‘జస్ట్’ లక్షల్లో మింగారు!
విమాన టికెట్ల పేరుతో దందా
ఆరు రాష్ట్రాల్లో సాగిన మోసాలు
ఇద్దరిని అరెస్టు చేసిన సైబర్‌క్రైమ్ పోలీసులు
సాక్షి, సిటీబ్యూరో: బోగస్ ట్రావెల్ ఏజెన్సీలు ఏర్పాటు చేసి... ఇంటర్నెట్లోని జస్ట్ డయల్ వెబ్సైట్లో పొందుపరిచి... విమాన టికెట్ల పేరుతో రూ.లక్షల్లో కాజేసిన అంతరాష్ట్ర ముఠా గుట్టును సీసీఎస్ ఆధీనంలోని సైబర్‌క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేయగా.. ప్రధాన సూత్రధారితో సహా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
డీసీపీ జి.పాలరాజు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం... నగరంతో పాటు ఉత్తరాదికి చెందిన కొందరు వ్యక్తులు హైదరాబాద్‌తో పాటు పుణె, ముంబై, మంగుళూరు, చెన్నై, జమ్మూకాశ్మీర్‌ల్లో థెరపీ, కాంటినెంటల్, వైభవ్, ఆర్జో పేర్లతో బోగస్ ట్రావెల్ ఏజెన్సీలను ఏర్పాటు చేశారు. వీటిని జస్ట్ డయల్‌లో ఎన్రోల్ చేయించుకోవడంతో పాటు ఆయా నగరాల్లో స్థానిక ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. విమాన టికెట్లు, ట్రావెల్ ఏజెన్సీల కోసం జస్ట్ డయల్‌ను సంప్రదించే వినియోగదారుల సమాచారం వీరికి చేరేది. ఫోన్ ద్వారా కస్టమర్లను కాంటాక్ట్ చేసి మాట్లాడే ప్రతినిధులు తక్కువ ధరకు విమాన టికెట్లు అందిస్తామంటూ వలవేసే వారు.
నగదును తమ ఖాతాల్లో జమ చేయించుకుని టికెట్ బుక్ చేసి దాని పీఎన్ఆర్ నెంబర్‌తో పాటు ఇతర వివరాలను వినియోగదారులకు పంపేవారు. టికెట్ బుక్ చేసేది ఈ బోగస్ సంస్థల వారే కావడంతో వాటిని రద్దు చేసే అవకాశమూ వీరికి ఉండేది. దీంతో ప్రయాణ సమయానికి కాస్త ముందుగా వినియోగదారులకు తెలియకుండానే జారీ చేసిన టికెట్లను రద్దు చేసి ఆ నగుదును తమ ఖాతాల్లోకి మళ్లించుకుని కాజేసేవారు.
ఈ విషయం తెలియక ఎయిర్పోర్ట్ వరకు వెళ్లిన వినియోగదారులు అక్కడ అసలు సంగతి తెలుసుకుని ప్రయాణం రద్దు చేసుకోవడం లేదా ఎక్కువ ధరకు మరో టికెట్టు కొనుగోలు చేయడమో చేసేవారు. నిందితుల ఫోన్లు, బ్యాంకు ఖాతాల్లో చాలా వరకు బోగస్ వివరాలతో కూడినవి కావడంతో పట్టుబడేవారు కాదు. ఈ రకంగా ముఠా దేశ వ్యాప్తంగా అనేక మందిని మోసం చేసి రూ.లక్షల్లో స్వాహా చేసింది. నగరంలోని కొందరిని ఈ ముఠా రూ.3 లక్షల మేర మోసం చేయడంతో సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది.
కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ పి.రాజు నేతృత్వంలో హెడ్-కానిస్టేబుల్ సత్యనారాయణ, కానిస్టేబుళ్లు మురారి విజయ్, సతీష్ సాంకేతికంగా దర్యాప్తు చేసి నిందితులైన సునీల్ శర్మ (మహారాష్ట్ర), మహ్మద్ అస్ఘర్ అలీ (మలక్‌పేట)లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సూత్రధారి సహా మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ తరహా సంస్థల్ని ఎలాంటి పరిశీలనా లేకుండా ఎన్రోల్ చేసుకుని, పలువురు నష్టపోవడానికి కారణమైన జస్ట్ డయల్ సంస్థకూ సంజాయిషీ కోరుతూ నోటీసు ఇస్తున్నామని డీసీపీ పాలరాజు తెలిపారు.