మళ్లీ మొహల్లా బాట
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీని ఉత్తేజితం చేసే దిశగా అరవింద్ కేజ్రీవాల్ అడుగులు వేశారు. ప్రజాదరణ పొందడానికి తన జైలు ఎత్తుగడ ఫలించకపోవడంతో మళ్లీ ఆయన పాత బాట పట్టారు. మొహల్లా సభలతో ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ సభల ద్వారా దాదాపు ఐదు లక్షల మందిని నేరుగా కలవనున్నారు. తమపై ప్రజాగ్రహాన్ని పోగొట్టడంకోసం విద్యుత్, నీటి సమస్యలపై గొంతెత్తాలని ఆయన సంకల్పించారు. ఇందుకోసం నగరంలో 50 పైగా మొహల్లా సభలను నిర్వహించడానికి ఆప్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ తరహా మొహల్లా సభను న్యూఢిల్లీ నియోజకవర్గంలో శుక్ర వారం నిర్వహించింది.
ఈ సభలో కేజ్రీవాల్ విద్యుత్, నీటి సమస్యలను లేవనె త్తడంతోపాటు 49 రోజుల పాలన తరువాత ఎందుకు అధికారాన్ని వదులుకోవాల్సి వచ్చిం దంటూ అడిగిన ప్రశ్నలకు ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకున్నారు. తాను హఠాత్తుగా రాజీనామా చేయడం ప్రజలకు ఆగ్రహం కలిగించిన మాట నిజమేనంటూ అంగీకరించారు. వెంటనే ఎన్నికలు జరిగితే పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావొచ్చ నే అభిప్రాయంతోనే రాజీనామా చేసినట్లు ఆయన వివరణ ఇచ్చారు. ప్రజాభిప్రాయం మేరకే కాంగ్రెస్‌తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు కూడా చెప్పుకున్నారు.
అధికార నివాసం ఖాళీ
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి పదవి అరవింద్ కేజ్రీవాల్ వచ్చే వారం తన అధికారిక నివాసాన్ని వచ్చే వారం ఖాళీ చేయనున్నారు. అరవింద్ ప్రస్తుతం నగరంలోని తిలక్‌మార్గ్‌లో తనకు ప్రభుత్వం కేటాయించిన అధికార భవనంలో నివసిస్తున్న సంగతి విదితమే. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినందువల్ల ప్రభుత్వం కేటాయించిన ఫ్లాట్‌కు అద్దె కింద రూ. 85 వేలు చెల్లించాలంటూ అరవింద్‌కు ఢిల్లీ ప్రభుత్వం గతంలో నోటీసు పంపిన సంగతి విదితమే. అయితే తన కుమార్తె పదో తరగతి పరీక్షలు రాస్తోందని, అందువల్ల మరికొంత గడువు కావాలని అరవింద్... ప్రభుత్వాన్ని కోరారు.