అత్త ఆరళ్లపై ఆన్లైన్లో రచ్చరచ్చ
న్యూఢిల్లీ: అత్తా కోడళ్ల గొడవలు మనకు కొత్త కాదు. రచ్చకెక్కిన సందర్భాలూ, కోర్టుకెక్కిన ఉదంతాలూ ఎన్నో ఉన్నాయి. అత్త ఆరళ్లను భరించలేక ఓ కోడలు అత్తకు వ్యతిరేకంగా బహుశా మొట్ట మొదటిసారి సైబర్ ప్రపంచానికి ఎక్కింది. బార్టర్ వెబ్సైట్ ఫాయిదా డాట్ కామ్లో 'మదర్ ఇన్ లా ఇన్ గుడ్ కండీషన్' ట్యాగ్ లైన్తో కామెంట్స్ పోస్ట్ చేసింది ఇలా....
'మా అత్తగారు 60 ఏళ్ల ప్రాయంలో ఉన్నారు. ఆమె గొంతు మృదుమధురం. ఇరుగుపొరుగు వారందరిని ఆ గొంతు చంపేస్తుంది. కోడలు చేసే వంటకాలను రుచి చూసి విశ్లేషించడం, విమర్శించడంలో ఆమె దిట్ట. నీవు ఎంత మంచిగా వంట చేసినా ఆమెకు రుచించదు. సలహాలివ్వడంలో కూడా ఆమెకు ఆమే సాటి. నీవు ఏ పని ఎంత బాగా చేసినా ఇంకా బాగా చేయాలని అంటుంది. ఆమె ఆయురారోగ్యంతో పుష్టిగా ఉన్నారు. మానసిక ప్రశాంతతను ఇచ్చే ఓ పుస్తకానికి ఆమెను ఎక్స్ఛేంజ్ చేయగలను' అని సదరు కోడలు వ్యాఖ్యలు చేసింది. సైబర్ చట్టం ప్రకారం ఆ అత్తా కోడళ్ల వివరాలు వెల్లడించకూడదు. అందుకనే ఈ కామెంట్లను చూసిన పది నిమిషాల్లోనే వెబ్సైట్ నిర్వాహకులు వాటిని తొలగించారు.
సైబర్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకునే ప్రమాదం ఉండడంతోనే కామెంట్స్ తొలగించామని ఫాయిదా డాట్ కామ్ సహ వ్యవస్థాపకులు, అధికార ప్రతినిధి విఫుల్ పాలివాల్ తెలియజేశారు. తమ వెబ్సైట్ ఇలాంటి పోస్ట్ రావడం ఇదే మొదటి సారని, ఎప్పటికప్పుడు ఇలాంటి వాటిని మాన్యువల్గా తొలగిస్తున్నామని ఆయన చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వెబ్సైట్ను మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. అప్పుడు కామెంట్స్ పరిశీలించాకే ప్రజల్లోకి వెళ్లేలా చేయవచ్చని చెప్పారు.
గతంలో భర్తకు వ్యతిరేకంగా భార్యలు వెబ్సైట్లలో అనైతిక పోస్ట్లు చేసిన సందర్భాలు లేకపోలేదు. 'పెట్స్ అండ్ పెట్ కేర్' శీర్షికన ఓ భార్య తన భర్త ఫొటోను క్వికర్ డాట్ కామ్లో పోస్ట్ చేశారు. ఇదే సైట్లో ఓ కోడలు తన మామకు వ్యతిరేకంగా ఇలాంటి పోస్ట్ ఒకటి చేశారు. క్యాన్సర్ కారణంగా ఆమె మామ ముఖానికి సర్జరీ చేశారు. అప్పటి ఆయన ముఖాన్ని కుక్కలాగా మార్ఫింగ్ చేసి సదరు కోడలు పోస్ట్ చేశారు. 2013లో తన భర్త, ఆయన తల్లి, చెల్లితో శారీరక సంబంధం కలిగిఉన్నట్టు ఫొటోలను మార్ఫింగ్ చేసి చెన్నైకి చెందిన ఓ పాతికేళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ సామాజిక వెబ్సైట్లో పోస్ట్ చేశారు. దీనిపై ఆమెను, ఆమె తండ్రిని సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కుటుంబ సంబంధమైన సమస్యలపై సైబర్ ప్రపంచానికి ఎక్కి కుటుంబ సభ్యుల్లో ఎవరి పరువు తీసినా సైబర్ చట్టాల ప్రకారం నేరమే అవుతుంది. వ్యక్తిగత స్వేచ్ఛను దెబ్బతీయడం, క్రూరత్వం లాంటి అంశాల కింద శిక్షలు కూడా విధిస్తారు. ఈ కారణంగా బాధితులు డైవోర్స్ కూడా తీసుకోవచ్చు. కుటుంబంతో సంబంధం లేకుండా ఎవరి ఫొటోనైనా ఆ వ్యక్తి అనుమతి లేకుండా మార్ఫింగ్ చేసి ప్రజల దృష్టికి తీసుకెళితే 2000లో తీసుకొచ్చిన ఐటీ చట్టంలోని 66సీ సెక్షన్ కింద మూడేళ్ల వరకు జైలు, లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అలాగే అనుమతి లేకుండా ఎవరి నగ్న దృశ్యాలను వెబ్సైట్లో పోస్ట్ చేస్తే ఆదే ఐటీ చట్టంలోని 67వ సెక్షన్ కింద మూడేళ్ల వరకు జైలు శిక్ష, ఐదు లక్షల వరకు జరిమానా విధించవచ్చని సైబర్ న్యాయ నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే భారతీయ శిక్షాస్మృతిలోని 500 సెక్షన్ కింద పరువు నష్టం దావా కూడా వేయవచ్చు. అనైతిక ఫొటోలు, వ్యాఖ్యలను వెబ్సైట్ల నుంచి 36 గంటల్లోగా తొలగించకపోతే క్రిమినల్ చర్యలను కూడా తీసుకునే అవకాశం ఉంది.