వేలాది పింఛన్లూ ఎగవేతేనా?
విశ్లేషణ
అర్హులెవరో తేల్చి నెలనెలా పింఛను ఇస్తున్న ప్రభుత్వం ఆ పింఛన్ల చెల్లింపు ఉన్నట్టుండి ఆపేయడం ఎంత వరకు న్యాయం? సరైన కారణం లేకుండా పింఛను నిరాకరిస్తే పింఛను హక్కు భంగపరి చినట్టే. పింఛను ఆపేస్తే ఏ విధంగా పేదలు బతుకుతారు అనే ఆలోచన ఉండదా? అందుకు తగినన్ని నిధులు విడుదల చేయకపోవడం, ఎందుకో చెప్పకపోవడం న్యాయం కాదు. మరణించినా, ఆదాయం పెరిగినా, తరలిపోయినా పింఛను నిరాకరించవచ్చు. ఈ కార ణాలు లేకుండానే పింఛను ఇవ్వకపోవడం ఢిల్లీ సర్కార్ సమస్య.
చరణ్‌జిత్‌సింగ్ భాటియా భార్య వికలాంగురాలు. ఆమెకు పింఛను మంజూరు చేసి 2014లో ఏప్రిల్ నుంచి జూన్ 2014 వరకు మూడువేల రూపాయలు ఫిబ్రవరి 2015లో చెల్లించారు. అంతే.. ఆ తరువాత ఆమెకు పింఛను ఇవ్వలేదు. ఢిల్లీ ప్రభుత్వానికి ఆయన ఎన్ని విన్నపాలు చేసుకున్నా విన్నవారు లేరు. పింఛను ఎందుకు నిలిపివేసారు? ఎప్పటి నుంచి ఇస్తారు? అని సమాచారం కోరుతూ దరఖాస్తు పెట్టుకున్నాడు.
ఆయన దరఖాస్తును స్థానికసంస్థల డెరైక్టరేట్, ప్రణాళిక విభాగం, ఆర్థిక శాఖ, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఉత్తర) లకు బదిలీ చేశారనీ, వారినే సమాచారం అడుక్కోవాలని సలహా ఇచ్చింది ముఖ్యమంత్రి కార్యాలయం. అక్కడితో ఆగలేదు. సహ దరఖాస్తును మరో 29 కార్యాలయాలకు బదిలీ చేశారు. అందులో కొందరు మరికొన్ని శాఖలకు బదిలీచేశారు. మీరడిగిన సమాచారం మాదగ్గర లేదు, మరో శాఖకు బదిలీచేశాం మీకు వారి దగ్గరనుంచి సమాచారం వస్తుంది. రాకపోతే వారినడగండి అంటూ ఆయనకు అనేక ఉత్తరాలు చేరాయి. కాని కావలసిన సమాచారం మాత్రం అందలేదు.
పింఛను చెల్లించకపోవడంపై సోషల్ జస్టిస్ అనే ఒక ఎన్జీవో పిల్‌ను దాఖలు చేసింది. ఢిల్లీ పురపాలక సంఘం వారు పింఛను పథకాన్ని సాంఘిక సంక్షేమ శాఖకు బదిలీ చేస్తున్నట్లు హైకోర్టుకు తెలియజేశారని, మునిసిపాలిటీ వారికి 2015లో 700 కోట్ల రూపాయల లోటు ఉందని, 73 వేల మందికి పింఛను పొందే అర్హత ఉన్నప్పటికీ దక్షిణ ఢిల్లీ మునిసిపాలిటీ 63,914 మందికి 30.9.2014 వరకు మాత్రమే పింఛన్లు చెల్లించిందనీ, తూర్పు ఢిల్లీ మునిసిపాలిటీ రెండేళ్ల నుంచి 107.52 కోట్ల రూపాయల మేరకు పింఛన్లు చెల్లించలేకపో యిందనీ, నిధులకొరతే కారణమని కోర్టుకు విన్నవిం చారు.
ఇదే సమస్యపైన బీజేపీ నాయకులు హైకోర్టులో మరొక పిల్ వేశారు. 1.5 లక్షల మంది వృద్ధులకు పింఛను ఇవ్వడం లేదని పేర్కొన్నారు. మునిసి పాలిటీలు ఈ పింఛను పథకాన్ని ప్రభుత్వమే తీసుకో వాలని వినతి చేశాయంటూ పత్రికావార్తలు వచ్చాయి.
పింఛను ఇవ్వలేకపోవడం వైఫల్యమే. పింఛనుదార్లకు పింఛను ఎప్పుడిస్తారో, ఎందుకివ్వడం లేదో చెప్పలేకపోవడం తీవ్రమైన వైఫల్యం. 2014లో, 2015లో కొత్త ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఆధ్వర్యంలో ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత ఈ పింఛను చెల్లింపులు ఎందుకు సమస్యగా మారాయో చెప్పాలని అడుగుతున్నారు. లక్షలాది పింఛన్లు చెల్లించకపోవడం మానవ హక్కుల భంగ సమస్యగా పరిణమిస్తుంది.
అటు సీఎంఓ గానీ, ఇతర ప్రభుత్వ అధికారులు గానీ పింఛను ఎందుకు ఇవ్వలేకపోతు న్నారో జవాబుచెప్పడం లేదు. నిర్ణీత కాల పరిధిలో సేవలు పొందే పౌరుల హక్కుల చట్టం 2011 కింద, ఢిల్లీ ప్రభుత్వం 371 రకాల సేవలను అందించవలసి ఉంటుంది. ఇందులో నష్టపరిహార నియమాన్ని సరిగ్గా అమలుచేయడం లేదు.
15 రోజుల్లో ఇవ్వవలసిన సర్టిఫికెట్ ఇవ్వకపోతే 16వ రోజునుంచి రోజుకు కొంత చొప్పున పరిహారం పెరుగుతూ ఉండాలి. పింఛను ఇవ్వడం అనే పని చేయకపోవడం వల్ల ఎంత నష్ట పరిహారం ఇస్తారని చరణ్‌జిత్‌సింగ్ అడుగుతున్నారు. ‘అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు తలమానికమైన ముఖ్యమంత్రి కార్యాలయం కూడా మామూలుగా సహ దరఖాస్తులను బదిలీ చేయడంతో కాలం వెళ్లబుచ్చడం న్యాయం కాదు. 38 విభాగాలకు బదిలీ చేయడానికి వేల రూపాయలు ఖర్చు చేస్తారు కాని పింఛనుకు డబ్బు లేదంటారు’ అని విమర్శించారు.
కోరిన సమాచారం విడివిడిగా ఏ ఒక్క విభాగమూ ఇవ్వజాలదు. ఇది నిధుల లేమికి సంబంధించిన సమస్య కనుక ముఖ్యమంత్రి కార్యాలయం పట్టించు కొని వివరాలు ఇవ్వాలి. కనీసం వారి ఇబ్బందులేవో చెప్పాలి. డబ్బు లేదనో, కనుక కొన్నాళ్లు ఇవ్వలేమనో లేదా అసలు దీనికి సంబంధించి వారి ప్రణాళిక ఏమిటో వివరించవలసిన అవసరం ఉంది.
చరణ్‌జిత్ సింగ్‌కు బోలెడు కాగితాలు వస్తున్నాయి కాని కావలసిన సమాచారం మాత్రం రాలేదు. సీఎం కార్యాలయం ఏ చర్య తీసుకున్నదని అడిగితే ఆ దరఖాస్తును కింది స్థాయి అధికారికి పంపడం సమాచారాన్ని నిరాకరించడమే అవుతుందనీ, ఈ ధోరణిని మానుకోవాలని, అనవ సరంగా ఆర్టీఐని బదిలీ చేసిన ప్రతి అధికారి నుంచి వంద రూపాయలు వసూలు చేసి ిసీఎం రిలీఫ్ ఫండ్‌లో జమచేయాలని, పింఛను ఇవ్వకుండా, సమాచారం ఇవ్వకుండా వేధించినందుకు చరణ్‌సింగ్‌కు లక్ష రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని, జరిమానా ఎందుకు విధించకూడదో చెప్పాలని సీఐసీ ఆదేశించింది. పింఛను చెల్లింపులపైన 20 రోజులలో ఒక శ్వేతపత్రం ఇవ్వాలని కూడా ఆదేశించింది. (చరణ్‌జిత్ సింగ్ భాటియా వర్సెస్ డెరైక్టర్ లోకల్ బాడీస్, GNCTDCIC/SA/A/ 2015/001343 కేసులో 25.1.2016న తీర్పు ఆధారంగా)
-మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com