mother in laws torture
-
చెల్లెలికి చిత్రహింసలు.. అత్తింటి కుటుంబాన్నే మట్టుబెట్టాలని..
సాక్షి,నిడమనూరు(వరంగల్): ఒకే గ్రామంలో ఉన్నా పుట్టింటికి వెళ్లకూడదని ఆంక్షలు.. వారితో పల్లెత్తు మాట కూడా మాట్లాడొద్దని ఆదేశాలు.. అనారోగ్యం బారిన పడినా కనీసం చికిత్స కూడా చేయించని కాఠిన్యం.. చీటికి మాటికి వేధింపులు.. మానసిక చిత్రహింసలు.. ఇలా తన చెల్లెలిని అత్తింటి వారు బాధ పెడుతున్నారని ఆ యువకుడు రగిలిపోయాడు. ఇదే విషయంపై ఒకమారు బావను మందలించి దండించినా మార్పు రాలేదు. సరికదా అతడి ఆగడాలు పెచ్చరిల్లాయి. దీంతో సోదరి పడుతున్న బాధలు చూడలేక ఆ యువకుడు సోదరి అత్తింటి కుటుంబాన్నే మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రులతో కలిసి ఫ్యాక్షన్ తరహాలో తెగబడి చెల్లెలు అత్తను దారుణంగా మట్టుబెట్టగా మరో ముగ్గురిపై కత్తులతో దాడి చేశారు. నిడమనూరు మండలం బొక్కమంతులపాడ్‌లో ఓ కుటుంబంపై జరిగిన దాడికి ఇవే కారణాలని తెలిసింది. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు.. భార్య ఇష్టం లేదంటూ నాలుగేళ్లుగా.. బొక్కమంతులపాడ్ గ్రామానికి చెందిన కమతం భిక్షమయ్య, అచ్చమ్మ(60) దంపతుల కుమారుడు శివనారాయణకు అదే గ్రామానికి చెందిన జెల్లపల్లి సూర్యనారాయణ, యశోధ దంపతుల కూతురు శ్యామలతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. శివనారాయణ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కరోనా కాలంలో ఐటీ రంగం దెబ్బతినడంతో రెండేళ్లుగా గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడు. వీరికి నాలుగు సంవత్సరాల కూతురు సంతానం.కాగా, శివనారాయణ తనకు భార్య ఇష్టం లేదంటూ నాలుగేళ్లుగా శ్యామలను వేధిస్తూ, చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. ఇదే క్రమంలో విడాకుల కోసం కోర్టుకు సైతం వెళ్లారని సమాచారం. దీంతో రెండు కుటుంబాల పెద్ద మనుషులు దంపతులకు సర్దిచెప్పి రాజీ కుదిర్చారని తెలిసింది. మార్చురీలోనే అచ్చమ్మ మృతదేహం వియ్యంకుడి కుటుంబం దాడిలో దారుణ హత్యకు గురైన కమతం అచ్చమ్మ మృతదేహం ఇంకా మిర్యాలగూడ మార్చురీలోనే ఉంది. భిక్షమయ్య, అచ్చమ్మ దంపతులకు కుమారుడు శివనారాయణ, కూతురు జ్యోతి సంతానం. కాగా, దాడిలో గాయపడిన కుమారుడు, భర్త ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా కూతురు జ్యోతి విదేశంలో స్థిరపడింది. అంత్యక్రియలు జరిపేందుకు కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో మృతదేహాన్ని మార్చురీలోనే ఉంచారు. విదేశంలో ఉన్న ఆమె కూతురు వచ్చే వరకు మృతదేహం అక్కడే ఉంటుందని గ్రామస్తులు పేర్కొన్నారు. నీ కూతురును కొట్టలేదు.. కొడితే ఏం చేస్తావ్..? పెద్ద మనుషులు సర్దిచెప్పినా శివనారాయణ తీరులో మార్పు రాలేదు. పైగా పుట్టింటికి వెళ్లొద్దని, వారితో మాట్లాడొద్దని ఇలా పలు రకాల ఆంక్షలు పెట్టి శ్యామలను వేధిస్తున్నాడు. ఇదే తరుణంలో గత సోమవారం శ్యామలతో గొడవ పడిన విషయం సూర్యనారాయణకు తెలియడంతో తన అల్లుడు కూతురిని చిత్రహింసలు పెడుతున్నాడని గ్రామస్తుల వద్ద వాపోయాడు. ఆ విషయం తెలుసుకున్న శివనారాయణ మామ సూర్యనారాయణకు ఫోన్ చేసి నీ కూతురును కొట్టలేదు.. ఇప్పుడు కొడితే ఏం చేస్తావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో విషయం సూర్యానారాయణ తన కొడుకు శివకు చెప్పడంతో అగ్గికి ఆజ్యం పోసిన చందంగా ఫ్యాక్షన్ తరహా దాడికి కారణమైందని తెలుస్తోంది. ఈ దాడిలో కుమారుడికి సహకారం అందిస్తున్నారన్న అభియోగం మేరకు వృద్ధురాలు అచ్చమ్మ ప్రాణాలు కోల్పోగా శివనారాయణ, అతడి తండ్రి భిక్షమయ్య, అచ్చమ్మ తల్లి నారాయణమ్మ గాయపడిన విషయం తెలిసిందే. అయితే, దాడి సమయంలో గ్రామస్తులు ఘటన స్థలానికి రావడంతోనే శ్యామల అత్తింటి వారిని అందరినీ మట్టుబెట్టలేక నిందితులు పరారైనట్లు తెలుస్తోంది. దాడి ఘటన అనంతరం నిందితులు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. విచారణలో దాడికి ఇవే కారణాలంటూ నిందితులు ఒప్పుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే, నిందితుల లొంగుబాటుపై నిడమనూరు పోలీసు లను వివరణ కోరగా «ధ్రువీకరించలేదు. కాగా, దాడిలో గాయపడిన శివనారాయణను మెరుగైన చికిత్స నిమిత్తం బుధవారం హైదరాబాద్‌కు తరలించగా మిగిలిన ఇద్దరు మిర్యాలగూడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
మగబిడ్డ కావాలని బెదిరింపులు; ఒత్తిడి భరించలేక..
సాక్షి, కుప్పం : ఇద్దరు ఆడబిడ్డలకు జన్మనివ్వడమే ఆమె పాలిట శాపమైంది. మూడో కాన్పులోనైనా మగబిడ్డను ప్రసవించకపోతే పరిమాణాలు వేరుగా ఉంటాయని అత్తామామల బెదిరింపులు.. రెండో పెళ్లి చేసుకుంటానంటూ భర్త హుంకరింపు..ఈ వేధింపులకు తాళలేక ఓ గర్భిణి ఉరేసుకుని తనువు చాలించింది. పోలీసుల కథనం.. కుప్పం మునిసిపాలిటీలోని తంబిగానిపల్లె కోటాలుకు చెందిన కవిత (25), గోవిందరాజులు దంపతులకు రక్షిత (3), రుచిత (1) సంతానం. రెండు కాన్పుల్లోనూ ఇద్దరూ ఆడపిల్లలే జన్మించడంతో భర్తతోపాటు అత్తమామలు మునెమ్మ, నాగరాజు తరచూ వేధించేవారు. ఇద్దరూ ఆడపిల్లలే అయినా, ఉన్నంతలో సంతోషంగా జీవిద్దామని, ఇక పిల్లలు వద్దని కవిత తన భర్తకు ఎన్నోసార్లు హితవు పలికినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆమె మళ్లీ గర్భం దాల్చింది. అప్పటి నుంచి అత్తింటి వేధింపులు తీవ్రమయ్యాయి. ప్రస్తుతం 3వ నెల నిండింది. మగబిడ్డను ప్రసవించకపోతే రెండవ పెళ్లి చేసుకుంటానంటూ భర్త తరచూ వేధిస్తూండడంతో కుంగిపోయింది. ఈ ఒత్తిళ్లకు తట్టుకోలేక కవిత ఇంట్లోనే బుధవారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక కవిత మృతి చెందిందని మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ శ్రీధర్ తెలిపారు. అనాథలైన చిన్నారులు తల్లి చనిపోయిందని గ్రహించలేని ఏడాది పైచిలుకు వయసున్న చిన్నారి రుచిత పాల కోసం ఏడుస్తుంటే చూపరులను కంటతడి పెట్టించింది. అత్తమామలు, భర్తకు మగబిడ్డపై ఉన్న మోజు చివరకు ఆమె ఊపిరి తీసిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. -
వేధింపులే కారణమా..?
