'లైవ్ టీవీ 'యాక్షన్ షురూ!
దేశంలో మొదలైన మొబైల్ టీవీ విప్లవం
డీటీహెచ్ సంస్థల ప్రవేశంతో పోటాపోటీ
ఒక్క ఏడాదిలోనే 89% వృద్ధి చెందిన స్మార్ట్ఫోన్లు
వాటి సాయంతో భారీగా విస్తరిస్తున్న మొబైల్ టీవీ మార్కెట్
హైదరాబాద్: ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సుకుమార్... తీరా ఆ రోజు వచ్చేసరికి మాత్రం టీవీ చూడలేకపోయాడు. అర్జెంటు పనిమీద ఊరికి బయల్దేరాడు. మనసంతా ఫలితాలపైనే ఉండటంతో... ప్రతి 10 నిమిషాలకోసారి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. బస్సులో పక్కవాళ్లు విసుక్కున్నారు కూడా. కాకపోతే... ఇదంతా ఐదేళ్ల కిందటి మాట. ఇప్పుడు సుకుమార్‌కే కాదు... చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉన్నవాళ్లెవ్వరికీ ఇలాంటి అవసరం లేదు. ఎందుకంటే ఫోన్లోనే లైవ్ టీవీ చూడొచ్చు. కావలసిన చానెల్ మార్చుకోవచ్చు.
చేతిలో ఫోన్ పట్టుకుని దాన్లో టీవీ చూసేయొచ్చని పదేళ్ల కిందట కొందరు ఊహించినా... అది ఇంత త్వరగా నెరవేరుతుందని అనుకుని ఉండరు. ఇప్పటికే ఆలస్యమైందని కొందరు భావిస్తున్నా... స్మార్ట్ఫోన్లలో లైవ్‌టీవీ విప్లవం ఇండియాలో రానేవచ్చింది. అతివేగంగా పెరుగుతున్న స్మార్ట్ఫోన్ల వినియోగం ఈ విప్లవాన్ని మరింత ఎగదోస్తోంది. ఈ ఏడాదిలో చేసిన స్మార్ట్‌ఫోన్ ఇన్సిడెన్స్, నీల్సన్ ఇన్ఫర్మేట్ మొబైల్ ఇన్సైట్ల అధ్యయనాన్ని కలిపి చూస్తే... ఒక్క పట్టణ భారతంలోనే దాదాపు 5.1 కోట్ల స్మార్ట్‌ఫోన్ వినియోగదారులున్నారు. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 89 శాతం వృద్ధి చెందినట్లు లెక్క. ఎందుకంటే 2012 నాటికి ఉన్న స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు 2.7 కోట్ల మందే. టాటా స్కై సంస్థ చెబుతున్నదాని ప్రకారం దాని కస్టమర్లలో 60% మంది వీడియోలను మొబైల్లో చూస్తున్నవారే. దీనికితోడు డేటా, వైఫై సేవలు విస్తరించటం, ఎలాంటి మల్టీమీడియా కంటెంట్‌నైనా హ్యాండిల్ చేసే శక్తిమంతమైన మొబైల్స్ మార్కెట్లోకి రావటంతో వీటికి ఆకాశమే హద్దవుతోంది.
రంగంలోకి దిగ్గజాలు...
మొబైల్‌లోకి లైవ్‌టీవీ రావ టానికి ప్రధాన కారణం ప్రధాన డీటీహెచ్ సంస్థలన్నీ ఈ రంగంలోకి ప్రవేశించటమేనని స్పష్టంగా చెప్పొచ్చు. డిష్ టీవీ ఇప్పటికే స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లలో లైవ్‌టీవీ చూసేందుకు వీలైన ‘డిష్ ఆన్లైన్’ అప్లికేషన్‌ను విడుదల చేసింది. బోలెడన్ని కేటగిరీలు, చానెళ్లున్న ఈ అప్లికేషన్‌ను రూ.49కే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి ఆన్లైన్ స్ట్రీమింగ్‌ను ‘డిట్టో టీవీ’ అందిస్తోంది. అయితే డిష్ పోటీదారు టాటా స్కై మరో అడుగు ముందుకేసి ‘ఎవ్రీవేర్ టీవీ’ పేరిట కొత్త అప్లికేషన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. టీవీ చూడటానికే కాక... దాన్ని రికార్డ్ చేసుకోవడానికీ వీలు కల్పించటం దీని ప్రత్యేకత. వీడియో ఆన్ డిమాండ్‌తో పాటు వారం కిందటి టీవీ షోలు కూడా చూపించే ఈ యాప్‌కు టాటా స్కై నెలకు రూ. 60 వసూలు చేస్తోంది. ఇక ఎయిర్టెల్ డిజిటల్ టీవీ.. వినియోగదారులు లైవ్‌టీవీ చూస్తూనే ట్వీట్ చేసుకోవటం, ఇతరులతో మాట్లాడటం వంటి అవకాశాల్ని కల్పిస్తోంది. ఈ ట్వీట్లు ఎయిర్టెల్ డిజిటల్ టీవీలో ప్రసారమవుతాయి కూడా.
ఇక డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్లతో పాటు ఇండిపెండెంట్ యాప్ డెవలపర్లూ ఈ రంగంపై సీరియస్‌గా దృష్టిపెట్టారు. టీవీ షోలు చూస్తూ వాటి గురించి, ఇతరత్రా మాట్లాడుకునేవారు ఎక్కువవుతుండటంతో ఆ రకంగా సోషల్ నెట్‌వర్కింగ్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు మొదలెట్టారు. అయితే వీటికి చిన్నచిన్న పరిమితులూ ఉంటున్నాయి. టాటా స్కై యాప్‌కు ఐఫోన్ వెర్షన్ తప్ప ఆండ్రాయిడ్ వెర్షన్ ఇంకా రాలేదు. హెచ్డీఎంఐ కంటెంట్‌ను మొబైల్ ద్వారా మెయిన్ టీవీలో నేరుగా ప్రసారం చేసే అవకాశం లేదు. ఇన్ని పరిమితులున్నా... కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ మధ్య లైవ్‌టీవీ విస్ఫోటనం స్థాయికి వెళ్లటానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు.
ఫ్రీగా చూడొచ్చు కూడా...
మొబైల్, కంప్యూటర్, స్మార్ట్ టీవీ... ఇలా ఎక్కడైనా యప్‌టీవీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే న్యూస్ చానెళ్ల వరకూ ఉచితంగానే వస్తున్నాయి. చాలా చానెళ్లు వాటి లైవ్ టీవీలను ఫ్రీగానే ఇస్తున్నాయి. వీటికి ఇంటర్నెట్ చార్జీలు తప్ప... టీవీకంటూ ఎలాంటి చార్జీలూ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇంకా నెక్స్ జి టివి, ఇండియా లైవ్‌టీవీ వంటి యాప్స్ కూడా చాలానే ఉన్నాయి.