వేధింపులే కారణమా..? | Married women suicide due to harassment at Bibinagar | Sakshi
Sakshi News home page

వేధింపులే కారణమా..?

Published Sat, Jan 27 2018 3:23 PM | Last Updated on Wed, Sep 26 2018 6:09 PM

Married women suicide due to harassment at Bibinagar - Sakshi

చిన్నకుమార్తెతో నిర్మల (ఫైల్‌)

చిన్నపాటి తగాదాకు మనస్తాపం చెందిందా..? అత్తా, మరిది కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చి చీటికిమాటికి వేధిస్తుండడంతో అఘాయిత్యానికి ఒడిగట్టిందా..? కారణాలు ఏవైతేనేం.. ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో పెద్దకుమార్తె ప్రమాదంనుంచి బయటపడగా.. ముక్కుపచ్చలారని చిన్నారితో సహా ఆ మాతృమూర్తి అగ్నిగి ఆహుతైంది. ఈవిషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, మృతురాలి తండ్రి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బీబీనగర్‌ (భువనగిరి): మండలంలోని రహీమ్‌ఖాన్‌గూడెం గ్రామానికి చెందిన పిట్టబోయిన భిక్షపతి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలసపోయాడు. అక్కడే బోడుప్పల్‌లో నివాసముంటున్నాడు. తన కూతురు నిర్మల(25)ను ఆరేళ్లక్రితం మదిర గూడూరుకు చెందిన జూరూర్‌ శ్రీశైలంయాదవ్‌కు ఇచ్చి వివాహాం చేశారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం. విడిగా కాపురం పెట్టుకుని అత్తామామ ఇంట్లోనే అన్యోన్యంగా జీవిస్తున్నారు. కుటుంబ వ్యవహారాల్లో జోక్యం     చేసుకుంటున్నారని.. గతంలో నిర్మల ఓప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ భర్తకు చేదోడువాదోడుగా ఉండేది.

చిన్నకుమార్తె జన్మించిన తర్వాత ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటోంది. కాగా శ్రీశైలం, తన తమ్ముడు వెంకటేశ్‌ వేరుగా కాపురం పెట్టుకున్నప్పటికీ తల్లి దండ్రుల ఇంట్లోనే ఉంటున్నారు. భర్త లేని సమయంలో అత్త జయమ్మ, మరిది తరుచూ కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ తన కూతురు నిర్మలను వేధించేవారని నిర్మల తండ్రి భిక్షపతి ఆరోపించాడు., ప్రతి దానికి సూటిపోటి మాటాలను అంటుండడంతో మనస్తాపం చెంది నిర్మల పిల్లలతో కలసి అత్మహత్యకు పాల్పడిందని కన్నీటిపర్యంతమయ్యాడు. తన అల్లుడు మంచివాడేనని, అతడిపై మాకు అనుమానాలు లేవన్నాడు.

తప్పించుకున్న పెద్ద కూతురు
ఉదయం 9గంటల సమయంలో భర్త గొర్రెలను మేపేందుకు వెళ్లగా, అత్తమామలు పొలానికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో నిర్మల ఇద్దరు పిల్లలపై కిరోసిన్‌ పోసి నిప్పు అంటించే సమయంలో భయాందోళనకు గురైన ఎల్‌కేజీ చదువుతున్న పెద్ద కూతురు ప్రజ్ణ ఇంట్లోని ప్రహరీ ఆవరణంలోకి వెళ్లింది . దీంతో నిర్మల తన దగ్గరే ఉన్న 16నెలల చిన్నకూతురు శృతితో కలసి నిప్పంటించుకుంది. దీంతో వారిద్దరూ సజీవ దహనమయ్యారు. ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రతిదానికీ చిరాకు పడేది
ఇంట్లో ఏదైనా చిన్న పాటి గొడవ జరిగినా మనస్పర్థలు చోటు చేసుకున్నా తన భార్య చిరాకు పడుతూ గొడవపెట్టుకుని అలిగేదని నిర్మల భర్త శ్రీశైలం పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం ఇంట్లో పిల్లలకు పాలు లేకపోవడంతో భర్తతో నిర్మల గొడవపడిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. భర్త గొర్రెలు మేపేందుకు వెళ్లాడని దీంతో మనస్తాపం చెందిన నిర్మల పిల్లలతో కలసి అత్మహత్య చేసుకోవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 

పోలీసుల అదుపులో భర్త,అత్తా, మరిది
సంఘటన స్థలంలోనే ఉన్న నిర్మల భర్త, అత్త, మామ, మరిదిని పోలీస్‌లు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేష్‌కుమార్‌ తెలిపారు.  
     
 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement