వచ్చే నెల నుంచి మోనో పరుగులు
సాక్షి, ముంబై: మోనోరైలు కోసం సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న ముంబైకర్లకు త్వరలోనే వీటి సేవలు అందనున్నాయి. మోనోరైలు ప్రాజెక్టు నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. దీపావళి సెలవుల తరువాత, అంటే నవంబరు ఆఖరు వారానికల్లా మోనో రైలు సేవలను ప్రత్యక్షంగా వినియోగంలోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. అందుకు రైల్వే సేఫ్టీ కమిషనర్ నుంచి ధ్రువపత్రం పొందేందుకు అవసరమైన ప్రక్రియ పూర్తి చేశారు. రైలు నడిపే సిబ్బందికి, సిగ్నలింగ్ వ్యవస్థను పరిశీలించే టెక్నిషియన్లకు, ఇతర సిబ్బందికి శిక్షణ ఇచ్చే పనులు దాదాపు పూర్తికావచ్చాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. దీంతో నవంబరు ఆఖరువారంలో ముంబైకర్లు మోనోరైలులో ప్రయాణించే అవకాశం ఉండవచ్చని ఈ ప్రాజెక్టు అధికారి ఒకరు తెలిపారు.
దేశంలోనే మొట్టమొదటి మోనోరైలు ప్రాజెక్టును ముంబైలో చేపడుతున్న విషయం తెలిసిందే. వీటి నిర్మాణ పనులను పూర్తి చేయడానికి గత ఐదేళ్ల నుంచి అధికారులు విధించుకున్న గడువులన్నీ మీరిపోయినా మోనోరైలు మాత్రం పట్టాలెక్కకపోవడం తెలిసిందే. ప్రస్తుతం కొనసాగుతున్న పనుల తీరును గమనిస్తే నవంబరులోనే రైలుకు పచ్చజెండా ఊపే అవకాశాలు బాగానే ఉన్నాయని చెబుతున్నారు. వడాల-చెంబూర్ మొదటి విడత మోనో రైలు మార్గం 8.80 కి లోమీటర్లు ఉంది. ఇందులో మొత్తం ఏడు స్టేషన్లు ఉన్నాయి. ఆటోమేటిక్గా పనిచేసే ఈ రైళ్లకు గత ఫిబ్రవరి నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎదురవుతున్న సాంకే తిక లోపాలను ఎప్పటికప్పుడు సరిచేస్తున్నారు.
స్టేషన్లో సిగ్నల్ పనితీరు, ఇతర సాంకేతిక పరికరాలకు నిర్వహించే పరీక్షలు తుదిదశకు చేరుకున్నాయి. జపాన్ తరువాత భారతదేశంలో మాత్రమే ఇలాంటి రైళ్లు క నిపించనున్నాయి. దీంతో మనదేశంలో మొదటిసారిగా ప్రవేశపెడుతున్న ఈ ప్రాజెక్టును అధికారులు ఒక సవాలుగా తీసుకుంటున్నారు. ఎలాంటి నిర్లక్ష్యానికీ తావీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ రైళ్లు ప్రారంభమైన తరువాత లోపాలు, సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రతీ చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
మోనోరైలు ప్రత్యేకతలు...
ఈ ప్రాజెక్టు మొదటి విడతలో ఏడు స్టేషన్లు ఉండగా, తదనంతరం 12 స్టేషన్లను నిర్మిస్తారు.
ప్రాజెక్టు వ్యయం రూ.మూడువేల కోట్లు
నాలుగు బోగీల్లో 600 మంది ప్రయాణికులను తీసుకెళ్తుంది.
గంటకు 35-80 కిలోమీటర్ల వేగంతో ఈ రైళ్లు నడుస్తాయి.
గంటకు 18-20 వేల మంది వరకు ప్రయాణికులను చేరవేసే సామర్థ్యం ఈ రైళ్లకు ఉంది.
ఒక్క స్టేషన్కు కనీసం రూ.8-10 వరకు చార్జీ వసూలు చేస్తారు.
ఆటోమాటిక్ డోర్లు, పూర్తి ఏసీ బోగీలుంటాయి.
గులాబీ, నీలం, ఆకుపచ్చ రంగుల్లోని మూడు రైళ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని ఎమ్మెమ్మార్డీయే వర్గాలు తెలిపాయి.
అటకెక్కిన చర్చిగేట్ రైల్వే ప్రాజెక్టు
సాక్షి, ముంబై: రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో ఓవల్ మైదాన్ (చర్చిగేట్)-విరార్ ఎలివేటెడ్ రైల్వే ప్రాజెక్టు ముందుకుసాగడం లేదు. తాము విధించిన మూడు షరతులకు హామీ ఇవ్వాలన్న రైల్వే ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో స్తంభన నెలకొంది. రూ.30 వేల కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు 2020 వరకు పూర్తిచేయాలని రైల్వే లక్ష్యం నిర్దేశించుకుంది. మెట్రో,మోనోరైలు ప్రాజెక్టులాగా భవిష్యత్తులో తమకు వేరేసంస్థ పోటీకి రాకుండా నిరోధిస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేకుంటే ఎలివేటెడ్ మార్గానికి తాము వెచ్చించే మొత్తం వృథా అవుతుందని పేర్కొంది. ముంబైలో ప్రస్తుతం మెట్రో, మోనో రైలు ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. వీటి ప్రభావం ఓవల్మైదాన్-విరార్ ఎలివేటెడ్ రైల్వే మార్గంపై తప్పకుండా ఉంటుంది. వీటి కారణంగా భవిష్యత్తులో ఎలివేటెడ్ రైల్వే ప్రాజెక్టు ఆదాయానికి గండిపడే అవకాశాలు లేకపోలేదు.
రైల్వే విధించిన షరుతులు
ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు రైల్వే ఏవైనా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటే ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలి. అలాగే పనులు జరుగుతుండగా ఏదైన నష్టం జరిగినా భరించాలి.
ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ రైల్వే ప్రాజెక్టు ప్రారంభమయ్యాక పోటీగా మెట్రో, మోనో వంటి ప్రాజెక్టులు పోటీగా తీసుకురాకూడదు.
ప్రాజెక్టు పనులు పూర్తయిన తరువాత అనుసరించాల్సిన పన్నుల వసూలు విధానాన్ని ముందుగానే వెల్లడించాలి.