తానా మహాసభలకు కేసీఆర్‌కు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్:అమెరికాలోని డెట్రాయిట్‌లో 2015 జూలైలో నిర్వహించే ‘తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా’(తానా) మహాసభలకు హాజరుకావాలని ఆ సంస్థ ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఆహ్వానించారు.
గురువారం క్యాంపు కార్యాలయంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీఆర్‌ఎస్ నాయకుడు పల్లా రాజేశ్వరరెడ్డి నేతృత్వంలో ముఖ్యమంత్రిని కలిసిన ‘తానా’ అధ్యక్షుడు మోహన్ నన్నపనేని, జంపాల చౌదరి, మధు టాటా, తోటకూర ప్రసాద్, సతీష్, నరీన్ తదితరులు అమెరికాలో తెలుగు వారి భద్రతకు, సమస్యల పరిష్కారానికి, సాంస్కృతిక వికాసానికి సంస్థ చేస్తున్న కృషిని వివరించారు.
తెలంగాణలో విద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. కాగా, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి తానా నేతలకు వివరించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధ్దిలో భాగస్వాములు కావాలని వారిని కోరారు.