కేరింగ్ ఖాదీ!
అదేమిటో! ఎంత సాదాసీదాగా ఉంటే... అంత గొప్పదనం వచ్చేస్తుంది అమ్మాయిలకి!
ఇక ఖద్దరు తొడిగారా... మారువేషపు దౌత్యదూతలే!
ఈ సిల్కులు, కాటన్లు, ఉన్ని వస్త్రాలు... అమ్మాయిల దగ్గర మార్కులు కొట్టేయడానికి ఎన్ని వేషాలైనా వేయనివ్వండి, ఖద్దరు ఒద్దికకు అన్నీ తలవొగ్గాల్సిందే.
ఒద్దిక మాత్రమేనా? ఎంత జాగ్రత్త అని!!
వేసవిలో చల్లగా ఉంచుతుంది.
శీతాకాలంలో చలిని జల్లెడ పడుతుంది.
ఏ రుతువులోనైనా... పదిలంగా చూసుకుంటుంది.
ఇక లుక్ అంటారా...
ఎవరీ తెలివైన అమ్మాయి అనే సందేహం రాకపోతే...
ఖద్దరు ఖద్దరే కాదు.
1- మస్లిన్ ఖాదీ మీద ఎంబ్రాయిడరీ చేసిన టాప్, కలంకారీ ఖాదీతో డిజైన్ చేసిన ప్యానల్ స్కర్ట్.
2- టాప్‌కి ఎరుపురంగు నేచురల్ డై ఖాదీ, బాటమ్‌కి కలంకారీ ఖాదీ కాంబినేషన్‌తో రూపొందించిన ఆల్టర్ నెక్ ఫ్రాక్ ఇది.
3- కలంకారీ ఖాదీ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన లాంగ్ ఫ్రాక్ ఇది. క్యాజువల్ డ్రెస్‌గానూ, ఈవెనింగ్ పార్టీవేర్ డ్రెస్‌గానూ ధరించవచ్చు.
4- ప్రింటెడ్ స్కర్ట్ పైన పింక్ ఖాదీ టాప్ వేయడంతో క్యాజువల్‌గానూ, మోడ్రన్‌గానూ కనువిందుచేస్తోంది.
ఖాదీ డ్రెస్సుల వాడకంలో...
డ్రెస్సులకు గంజి పెట్టడం నేటి తరం అంతగా ఇష్టపడటం లేదు. ఖాదీకి అంతగా గంజిపెట్టాల్సిన అవసరం ఉండదు. 3-4 సార్లు ధరించి, శుభ్రపరిచిన తర్వాత చాలా తక్కువ మోతాదులో గంజి పెట్టి, ఐరన్ చేస్తే చాలు కొత్త డ్రెస్‌లా మారిపోతుంది.
ఖాదీ ఫ్యాబ్రిక్ సహజసిద్ధమైన రంగులతో రూపొందించినది. అందుకని ఈ దుస్తులను శుభ్రపరిచేటప్పుడు మిగతా వాటితో కలపకుండా ఉండటం మంచిది.
సహజసిద్ధమైన ప్రకృతి గుణాలు గల ఫ్యాబ్రిక్ కాబట్టి ఖాదీ దుస్తుల మీదకు ఉడెన్, టైట, జ్యూట్, బ్యాంబూ... వంటి ఎకో ఫ్రెండ్లీ యాక్ససరీస్ చక్కగా నప్పుతాయి.
ఖాదీ ఫ్యాబ్రిక్ సహజంగానే డల్‌గా ఉంటుంది. అందుకని యాక్ససరీస్ (బ్యాంగిల్స్, బ్యాగ్, చెప్పల్స్, గొలుసులు ..) కలర్ఫుల్గా ఉండేవి ధరిస్తే బ్రైట్‌గా కనిపిస్తారు.
మోడల్: శ్రావ్య
అరవింద్ జాషువా, ఫ్యాషన్ డిజైనర్
త్రిత్వాఖాదీ, హైదరాబాద్
www.facebook.com/thrithvaakhadi