Mohan Nannapaneni
-
తానా మహాసభలకు కేసీఆర్‌కు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్:అమెరికాలోని డెట్రాయిట్లో 2015 జూలైలో నిర్వహించే ‘తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా’(తానా) మహాసభలకు హాజరుకావాలని ఆ సంస్థ ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఆహ్వానించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీఆర్ఎస్ నాయకుడు పల్లా రాజేశ్వరరెడ్డి నేతృత్వంలో ముఖ్యమంత్రిని కలిసిన ‘తానా’ అధ్యక్షుడు మోహన్ నన్నపనేని, జంపాల చౌదరి, మధు టాటా, తోటకూర ప్రసాద్, సతీష్, నరీన్ తదితరులు అమెరికాలో తెలుగు వారి భద్రతకు, సమస్యల పరిష్కారానికి, సాంస్కృతిక వికాసానికి సంస్థ చేస్తున్న కృషిని వివరించారు. తెలంగాణలో విద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. కాగా, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి తానా నేతలకు వివరించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధ్దిలో భాగస్వాములు కావాలని వారిని కోరారు. -
2 వరకు తానా ‘చైతన్య స్రవంతి’
తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని విజయవాడ: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ‘చైతన్య స్రవంతి’ పేరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని తెలిపారు. విజయవాడలోని ఆంధ్రా చాంబర్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 10 నుంచి జనవరి రెండో తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీన్లో భాగంగా బుధవారం గుంటూరు జిల్లా చిలువూరులో మెగా హెల్త్‌క్యాంప్ నిర్వహించామన్నారు. గురువారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ భారతీయ విద్యాభవన్‌లో జరిగే కార్యక్రమంలో లిటిల్ మ్యుజీషియన్ అకాడమీకి రూ.45 లక్షల సాయం అందించనున్నట్లు చెప్పారు. తెలంగాణ రచయితలు, నటులను సత్కరించనున్నట్లు తెలిపారు. సమావేశంలో తానా కార్యదర్శి సతీష్ వేమన, బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్ చైర్మన్ డాక్టర్ నరేన్ కొడాలి, ఆంధ్రా చాంబర్ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ పాల్గొన్నారు. -
ఘనంగా టాకో వార్షికోత్సవం
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని కొలంబస్లో సెంట్రల్ ఒహియో తెలుగు సంఘం (టాకో) 30వ వార్షికోత్సవ కార్యక్రమాలు రెండు రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పంపిన సందేశాలను చదివి వినిపించినట్లు టీడీపీ మీడియా కమిటీ చైర్మన్ ఎల్.వి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని, ప్రధాన కార్యదర్శి సతీష్ వేమన, నాట్స్ బోర్డు చైర్మన్ డాక్టర్ మధు కొర్రపాటి, నాట్స్ అధ్యక్షుడు రవి ఆచంట కూడా టాకో కార్యక్రమాలను ప్రశంసించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు సందేశం పంపారని, టాకో అధ్యక్షుడు కె.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారని తెలిపారు.