‘హిల్లరీ గెలవాలని కోరుకుంటున్నాం’
లక్నో: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ విజయం సాధించాలని ఉత్తరప్రదేశ్ లోని ఓ గ్రామం కోరుకుంటోంది. మోహన్ లాల్ గన్ జిల్లాలోని జాబ్రౌలీ గ్రామస్తులు హిల్లరీ గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. అమెరికా ఎన్నికల ఫలితాలను వారంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. కౌంటింగ్ సంబంధించిన వార్తలను టీవీల్లో వీక్షిస్తున్నారు.
జాబ్రౌలీ గ్రామాన్ని క్లింటన్ హెల్త్ ఫౌండేషన్ దత్తత తీసుకుని పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది. అందుకే హిల్లరీ పట్ల ఈ ఊరి ప్రజలు అభిమానం చూపిస్తున్నారు. హిల్లరీ క్లింటన్ గెలుస్తుందని తమకు నమ్మకం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆమె ఓడిపోతే బాధ పడతామని అన్నారు. గతంలో హిల్లరీ క్లింటన్ భర్త బిల్ క్లింటన్ ఈ గ్రామాన్ని సందర్శించారు.