'నై'రుతి
పత్తా లేని ‘పవనాలు’
హోరెత్తిస్తున్న గాలి..
చెదరిపోతున్న మేఘాలు
ప్రశ్నార్థకంగా ఖరీఫ్ సాగు
వర్షంకోసం ఆశగా ఎదురు చూస్తున్న రైతన్నలు
అనంతపురం అగ్రికల్చర్ : నైరుతీ రుతుపవనాలు పత్తాలేకుండా పోయాయి. వరుణుడి జాడ లేకుండా పోయింది. తుంపర్లు మినహా జిల్లాలో ఎక్కడా చెప్పుకోదగ్గ వర్షాలు పడటం లేదు. అరకొర తేమలోనే అన్నదాతలు ఖరీఫ్ సాగు కొనసాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గాలలు దుమ్మురేపుతూ జిల్లాను హోరెత్తిస్తున్నాయి. బలమైన గాలులు వీస్తుండటంతో వర్షాకాలంలో కారుమబ్బులు కనిపించడం లేదు. అపుడపుడు మేఘాలు దోబూచలాడినా... గాలి వేగానికి చెదిరిపోతున్నాయి. ఫలితంగా రైతుల గుండెల్లో గుబులు రేగుతోంది.
పత్తా లేని వరుణుడు
కీలకమైన నైరుతీ రుతువపనాలు పత్తా లేకుండా పోవడంతో వరుణుడి జాడ కనిపించడం లేదు. నైరుతీ పవనాలు రాకమునుపే జిల్లాలో అంతో ఇంతో వర్షం కురిసింది. జూన్ 8న జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత వర్షాలు బాగా తగ్గుముఖం పట్టాయి. నెలరోజులుగా జిల్లాలో ఎక్కడా ఒక్కచోట కూడా భారీ వర్షం కురిసిన దాఖలాలు లేవు. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, తుంపర్లు నమోదవుతున్నాయి. జూన్ నెల సాధారణ వర్షపాతం 63.9 మి.మీ కాగా 59 మి.మీ నమోదైంది. జూలైలో సాధారణ వర్షపాతం 67.4 మి.మీ కాగా కేవలం 13.4 మి.మీ నమోదైంది. మొత్తమ్మీద ఇప్పటివరకు 25 శాతం తక్కువగా వర్షాలు కురవడంతో ఖరీఫ్ పంటల సాగు పడకేసింది.
25 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో గాలులు
రెండు, మూడు రోజులుగా జిల్లాలో గాలుల వేగం పెరిగింది. శనివారం నమోదైన వివరాలు పరిశీలిస్తూ అనంతపురం మండలంలో ఏకంగా 36 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. గుమ్మగట్ట, బుక్కరాయసముద్రం, రాప్తాడు, ఆత్మకూరు, గార్లదిన్నె, పామిడి, రాయదుర్గం, ధర్మవరం, బ్రహ్మసముద్రం, వజ్రకరూరు, పెద్దవడుగూరు, రాప్తాడు, కనగానపల్లి, రామగిరి, తలుపుల, యాడికి, అమరాపురం, కదిరి, రొద్దం తదితర మండలాల్లో 25 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో గాలులు హోరెత్తిస్తున్నాయి. మిగతా మండలాల్లో కూడా 15 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గాలిలో తేమ శాతం కూడా పడిపోయింది. ఈ సీజన్లో ఉదయం వేళల్లో గాలిలో తేమ 75 నుంచి 95 శాతం ఉండాల్సి ఉండగా ఇపుడు 60 నుంచి 75 శాతం మధ్య నమోదవుతోంది. మధ్యాహ్న సమయంలో కూడా తేమశాతం బాగా తగ్గుదల కనిపిస్తోంది.
ప్రత్యామ్నాయం తప్పదా...?
ఇప్పటివరకు 85 వేల హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ పంట వేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో 15 వేల హెక్టార్లలో ఇతర పంటలు సాగు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా పెద్ద ఎత్తున పంటలు సాగులోకి రావాల్సి ఉండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. గాలులు దుమ్మురేపుతుండటంతో వేసిన పంటలు అపుడే వాడుముఖం పట్టాయి. వరుణుడి కటాక్షం కోసం ఆకాశంవైపు చూస్తూ కాలం వెళ్లదీస్తున్న దుస్థితి నెలకొంది. వారం రోజులు వర్షాలు రాకపోతే ఇక ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకోసం వ్యవసాయశాఖ అధికారులు 67 వేల క్వింటాళ్ల ప్రత్యామ్నాయ విత్తనాలు అవసరమని కమిషనరేట్‌కు ప్రతిపాదనలు పంపారు.