కేసీఆర్, కేటీఆర్‌కు తిరిగేందుకే సరిపోతోంది
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నిజామాబాద్ రూరల్ /ఎడపల్లి : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, మంత్రి కేటీఆర్ అమెరికా, స్విట్జర్లాండ్, జర్మనీ దేశాలను తిరగడానికే సరిపోతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మహాజన పాదయాత్రలో భాగంగా నిజామాబాద్ జిల్లా సారంగపూర్‌లో మూత పడిన నిజామాబాద్ సహకార చక్కెర కర్మాగారాన్ని గురువారం ఆయన పరిశీలించారు. రైతులతో, ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ సభ్యులతో మాట్లాడారు. ఫ్యాక్టరీని పునరుద్ధరించి చెరుకు రైతులకు విత్తనాలను, ఎరువులను అందించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 16న అసెంబ్లీ సమావేశాల్లో సారంగపూర్ ఫ్యాక్టరీ, బోధన్ షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరణ విషయంలో ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు, రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని వీరభద్రరావు కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్మించిన అధికార నివాస గృహం ఉన్నప్పటికి కేసీఆర్ రూ. 50 కోట్ల ఖర్చుతో ఇంటిని నిర్మించడం వృథా ఖర్చన్నారు.
మళ్లించిన నిధులను తిరిగి ఇవ్వాలి
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నుంచి ఇతర పథకాలకు మళ్లించిన నిధులను వెంటనే తిరిగి ఇవ్వాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఆ నిధులను ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికే ఖర్చు చేయాలని సీఎం కేసీఆర్‌కు గురువారం రాసిన లేఖలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. సబ్‌ప్లాన్ చట్టంలోని లోపాలను సవరించి, రూల్స్ రూపొందించాలని సూచించారు.