మొహినుద్దీన్కు డబ్బులొచ్చాయ్..
- విద్యుదాఘాతంతో కాళ్లు, చేతులు కోల్పోరుున మొహినుద్దీన్
- ‘సాక్షి’ కథనంతో కృత్రిమ అవయవాల కోసం నగదు అందజేసిన బ్యాంకు మేనేజర్
సాక్షి, హైదరాబాద్: విద్యుదాఘాతంతో రెండు చేతులు, రెండు కాళ్లు పోగొట్టుకుని కృత్రిమ అవయవాలతో అవస్థ పడుతున్న ఖాజా మొహినుద్దీన్ నగదు పొందేందుకు పడుతున్న అవస్థపై ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి బ్యాంకు అధికారులు స్పందించారు. కొద్ది నెలల కింద ఇంటి వద్ద మర మ్మతు పనులు చేస్తుండగా ఇనుప కడ్డీ హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తగిలి విద్యుదాఘా తానికి గురైన ఖాజా రెండు చేతులు, రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యులు వాటిని తొలగించి తాత్కాలికంగా కృత్రిమ అవయవాలు అమర్చారు.
అవి పగిలిపోతుండటంతో వైద్యులను సంప్రదించగా పూర్తిస్థాయి కృత్రిమ అవయవాలు అమర్చాలని సూచించారు. ఇందుకు రూ.25 వేలు ఖర్చ వుతుందని చెప్పగా నాలుగు రోజుల కింద విజయనగర్ కాలనీలో ఉన్న ఎస్బీఐకి వచ్చాడు. బ్యాంకు సిబ్బంది రూ.4 వేలే ఇచ్చారు. అవి సరిపోకపోవటంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. అతని దుస్థితిపై ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. బుధవారం బ్యాంకుకు వచ్చిన ఖాజాకు కృత్రిమ అవయవాలు అమర్చుకునేందుకు ఆ బ్యాంకు మేనేజర్ రామస్వామి అవసరమైన మిగిలిన మొత్తాన్ని అందజేశారు.