ఒకే స్మార్ట్‌వాచ్.. ఎన్నో టెక్కులు!
టెక్నాలజీతోపాటు స్మార్ట్‌వాచ్‌లు.. వాటిలో ఆప్షన్లూ వేగంగా మారిపోతున్నాయి. కొత్త హంగులతో ఊరించే స్మార్ట్‌వాచ్‌లు వచ్చినప్పుడల్లా ప్రతి దానినీ కొనలేక ఇకపై నిరాశ చెందాల్సిన పనిలేదు. స్మార్ట్‌వాచ్‌లో ఎప్పటికప్పుడు కావలసిన మార్పులు చేసుకునేందుకు వీలయ్యే ‘బ్లాక్స్ మాడ్యులార్ స్మార్ట్‌వాచ్’లు త్వరలోనే రానున్నాయి మరి.
ఎవరికి నచ్చిన రీతిలో వారు స్మార్ట్‌ఫోన్‌ను తయారుచేసుకునేలా విడిభాగాలను రూపొందించేందుకు గూగుల్ కంపెనీ ‘ప్రాజెక్ట్ ఆరా’ మొదలుపెట్టింది కదా. ఇదీ అలాంటిదే. మాడ్యులార్ పరికరాలు అంటే.. మూల పరికరంలో మార్పులు చేయకుండా విడి భాగాలను మార్చుకుని ఉపయోగించుకునేందుకు వీలయ్యేవన్నమాట. ఉదాహరణకు.. మీ స్మార్ట్‌వాచ్‌లో మెయిల్ చెకింగ్, వాయిస్ కమాండ్స్, నావిగేషన్ వంటి కొన్ని ఆప్షన్లే ఉన్నాయనుకోండి. మరిన్ని ఆప్షన్లు కావాలనీ ఉందనుకోండి. కొత్త బ్లాక్స్‌ను మాత్రమే జతచేస్తే చాలు.. స్మార్ట్‌వాచ్ మాడిఫికేషన్ అయిపోయినట్టే. అంటే స్మార్ట్‌వాచ్‌ను మార్చకుండానే కొత్త టెక్కులు సొంతం చేసుకోవచ్చన్నమాట. అవసరాన్ని బట్టి.. నాన్ టచ్ ఎల్ఈడీ స్క్రీన్, గుండె రేటు, ఆక్సీజన్‌ను పర్యవేక్షించే సెన్సర్లు, టచ్‌స్క్రీన్, 8 ఎంపీ కెమెరా, సిమ్‌కార్డు, జీపీఎస్ రేడియో, ఈ-ఇంక్ స్క్రీన్, ఎక్స్ట్రా బ్యాటరీలనూ కొనుక్కోవచ్చు. ప్రస్తుతం స్మార్ట్‌వాచ్‌లలో కొన్ని ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. అదే మాడ్యులార్ స్మార్ట్‌వాచ్ ఉంటే అన్ని ఆప్షన్లూ సాధ్యమే. ఇది ఓపెన్ ప్లాట్‌ఫామ్‌పై ఉంటుంది కాబట్టి.. ఏ ఒక్క కంపెనీ ఆధిపత్యమూ ఉండదు. ఆ కంపెనీ హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్వేర్లనే వాడాల్సిన అవసర ం అసలే ఉండదు. వచ్చే ఏడాది మధ్యనాటికి ఈ స్మార్ట్‌వాచ్‌లు మార్కెట్లోకి రానున్నాయి.