చిన్నపాటి తగాదాకు మనస్తాపం చెందిందా..? అత్తా, మరిది కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చి చీటికిమాటికి వేధిస్తుండడంతో అఘాయిత్యానికి ఒడిగట్టిందా..? కారణాలు ఏవైతేనేం.. ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో పెద్దకుమార్తె ప్రమాదంనుంచి బయటపడగా.. ముక్కుపచ్చలారని చిన్నారితో సహా ఆ మాతృమూర్తి అగ్నిగి ఆహుతైంది. ఈవిషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, మృతురాలి తండ్రి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్ (భువనగిరి): మండలంలోని రహీమ్‌ఖాన్‌గూడెం గ్రామానికి చెందిన పిట్టబోయిన భిక్షపతి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలసపోయాడు. అక్కడే బోడుప్పల్లో నివాసముంటున్నాడు. తన కూతురు నిర్మల(25)ను ఆరేళ్లక్రితం మదిర గూడూరుకు చెందిన జూరూర్ శ్రీశైలంయాదవ్‌కు ఇచ్చి వివాహాం చేశారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం. విడిగా కాపురం పెట్టుకుని అత్తామామ ఇంట్లోనే అన్యోన్యంగా జీవిస్తున్నారు. కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని.. గతంలో నిర్మల ఓప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ భర్తకు చేదోడువాదోడుగా ఉండేది. చిన్నకుమార్తె జన్మించిన తర్వాత ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటోంది. కాగా శ్రీశైలం, తన తమ్ముడు వెంకటేశ్ వేరుగా కాపురం పెట్టుకున్నప్పటికీ తల్లి దండ్రుల ఇంట్లోనే ఉంటున్నారు. భర్త లేని సమయంలో అత్త జయమ్మ, మరిది తరుచూ కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ తన కూతురు నిర్మలను వేధించేవారని నిర్మల తండ్రి భిక్షపతి ఆరోపించాడు., ప్రతి దానికి సూటిపోటి మాటాలను అంటుండడంతో మనస్తాపం చెంది నిర్మల పిల్లలతో కలసి అత్మహత్యకు పాల్పడిందని కన్నీటిపర్యంతమయ్యాడు. తన అల్లుడు మంచివాడేనని, అతడిపై మాకు అనుమానాలు లేవన్నాడు. తప్పించుకున్న పెద్ద కూతురు ఉదయం 9గంటల సమయంలో భర్త గొర్రెలను మేపేందుకు వెళ్లగా, అత్తమామలు పొలానికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో నిర్మల ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పు అంటించే సమయంలో భయాందోళనకు గురైన ఎల్కేజీ చదువుతున్న పెద్ద కూతురు ప్రజ్ణ ఇంట్లోని ప్రహరీ ఆవరణంలోకి వెళ్లింది . దీంతో నిర్మల తన దగ్గరే ఉన్న 16నెలల చిన్నకూతురు శృతితో కలసి నిప్పంటించుకుంది. దీంతో వారిద్దరూ సజీవ దహనమయ్యారు. ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతిదానికీ చిరాకు పడేది ఇంట్లో ఏదైనా చిన్న పాటి గొడవ జరిగినా మనస్పర్థలు చోటు చేసుకున్నా తన భార్య చిరాకు పడుతూ గొడవపెట్టుకుని అలిగేదని నిర్మల భర్త శ్రీశైలం పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం ఇంట్లో పిల్లలకు పాలు లేకపోవడంతో భర్తతో నిర్మల గొడవపడిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. భర్త గొర్రెలు మేపేందుకు వెళ్లాడని దీంతో మనస్తాపం చెందిన నిర్మల పిల్లలతో కలసి అత్మహత్య చేసుకోవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అదుపులో భర్త,అత్తా, మరిది సంఘటన స్థలంలోనే ఉన్న నిర్మల భర్త, అత్త, మామ, మరిదిని పోలీస్‌లు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్‌కుమార్ తెలిపారు. -
అత్త ఆరళ్లపై ఆన్లైన్లో రచ్చరచ్చ
