
సాక్షి, కుప్పం : ఇద్దరు ఆడబిడ్డలకు జన్మనివ్వడమే ఆమె పాలిట శాపమైంది. మూడో కాన్పులోనైనా మగబిడ్డను ప్రసవించకపోతే పరిమాణాలు వేరుగా ఉంటాయని అత్తామామల బెదిరింపులు.. రెండో పెళ్లి చేసుకుంటానంటూ భర్త హుంకరింపు..ఈ వేధింపులకు తాళలేక ఓ గర్భిణి ఉరేసుకుని తనువు చాలించింది. పోలీసుల కథనం.. కుప్పం మునిసిపాలిటీలోని తంబిగానిపల్లె కోటాలుకు చెందిన కవిత (25), గోవిందరాజులు దంపతులకు రక్షిత (3), రుచిత (1) సంతానం. రెండు కాన్పుల్లోనూ ఇద్దరూ ఆడపిల్లలే జన్మించడంతో భర్తతోపాటు అత్తమామలు మునెమ్మ, నాగరాజు తరచూ వేధించేవారు. ఇద్దరూ ఆడపిల్లలే అయినా, ఉన్నంతలో సంతోషంగా జీవిద్దామని, ఇక పిల్లలు వద్దని కవిత తన భర్తకు ఎన్నోసార్లు హితవు పలికినా పట్టించుకోలేదు.
ఈ నేపథ్యంలో ఆమె మళ్లీ గర్భం దాల్చింది. అప్పటి నుంచి అత్తింటి వేధింపులు తీవ్రమయ్యాయి. ప్రస్తుతం 3వ నెల నిండింది. మగబిడ్డను ప్రసవించకపోతే రెండవ పెళ్లి చేసుకుంటానంటూ భర్త తరచూ వేధిస్తూండడంతో కుంగిపోయింది. ఈ ఒత్తిళ్లకు తట్టుకోలేక కవిత ఇంట్లోనే బుధవారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక కవిత మృతి చెందిందని మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ శ్రీధర్ తెలిపారు.
అనాథలైన చిన్నారులు
తల్లి చనిపోయిందని గ్రహించలేని ఏడాది పైచిలుకు వయసున్న చిన్నారి రుచిత పాల కోసం ఏడుస్తుంటే చూపరులను కంటతడి పెట్టించింది. అత్తమామలు, భర్తకు మగబిడ్డపై ఉన్న మోజు చివరకు ఆమె ఊపిరి తీసిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment