Mohalla Sabha
-
మళ్లీ మొహల్లా బాట
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీని ఉత్తేజితం చేసే దిశగా అరవింద్ కేజ్రీవాల్ అడుగులు వేశారు. ప్రజాదరణ పొందడానికి తన జైలు ఎత్తుగడ ఫలించకపోవడంతో మళ్లీ ఆయన పాత బాట పట్టారు. మొహల్లా సభలతో ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ సభల ద్వారా దాదాపు ఐదు లక్షల మందిని నేరుగా కలవనున్నారు. తమపై ప్రజాగ్రహాన్ని పోగొట్టడంకోసం విద్యుత్, నీటి సమస్యలపై గొంతెత్తాలని ఆయన సంకల్పించారు. ఇందుకోసం నగరంలో 50 పైగా మొహల్లా సభలను నిర్వహించడానికి ఆప్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ తరహా మొహల్లా సభను న్యూఢిల్లీ నియోజకవర్గంలో శుక్ర వారం నిర్వహించింది. ఈ సభలో కేజ్రీవాల్ విద్యుత్, నీటి సమస్యలను లేవనె త్తడంతోపాటు 49 రోజుల పాలన తరువాత ఎందుకు అధికారాన్ని వదులుకోవాల్సి వచ్చిం దంటూ అడిగిన ప్రశ్నలకు ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకున్నారు. తాను హఠాత్తుగా రాజీనామా చేయడం ప్రజలకు ఆగ్రహం కలిగించిన మాట నిజమేనంటూ అంగీకరించారు. వెంటనే ఎన్నికలు జరిగితే పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావొచ్చ నే అభిప్రాయంతోనే రాజీనామా చేసినట్లు ఆయన వివరణ ఇచ్చారు. ప్రజాభిప్రాయం మేరకే కాంగ్రెస్‌తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు కూడా చెప్పుకున్నారు. అధికార నివాసం ఖాళీ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి పదవి అరవింద్ కేజ్రీవాల్ వచ్చే వారం తన అధికారిక నివాసాన్ని వచ్చే వారం ఖాళీ చేయనున్నారు. అరవింద్ ప్రస్తుతం నగరంలోని తిలక్‌మార్గ్‌లో తనకు ప్రభుత్వం కేటాయించిన అధికార భవనంలో నివసిస్తున్న సంగతి విదితమే. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినందువల్ల ప్రభుత్వం కేటాయించిన ఫ్లాట్‌కు అద్దె కింద రూ. 85 వేలు చెల్లించాలంటూ అరవింద్‌కు ఢిల్లీ ప్రభుత్వం గతంలో నోటీసు పంపిన సంగతి విదితమే. అయితే తన కుమార్తె పదో తరగతి పరీక్షలు రాస్తోందని, అందువల్ల మరికొంత గడువు కావాలని అరవింద్... ప్రభుత్వాన్ని కోరారు. -
ఆప్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీపార్టీపై దాడిలో ఓ అడుగు ముందుకేసింది కాంగ్రెస్ పార్టీ. మొహల్లా సభల పేరుతో ప్రజలను మరోసారి తప్పుదోవ పట్టించేందుకు ఆప్ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజ ల్లోకి వెళ్లి ఓటు బ్యాంకును పెంచుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ యత్నిస్తోందని, కానీ 49 రోజుల ఆ పార్టీ పాల నతో విసిగిపోయిన ప్రజలు నిరాకరించాలని నిర్ణయించుకున్నారని డీపీపీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ తెలి పారు. 49 రోజుల పాల నలో ఆప్ ఏ ఒక్క అభివృద్ది పనిని చేపట్టలేదని, ఒక్క టెండర్‌ను కూడా పిలవలేదని ఆరోపించా రు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ఆప్ అధినేత కేజ్రీవాల్ పాటించడం లేదని, పార్టీ కార్యకర్తలు, నాయకులతో మాట్లాకుండానే ప్రధాన మైన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోఎపించారు. అప్‌కి మొహల్లా సభ ల మీద అంత ప్రేమ ఉంటే... దానిపై బిల్లు ఎందుకు తీసు కు రాలేదని ఆయన ప్రశ్నించారు. దేశ రాజ ధానిలో విద్యుత్ కోతకు ఆప్, బీజేపీలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 15 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే నీరు, విద్యుత్ కొరత ఏర్పడలేదని, ప్రస్తుతం ప్రజలు నిరంతరాయంగా ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో ఆప్ అభ్యర్థులు గెలిచిన 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొహల్లా సభలు నిర్వహిస్తున్నట్టు కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ కార్యక్రమ ప్రధానోద్దేశం నియోజకవర్గ నిధులను ఎలా ఖర్చు పెట్టాలని ప్రజలను అడగడం, అసెంబ్లీ ఎన్నికలకు ముందే పోగొట్టుకున్న క్షేత్రస్థాయి బలాన్ని పుంజుకోవడం. -
మొహల్లా సభలపై శిక్షణ
ఆప్ ప్రకటన ఎమ్మెల్యేల కోసమే... ప్రతి ఎమ్మెల్యేకు తన నియోజకవర్గ అభివృద్ధి నిధి కింద కేటాయించే రూ.నాలుగు కోట్లను ఖర్చు చేయడం, స్థానికంగా ముఖ్యమైన పనులను గుర్తించడానికి మొహల్లా సభలు నిర్వహిస్తున్నామని ఆప్ ప్రకటించింది. ఈ విషయమై తమ ఎమ్మెల్యేలకు శిక్షణ ఇస్తున్నామని ప్రకటించింది. న్యూఢిల్లీ: స్థానిక ప్రజలతో వ్యవహరించడం, మొహల్లా సభల నిర్వహణపై తమ ఎమ్మెల్యేలందరికీ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించింది. ఎలాంటి రాజకీయ నేపథ్యమూ లేని 27 మంది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యేలుగా మారిన సంగతి తెలిసిందే. ఈ 27 నియోజకవర్గాల్లోనూ మొహల్లా సభలు నిర్వహిస్తామని, ఇందుకోసం తమ ఎమ్మెల్యేలందరికీ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని ఆప్ వెల్లడించింది. ప్రతి ఎమ్మెల్యేకు తన నియోజకవర్గ అభివృద్ధి నిధి కింద కేటాయించే రూ.నాలుగు కోట్లను ఎలా ఖర్చు చేయాలనే విషయమై ఈ సభల్లో చర్చిస్తారు. కొందరు ఎమ్మెల్యేలు ఆదివారం నుంచే సభలు నిర్వహిస్తుండగా, మిగతా వాళ్లు వారం రోజుల్లోపే ప్రారంభిస్తారని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలోనూ ఏయే ప్రాజెక్టులు చేపట్టాలనే విషయమై వచ్చే వారానికల్లా స్పష్టత వస్తుందని ఆయన అన్నారు. ఇక మొహల్లా సభల నిర్వహణపై ఆప్ అధిపతి అరవింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్యేలతో బుధవారం భేటీ నిర్వహించారు. ఇవి కొనసాగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మరికొన్ని నెలల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నిబంధనావళి అమల్లోకి రాకముందే అన్ని నియోజకవర్గాల్లోని ప్రాజెక్టులకూ అనుమతి రావాలని ఆప్ కోరుకుంటోంది. అయితే ఎన్నికల నిర్వహణపై ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. పనులు మొదలుపెట్టేందుకు ఎమ్మెల్యేలకు 2-3 నెలల గడువు ఉంటుందని భావిస్తున్నారు. ‘ఎమ్మెల్యేలందరికీ ప్రస్తుతం శిక్షణ ఇస్తున్నాం. ప్రాజెక్టులను గుర్తించి అంచనాలను తయారు చేస్తాం. అధికారులను సంప్రదించి పనులు కేటాయిస్తాం. అయితే మొహల్లా సభల సందర్భంగా ఎమ్మెల్యే ఎలా స్పందిస్తాడనేది ముఖ్యం. తన అధికార పరిధిలో ఏయే అంశాలు ఉంటాయనేదానిపై అతనికి స్పష్టమైన అవగాహన ఉండాలి. అనుచిత డిమాండ్లు లేవనెత్తితే వాటిని సమర్థంగా తిరస్కరించే నేర్పు ఉండడమూ అవసరమే. ఎమ్మెల్యే ‘ల్యాడ్’ నిధుల కింద ఏయే ప్రాజెక్టులు చేపట్టవచ్చనేదానిపై వారికి అవగాహన కల్పిస్తున్నాం’ అని ఆప్ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోడియా అన్నారు. తన నియోజకవర్గం పత్పర్గంజ్లో వచ్చే వారం నుంచి మొహల్లా సభలు మొదలుపెడతామని ఈ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎంత మేర నిధులు ఖర్చు చేస్తామనేదానికన్నా అభివృద్ధి ప్రక్రియలో ప్రజలు ఏ మేర భాగస్వాములు అవుతున్నారు అనేదే ముఖ్యమని వ్యాఖ్యానించారు. స్థానికులు ఆమోదం తెలిపితేనే తమ ఎమ్మెల్యేలు సంబంధిత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తారని స్పష్టం చేశారు. తదనంతరం మరో మొహల్లా సభ నిర్వహించి కొత్త ప్రాజెక్టు మొదలుపెడతామని సిసోడియా విశదీకరించారు. షాకుర్బస్తీ నుంచి గెలిచిన ఆప్ ఎమ్మెల్యే సత్యేంద్ర జైన్ బుధవారం నుంచి సభల నిర్వహణ ప్రారంభించారు. రాబోయే ఏడు రోజుల్లో 40 దాకా సభలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ‘ప్రతి ప్రాంతం నుంచి ప్రజల భాగస్వామ్యం కనిపించాలి. ముఖ్యమైన ప్రాజెక్టులకు ప్రాధాన్యం దక్కాలి’ అని ఆయన అభిప్రాయపడ్డారు. కేజ్రీవాల్ కూడా తన నియోజకవర్గం న్యూఢిల్లీలో వచ్చే వారం నుంచి మొహల్లా సభలు నిర్వహిస్తారని ఆప్ వర్గాలు తెలిపాయి.