హ్యాట్సాఫ్ ఎంఎన్‌జే
అత్యాధునిక ల్యాపరోస్కోపి సర్జరీతో కేన్సర్ రోగులకు పునర్జన్మ
20 నెలల్లో 300కు పైగా శస్త్ర చికిత్సలు
అడయార్, కిద్వాయ్‌లకు దీటుగా ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స
అత్యాధునిక ల్యాపరోస్కోపి సర్జరీతో కేన్సర్ రోగులకు పునర్జన్మ ప్రసాదిస్తోంది ‘ఎంఎన్‌జే’. ఈ సర్జరీలు కేన్సర్ బాధితులకు వరంగా మారాయి. 20 నెలల్లో 300 సర్జరీలు చేసిన ‘ఎంఎన్‌జే’ వైద్యులు ఎంతో మందికి కేన్సర్ నుంచి విముక్తి కల్పించారు. అరణ్య రోదనలు, బాధితుల బాధలు, బంధువుల దు:ఖాలు.. కేన్సర్
రోగులతో ఎప్పుడూ రద్దీగా ఉండే ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో సహజంగా కనిపించే చిత్రమిది. అయితే ఇది కనిపించే గాథ.. కనిపించని ఆస్పత్రి విజయగాథ ‘ఆపరేషన్ థియేటర్’లో దాగుంది. ఒక్కసారి ఆపరేషన్ థియేటర్‌ను పలకరిస్తే ఈ బాధలకు మించిన సంతోషాలు, కాటేసే కేన్సర్ నుంచి విముక్తి పొందిన బాధితుల మోముల్లో చిరునవ్వు, అహరహం శ్రమించి శస్త్రచికిత్స చేసిన వైద్య నిపుణుల్లో సంతృప్తి మనకు కనిపిస్తాయి. - సాక్షి, సిటీబ్యూరో
వారి ఆనందమే మాకు సంతృప్తి..
వ్యక్తిగత ఆసక్తితో ల్యాపరోస్కోపిపై ఫ్రాన్స్‌లో ఫెలోషిప్ చేశాను. మా ఆస్పత్రిలో ఈ సర్జరీలు బాగా జరుగుతున్నాయి. చాలా మంది కేన్సర్ నుంచి విముక్తి పొంది ఆనందంగా ఇంటికి వెళ్తున్నారు. ఎంఎన్‌జేలో జరిగిన సర్జరీల్లో వందశాతం సక్సెస్ అయ్యా యి. వాళ్ల ఆనందమే మాకు వృత్తి పరంగా ఎంతో సంతృప్తినిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో సర్జికల్ ఆంకాలజిస్ట్‌లకు ల్యాపరోస్కోపి నైపుణ్యం తప్పనిసరి . రోగికి ఉపశమనం పరంగా కూ డా ఇది ఎంతో మంచిది. - డా.మాటూరి రమేష్, సర్జికల్ ఆంకాలజిస్ట్, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి
పైసా ఖర్చు లేకుండా..
ల్యాపరోస్కోపి మెషీన్ ధర రూ.1.5 కోట్లు. ఒక్కో పేషెంటుకు ఆపరేషన్ సమయంలో రూ.30 వేల విలువైన డిస్పొజబుల్స్ అవసరం. ఇవన్నీ ప్రభుత్వమే భరిస్తోంది. ఇదే చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో అయితే లక్షల్లో ఖర్చవుతుంది. అదే ఎంఎన్‌జేలో పైసా ఖర్చు లేకుండా చేస్తున్నారు. భోజన ఖర్చులు కూడా ఆస్పత్రే భరిస్తోంది. ఇన్నాళ్లూ కడుపులో వచ్చే కేన్సర్‌కు జానెడు పొడవు కోతవేసి ఆపరేషన్ చేసి గడ్డ తీసేసేవారు. అయితే ఇప్పుడా శ్రమ లేదు. సెంటీమీటర్ పొడవుతో కోత వేసి, గడ్డను తొలగించే అత్యాధునిక ల్యాపరోస్కోపి చికిత్సకు ఇప్పుడు ఎంఎన్‌జే వేదికైంది. 2014లో ఈ సర్జరీలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ మహిళలే ఎక్కువగా సర్జరీలు చేయించుకోవడం గమనార్హం. గర్భాశయ ముఖద్వారం, కిడ్నీ, చిన్నపేగు కేన్సర్ సర్జరీలు ఎక్కువ.
వాటికి దీటుగా..
దక్షిణాదిన చెన్నైలోని అడయార్, బెంగళూర్‌లోని కిద్వాయ్‌లకు ప్రముఖ కేన్సర్ ఆస్పత్రులుగా పేరుంది. వాటి తర్వాత స్థానం ఎంఎన్‌జేది. కాగా అడయార్, కిద్వాయ్ ఆస్పత్రులకు దీటుగా ల్యాపరోస్కోపి సర్జరీలు చేయడంలో ఎంఎన్‌జే పైచేయి సాధించడం విశేషం. కడుపులో వచ్చే కేన్సర్లను తొలిదశలోనే గుర్తించి, ఇక్కడ శస్త్రచికిత్స చేయించుకున్న వందలాది మంది ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతున్నారు.
రికవరీ ముఖ్యం..
ల్యాపరోస్కోపి చికిత్సల్లో మా వైద్యులు బాగా కృషి చేస్తున్నారు. సర్జరీ కంటే రోగి రికవరీ ముఖ్యం. ఈ సర్జరీతో బాధితులు రెండ్రోజుల్లో రికవరీ అవుతున్నారు. దీంతో దుష్ఫలితాల ప్రభావం తగ్గుతోంది. ఇంత అత్యాధునిక వైద్యం ఉచితంగా అందిస్తున్నామంటే అది ప్రభుత్వం చలవే. కేన్సర్ బాధితులకు ఈ సర్జరీ ఓ వరం. - డా.ఎన్.జయలత, డెరైక్టర్, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి
ల్యాపరోస్కోపితో లాభాలేంటి.?
చిన్న రంధ్రాల ద్వారా రోగి శరీరంలోకి నాణ్యమైన కెమెరాలు పంపించి, టీవీలో చూస్తూ కేన్సర్ భాగాన్ని తొలగించడమే ల్యాపరోస్కోపిక్.ఈ సర్జరీతో శరీర కండరాలకు హాని ఉండదు. నొప్పి కూడా ఉండదు.సాధారణ పద్ధతిలో ఆపరేషన్ చేస్తే కోలుకునేందుకు 10 రోజులు పడుతుంది. ఈ సర్జరీతో రోగి 48 గంటల్లోపే కోలుకుంటాడు. ఆహారం కూడా తీసుకోవచ్చు. గర్భాశయ, పొట్ట, పెద్దపేగు కేన్సర్లకు ఈ శస్త్రచికిత్స బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే ఈ చికిత్స చేసేందుకు వైద్యుడికి అనుభవం ఉండాలి.