♦ ఎంఎన్‌జే, యోగాధ్యయన పరిషత్ కూడా..
♦ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం.. త్వరలో ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్ : ఆరోగ్యశ్రీ ట్రస్టును విభజన చట్టంలోని పదో షెడ్యూల్‌లో చేర్చుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు సంబంధించి రాష్ట్ర పరిధిలోని ఆస్తులన్నీ తెలంగాణకే చెందుతాయి. దీంతోపాటు హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి, యోగాధ్యయన పరిషత్‌లు కూడా పదో షెడ్యూల్‌లో చేర్చారు. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన విభజన ప్రక్రియ మొదలు కానుంది. వీటిని పదో షెడ్యూల్‌లో చేర్చితే ఏపీ ప్రభుత్వం సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం నిర్ణయంతో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఉన్న అడ్డంకులు తొలగిపోనున్నాయి.
సొంత విధానాలు.. సొంత భవనం..
ఆరోగ్యశ్రీ ట్రస్టుకి రాష్ట్రంలో ఉన్న ఆస్తులు తెలంగాణకే చెందితే.. ఇక పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆరోగ్యశ్రీ భవనం.. అక్కడున్న అన్ని ఆస్తులూ పూర్తిగా తెలంగాణకే బదలాయిస్తారు. ఒకవేళ ఏపీ ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయం ఈ భవనంలోనే తాత్కాలికంగా ఉండాలన్నా అద్దె చెల్లించాల్సిందే. అది కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తేనే. ప్రస్తుతం ఆరోగ్యశ్రీకి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్ తెలంగాణ నుంచి సీఈవోగా ఉన్నారు.
విభజన జరిగితే పూర్తిస్థాయి సీఈవోను ప్రభుత్వం నియమిస్తుంది. నగదు రహిత కార్డులను జారీ చేసి ఉద్యోగుల వైద్య చికిత్సల పర్యవేక్షణ బాధ్యతను ప్రభుత్వం ఆరోగ్యశ్రీపైనే ఉంచింది. దీంతో రోజూ ఆరోగ్యశ్రీని ఆశ్రయించేవారు వేల సంఖ్యలో ఉన్నారు. ఆరోగ్యశ్రీ విభజన జరగక ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడ్డారు. మరోవైపు తెలంగాణలో ఆరోగ్యశ్రీ పేరుతో తెల్లకార్డున్న పేద కుటుంబానికి రూ. 2 లక్షల వరకు వైద్య సేవలు పొందే వీలుంది.
అదే ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో రూ. 2.5 లక్షల వరకు పొందేందుకు వీలు కల్పించారు. ఇలా వేర్వేరు పేర్లతో వేర్వేరు ఆర్థిక కవరేజీతో నడుస్తున్నాయి. ట్రస్టు ఉమ్మడిగా ఉండటం.. విధానాలు వేర్వేరుగా ఉండటం వల్ల సమస్యలు వచ్చాయి. ప్రస్తుతం రెండు వేర్వేరు బ్యాంకు ఖాతాలు, సిబ్బంది అంతర్గత పని విభజన జరిగినా.. విభజన స్పష్టంగా లేక సమస్యలొస్తున్నాయి. ఇప్పుడు ఈ సమస్యలన్నీ తీరనున్నాయి.
ఎంవోయూతో ఎంఎన్‌జే సేవలు..
ఎంఎన్‌జే ఆస్పత్రిని పదో షెడ్యూల్‌లో చేర్చడంతో అది పూర్తిగా తెలంగాణకే కేటాయించినట్లయింది. ఇక నుంచి అందులో తెలంగాణ ప్రాంత ప్రజలే వైద్య సేవలు పొందడానికి వీలు కలుగనుంది. ఏపీ ప్రజలు కూడా ఇక్కడ వైద్య సేవలు పొందాలంటే.. అందుకు ఏపీ ప్రభుత్వం తెలంగాణతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకోవాల్సి ఉంటుందని, సేవలకు అవసరమైన ఖర్చును భరించాల్సి ఉంటుందని అంటున్నారు. యోగాధ్యయన పరిషత్తు కూడా ఇదేవిధంగా ఉంటుందని చెపుతున్నారు.
పదో షెడ్యూల్‌లోకి ఆరోగ్యశ్రీ
Published Wed, Jun 17 2015 2:13 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement