మొహల్లా సభలపై శిక్షణ | AAP to train MLAs for handling mohalla sabhas | Sakshi
Sakshi News home page

మొహల్లా సభలపై శిక్షణ

Published Thu, May 29 2014 10:35 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

మొహల్లా సభలపై శిక్షణ - Sakshi

మొహల్లా సభలపై శిక్షణ

 ఆప్ ప్రకటన ఎమ్మెల్యేల కోసమే...
 
ప్రతి ఎమ్మెల్యేకు తన నియోజకవర్గ అభివృద్ధి నిధి కింద కేటాయించే రూ.నాలుగు కోట్లను ఖర్చు చేయడం, స్థానికంగా ముఖ్యమైన పనులను గుర్తించడానికి మొహల్లా సభలు నిర్వహిస్తున్నామని ఆప్ ప్రకటించింది. ఈ విషయమై తమ ఎమ్మెల్యేలకు శిక్షణ ఇస్తున్నామని ప్రకటించింది.


న్యూఢిల్లీ: స్థానిక ప్రజలతో వ్యవహరించడం, మొహల్లా సభల నిర్వహణపై తమ ఎమ్మెల్యేలందరికీ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించింది. ఎలాంటి రాజకీయ నేపథ్యమూ లేని 27 మంది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యేలుగా మారిన సంగతి తెలిసిందే. ఈ 27 నియోజకవర్గాల్లోనూ మొహల్లా సభలు నిర్వహిస్తామని, ఇందుకోసం తమ ఎమ్మెల్యేలందరికీ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని ఆప్ వెల్లడించింది. ప్రతి ఎమ్మెల్యేకు తన నియోజకవర్గ అభివృద్ధి నిధి కింద కేటాయించే రూ.నాలుగు కోట్లను ఎలా ఖర్చు చేయాలనే విషయమై ఈ సభల్లో చర్చిస్తారు.

కొందరు ఎమ్మెల్యేలు ఆదివారం నుంచే సభలు నిర్వహిస్తుండగా, మిగతా వాళ్లు వారం రోజుల్లోపే ప్రారంభిస్తారని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలోనూ ఏయే ప్రాజెక్టులు చేపట్టాలనే విషయమై వచ్చే వారానికల్లా స్పష్టత వస్తుందని ఆయన అన్నారు. ఇక మొహల్లా సభల నిర్వహణపై ఆప్ అధిపతి అరవింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్యేలతో బుధవారం భేటీ నిర్వహించారు. ఇవి కొనసాగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మరికొన్ని నెలల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

 ఎన్నికల నిబంధనావళి అమల్లోకి రాకముందే అన్ని నియోజకవర్గాల్లోని ప్రాజెక్టులకూ అనుమతి రావాలని ఆప్ కోరుకుంటోంది. అయితే ఎన్నికల నిర్వహణపై ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. పనులు మొదలుపెట్టేందుకు ఎమ్మెల్యేలకు 2-3 నెలల గడువు ఉంటుందని భావిస్తున్నారు.
 ‘ఎమ్మెల్యేలందరికీ ప్రస్తుతం శిక్షణ ఇస్తున్నాం. ప్రాజెక్టులను గుర్తించి అంచనాలను తయారు చేస్తాం. అధికారులను సంప్రదించి పనులు కేటాయిస్తాం.

 అయితే మొహల్లా సభల సందర్భంగా ఎమ్మెల్యే ఎలా స్పందిస్తాడనేది ముఖ్యం. తన అధికార పరిధిలో ఏయే అంశాలు ఉంటాయనేదానిపై అతనికి స్పష్టమైన అవగాహన ఉండాలి. అనుచిత డిమాండ్లు లేవనెత్తితే వాటిని సమర్థంగా తిరస్కరించే నేర్పు ఉండడమూ అవసరమే. ఎమ్మెల్యే ‘ల్యాడ్’ నిధుల కింద ఏయే ప్రాజెక్టులు చేపట్టవచ్చనేదానిపై వారికి అవగాహన కల్పిస్తున్నాం’ అని ఆప్ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోడియా అన్నారు. తన నియోజకవర్గం పత్పర్‌గంజ్‌లో వచ్చే వారం నుంచి మొహల్లా సభలు మొదలుపెడతామని ఈ ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఎంత మేర నిధులు ఖర్చు చేస్తామనేదానికన్నా అభివృద్ధి ప్రక్రియలో ప్రజలు ఏ మేర భాగస్వాములు అవుతున్నారు అనేదే ముఖ్యమని వ్యాఖ్యానించారు. స్థానికులు ఆమోదం తెలిపితేనే తమ ఎమ్మెల్యేలు సంబంధిత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తారని స్పష్టం చేశారు. తదనంతరం మరో మొహల్లా సభ నిర్వహించి కొత్త ప్రాజెక్టు మొదలుపెడతామని సిసోడియా విశదీకరించారు.

షాకుర్‌బస్తీ నుంచి గెలిచిన ఆప్ ఎమ్మెల్యే సత్యేంద్ర జైన్ బుధవారం నుంచి సభల నిర్వహణ ప్రారంభించారు. రాబోయే ఏడు రోజుల్లో 40 దాకా సభలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ‘ప్రతి ప్రాంతం నుంచి ప్రజల భాగస్వామ్యం కనిపించాలి. ముఖ్యమైన ప్రాజెక్టులకు ప్రాధాన్యం దక్కాలి’ అని ఆయన అభిప్రాయపడ్డారు. కేజ్రీవాల్ కూడా తన నియోజకవర్గం న్యూఢిల్లీలో వచ్చే వారం నుంచి మొహల్లా సభలు నిర్వహిస్తారని ఆప్ వర్గాలు తెలిపాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement