బస్సుల కోసం రాస్తారోకో
పెద్ద గోల్కొండ (శంషాబాద్ రూరల్) : సరిపడా బస్సు సౌకర్యాలు కల్పించాలని కోరుతూ మండలంలోని పెద్దగోల్కొండలో సోమవారం విద్యార్థులు, గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టారు. నాగారం-శంషాబాద్ రూట్లో వచ్చే బస్సులను అడ్డుకున్నారు. గ్రామానికి సరైన బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొన్నారు. నాగారం వైపు నుంచి వచ్చే బస్సులు కిక్కిరిసి వస్తున్నాయని, అందులో ఎక్కేందుకు స్థలం దొరకడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో బస్సులను ఇక్కడి బస్టాప్‌లో నిలపడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ రూట్లో బస్సు సర్వీసులను పెంచాలని ఆర్టీసీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడంలేదని వారు పేర్కొన్నారు. సుమారు అరగంట పాటు నాగారం, శంషాబాద్ రూట్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో శాంతించారు.