలంగాణకే చెందుతాయి. దీంతోపాటు హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి, యోగాధ్యయన పరిషత్‌లు కూడా పదో షెడ్యూల్లో చేర్చారు. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన విభజన ప్రక్రియ మొదలు కానుంది. వీటిని పదో షెడ్యూల్లో చేర్చితే ఏపీ ప్రభుత్వం సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం నిర్ణయంతో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఉన్న అడ్డంకులు తొలగిపోనున్నాయి. సొంత విధానాలు.. సొంత భవనం.. ఆరోగ్యశ్రీ ట్రస్టుకి రాష్ట్రంలో ఉన్న ఆస్తులు తెలంగాణకే చెందితే.. ఇక పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆరోగ్యశ్రీ భవనం.. అక్కడున్న అన్ని ఆస్తులూ పూర్తిగా తెలంగాణకే బదలాయిస్తారు. ఒకవేళ ఏపీ ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయం ఈ భవనంలోనే తాత్కాలికంగా ఉండాలన్నా అద్దె చెల్లించాల్సిందే. అది కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తేనే. ప్రస్తుతం ఆరోగ్యశ్రీకి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్ తెలంగాణ నుంచి సీఈవోగా ఉన్నారు. విభజన జరిగితే పూర్తిస్థాయి సీఈవోను ప్రభుత్వం నియమిస్తుంది. నగదు రహిత కార్డులను జారీ చేసి ఉద్యోగుల వైద్య చికిత్సల పర్యవేక్షణ బాధ్యతను ప్రభుత్వం ఆరోగ్యశ్రీపైనే ఉంచింది. దీంతో రోజూ ఆరోగ్యశ్రీని ఆశ్రయించేవారు వేల సంఖ్యలో ఉన్నారు. ఆరోగ్యశ్రీ విభజన జరగక ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడ్డారు. మరోవైపు తెలంగాణలో ఆరోగ్యశ్రీ పేరుతో తెల్లకార్డున్న పేద కుటుంబానికి రూ. 2 లక్షల వరకు వైద్య సేవలు పొందే వీలుంది. అదే ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో రూ. 2.5 లక్షల వరకు పొందేందుకు వీలు కల్పించారు. ఇలా వేర్వేరు పేర్లతో వేర్వేరు ఆర్థిక కవరేజీతో నడుస్తున్నాయి. ట్రస్టు ఉమ్మడిగా ఉండటం.. విధానాలు వేర్వేరుగా ఉండటం వల్ల సమస్యలు వచ్చాయి. ప్రస్తుతం రెండు వేర్వేరు బ్యాంకు ఖాతాలు, సిబ్బంది అంతర్గత పని విభజన జరిగినా.. విభజన స్పష్టంగా లేక సమస్యలొస్తున్నాయి. ఇప్పుడు ఈ సమస్యలన్నీ తీరనున్నాయి. ఎంవోయూతో ఎంఎన్‌జే సేవలు.. ఎంఎన్‌జే ఆస్పత్రిని పదో షెడ్యూల్లో చేర్చడంతో అది పూర్తిగా తెలంగాణకే కేటాయించినట్లయింది. ఇక నుంచి అందులో తెలంగాణ ప్రాంత ప్రజలే వైద్య సేవలు పొందడానికి వీలు కలుగనుంది. ఏపీ ప్రజలు కూడా ఇక్కడ వైద్య సేవలు పొందాలంటే.. అందుకు ఏపీ ప్రభుత్వం తెలంగాణతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకోవాల్సి ఉంటుందని, సేవలకు అవసరమైన ఖర్చును భరించాల్సి ఉంటుందని అంటున్నారు. యోగాధ్యయన పరిషత్తు కూడా ఇదేవిధంగా ఉంటుందని చెపుతున్నారు.