సంచార స్వైప్ మెషిన్లు
► చిల్లర నోట్ల సమస్యకు చిట్కా
►అత్యవసర సర్వీసులకు నేటితో తెర
► రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
సంచార స్వైప్ మెషిన్లను ప్రవేశపెట్టడం ద్వారా చిల్లర సమస్య పరిష్కారానికి కేంద్రం చిట్కాను కనుగొంది ఖాతాదారులు, ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి నగదును డ్రాచేసుకునే వసతిని కల్పించింది. సాక్షి ప్రతినిధి, చెన్నై
సాక్షి ప్రతినిధి, చెన్నై: పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు అష్టకష్టాలు పడుతుండగా ఒకింత ఊరట కలిగిస్తూ సేలం జిల్లాలో సరికొత్త రూ.500 నోట్లు చెలామణిలోకి వచ్చారుు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు స్వైప్ మెషిన్లతో వెళ్లే ఏర్పాటును ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు కల్పించింది. సహాయ జనరల్ మేనేజర్ పాల్రాజ్ నేతృత్వంలో ఐదు బృందాలు స్వైప్ మెషిన్లతో సేవలు అందించనున్నారుు. వీరి ద్వారా రూ.2వేలను అందుకోవచ్చు. ఈరకమైన స్వైప్ సేవల కోసం రూ.2లక్షలను ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్నారు. సుమారు 3 గంటల్లో వందమందికి నగదు పంపిణీ చేసినట్లు ఒక అధికారి తెలిపాడు.
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు:
చెల్లని కరెన్సీ నోట్లను చేతపట్టుకుని ప్రజలు అల్లాడుతుండగా కేంద్రం మాత్రం తన చర్యను సమర్థించుకుంటోంది. పైగా ఇది అంతంకాదు ఆరంభం మాత్రమేననే ప్రకటనతో ప్రధాని భయపెట్టడం ప్రారంభించారు. రద్దరుున నోట్ల స్థానంలో కొత్తనోట్లను అందించే ప్రక్రియ ప్రారంభమై బుధవారానికి 16 రోజులు గడిచినా సాధారణ పరిస్థితి నెలకొనలేదు. కరెన్సీని మార్చుకోని బ్యాంకులు, పనిచేయని ఏటీఎంల వద్ద ప్రజలు బాధలు పడుతూనే ఉన్నారు. బ్యాంకులను ముట్టడించడం, ఆందోళనలకు పూనుకోవడం నిత్యకృత్యమైంది. పాత నోట్లు చెలామణిలోలేవు, వాటి స్థానంలో కొత్త నోట్లు ఇచ్చేనాథుడు లేక ఖాతాదారులు అల్లాడుతున్నారు. తమిళనాడు అవసరాలకు తగినట్లుగా రిజర్వు బ్యాంకు తగిన స్థారుులో నగదును విడుదల చేయడం లేదు. సహనం నశించిపోరుున ప్రజలు బుధవారం ఎవరికి వారుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు.
దాదాపుగా ప్రతి బ్యాంకు ముందు ‘నో క్యాష్’ బోర్డులు దర్శనమిస్తున్నా రుు. 95 శాతానికి పైగా ఏటీఎంలు మూతపడి ఉన్నారుు. భారతీయ జనతా పార్టీ మినహా దాదాపుగా అన్ని పార్టీల నేతలూ కేంద్రాన్ని ఖండిస్తూ ఆందోళనకు దిగుతున్నారు. అధికార అన్నాడీఎంకే సైతం ఢిల్లీలో ప్రతిపక్షాలు నిర్వహించిన ధర్నాలో పాల్గొంది. తిరుప్పూరులో ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలను మూసివేసి నిరసన పాటించారు. తిరుప్పూరు నుండి కడలూరుకు వెళుతున్న ప్రభుత్వ బస్సును గుర్తుతెలియని వ్యక్తులు తెల్లవారుజామున అడ్డగించి అద్దాలను ధ్వంసం చేశారు. తంజావూరులో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ముందు రాస్తారోకో నిర్వహించారు. అలాగే రామనాథపురంలో నిరసనలు సాగించారు. చైన్నై తిరువాన్మీయూరు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సీపీఎం నేతలు బిక్షమెత్తుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఒకటోతేదీ జీతాన్ని నగదు రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కార్మికసంఘాలు ఆందోళనలు నిర్వహించారుు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చెన్నై జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షులు జీకే వాసన్ అధ్వర్యంలో ఆందోళన సాగింది. ఈనెల 29వ తేదీన రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతున్నట్లు వర్తక వాణిజ్య సంఘాల అధ్యక్షులు విక్రమ్రాజా ప్రకటించారు. రైళ్లు, బస్సులు తదితర అత్యవసర సర్వీసులకు పాత నోట్ల వినియోగం వెసులుబాటు ఈనెల 24వ తేదీతో ముగియనుంది. దీంతో శుక్రవారం నుంచి కరెన్సీ కష్టాలు రెట్టింపు కాగలవనే భయం ప్రజల్లో నెలకొంది.