న్యూఢిల్లీ: అత్తా కోడళ్ల గొడవలు మనకు కొత్త కాదు. రచ్చకెక్కిన సందర్భాలూ, కోర్టుకెక్కిన ఉదంతాలూ ఎన్నో ఉన్నాయి. అత్త ఆరళ్లను భరించలేక ఓ కోడలు అత్తకు వ్యతిరేకంగా బహుశా మొట్ట మొదటిసారి సైబర్ ప్రపంచానికి ఎక్కింది. బార్టర్ వెబ్సైట్ ఫాయిదా డాట్ కామ్‌లో 'మదర్ ఇన్ లా ఇన్ గుడ్ కండీషన్' ట్యాగ్ లైన్‌తో కామెంట్స్ పోస్ట్ చేసింది ఇలా.... 'మా అత్తగారు 60 ఏళ్ల ప్రాయంలో ఉన్నారు. ఆమె గొంతు మృదుమధురం. ఇరుగుపొరుగు వారందరిని ఆ గొంతు చంపేస్తుంది. కోడలు చేసే వంటకాలను రుచి చూసి విశ్లేషించడం, విమర్శించడంలో ఆమె దిట్ట. నీవు ఎంత మంచిగా వంట చేసినా ఆమెకు రుచించదు. సలహాలివ్వడంలో కూడా ఆమెకు ఆమే సాటి. నీవు ఏ పని ఎంత బాగా చేసినా ఇంకా బాగా చేయాలని అంటుంది. ఆమె ఆయురారోగ్యంతో పుష్టిగా ఉన్నారు. మానసిక ప్రశాంతతను ఇచ్చే ఓ పుస్తకానికి ఆమెను ఎక్స్ఛేంజ్ చేయగలను' అని సదరు కోడలు వ్యాఖ్యలు చేసింది. సైబర్ చట్టం ప్రకారం ఆ అత్తా కోడళ్ల వివరాలు వెల్లడించకూడదు. అందుకనే ఈ కామెంట్లను చూసిన పది నిమిషాల్లోనే వెబ్సైట్ నిర్వాహకులు వాటిని తొలగించారు. సైబర్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకునే ప్రమాదం ఉండడంతోనే కామెంట్స్ తొలగించామని ఫాయిదా డాట్ కామ్ సహ వ్యవస్థాపకులు, అధికార ప్రతినిధి విఫుల్ పాలివాల్ తెలియజేశారు. తమ వెబ్సైట్ ఇలాంటి పోస్ట్ రావడం ఇదే మొదటి సారని, ఎప్పటికప్పుడు ఇలాంటి వాటిని మాన్యువల్‌గా తొలగిస్తున్నామని ఆయన చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వెబ్‌సైట్‌ను మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. అప్పుడు కామెంట్స్ పరిశీలించాకే ప్రజల్లోకి వెళ్లేలా చేయవచ్చని చెప్పారు. గతంలో భర్తకు వ్యతిరేకంగా భార్యలు వెబ్సైట్లలో అనైతిక పోస్ట్‌లు చేసిన సందర్భాలు లేకపోలేదు. 'పెట్స్ అండ్ పెట్ కేర్' శీర్షికన ఓ భార్య తన భర్త ఫొటోను క్వికర్ డాట్ కామ్‌లో పోస్ట్ చేశారు. ఇదే సైట్లో ఓ కోడలు తన మామకు వ్యతిరేకంగా ఇలాంటి పోస్ట్ ఒకటి చేశారు. క్యాన్సర్ కారణంగా ఆమె మామ ముఖానికి సర్జరీ చేశారు. అప్పటి ఆయన ముఖాన్ని కుక్కలాగా మార్ఫింగ్ చేసి సదరు కోడలు పోస్ట్ చేశారు. 2013లో తన భర్త, ఆయన తల్లి, చెల్లితో శారీరక సంబంధం కలిగిఉన్నట్టు ఫొటోలను మార్ఫింగ్ చేసి చెన్నైకి చెందిన ఓ పాతికేళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ సామాజిక వెబ్సైట్లో పోస్ట్ చేశారు. దీనిపై ఆమెను, ఆమె తండ్రిని సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ సంబంధమైన సమస్యలపై సైబర్ ప్రపంచానికి ఎక్కి కుటుంబ సభ్యుల్లో ఎవరి పరువు తీసినా సైబర్ చట్టాల ప్రకారం నేరమే అవుతుంది. వ్యక్తిగత స్వేచ్ఛను దెబ్బతీయడం, క్రూరత్వం లాంటి అంశాల కింద శిక్షలు కూడా విధిస్తారు. ఈ కారణంగా బాధితులు డైవోర్స్ కూడా తీసుకోవచ్చు. కుటుంబంతో సంబంధం లేకుండా ఎవరి ఫొటోనైనా ఆ వ్యక్తి అనుమతి లేకుండా మార్ఫింగ్ చేసి ప్రజల దృష్టికి తీసుకెళితే 2000లో తీసుకొచ్చిన ఐటీ చట్టంలోని 66సీ సెక్షన్ కింద మూడేళ్ల వరకు జైలు, లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అలాగే అనుమతి లేకుండా ఎవరి నగ్న దృశ్యాలను వెబ్సైట్లో పోస్ట్ చేస్తే ఆదే ఐటీ చట్టంలోని 67వ సెక్షన్ కింద మూడేళ్ల వరకు జైలు శిక్ష, ఐదు లక్షల వరకు జరిమానా విధించవచ్చని సైబర్ న్యాయ నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే భారతీయ శిక్షాస్మృతిలోని 500 సెక్షన్ కింద పరువు నష్టం దావా కూడా వేయవచ్చు. అనైతిక ఫొటోలు, వ్యాఖ్యలను వెబ్సైట్ల నుంచి 36 గంటల్లోగా తొలగించకపోతే క్రిమినల్ చర్యలను కూడా తీసుకునే అవకాశం ఉంది.