గూగుల్ సెర్చ్‌లో టాప్ నాయకుడు ఎవరో తెలుసా?
రాష్ట్రంలో అత్యధికంగా నెటిజన్లు ఎవరికోసం సెర్చ్ చేశారో తెలుసా.. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించే. పెద్దపెద్ద నాయకులందరినీ పక్కన పెట్టి మరీ జగన్ విశేషాల గురించి తెలుసుకోడానికి నెటిజన్లు ఆసక్తి చూపించారు. మరో రెండేళ్లలో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో.. గూగుల్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయని పరిశీలించగా ఈ విషయం తేలినట్లు జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది.
గడిచిన 90 రోజులలో గూగుల్ ట్రెండ్స్ సమాచారాన్ని సేకరించి వాటిని సగటున చూడగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో సమానంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాపులారిటీ పెరిగినట్లు గూగుల్ తెలిపింది. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాత్రం అసలు పెద్దగా నెటిజన్లు పట్టించుకోవడం లేదు. వాళ్లిద్దరికీ చాలా తక్కువ సంఖ్యలోనే సెర్చ్‌లు వచ్చాయట. మోదీ గురించి సెర్చ్ చేసినవారిలో సగం మంది, కేజ్రీవాల్ గురించి సెర్చ్ చేసినవారిలో మూడింట రెండొంతుల మంది ఏపీ నుంచి జగన్ కోసం సెర్చ్ చేశారు.
విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో అయితే రాష్ట్ర నాయకుల కంటే జాతీయ స్థాయి నాయకుల గురించే ఎక్కువగా సెర్చ్ చేయడం గమనార్హం. అలాగే హైదరాబాద్‌లో కూడా ఎక్కువమంది నరేంద్రమోదీ, అరవింద్ కేజ్రీవాల్ గురించి సెర్చ్ చేశారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ ఫేస్బుక్ పేజీకి 10 నెలల్లోనే 3 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఈ విషయాన్ని పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.