తల్లి ఆత్మహత్య కేసులో కొడుకుల అరెస్టు
వినుకొండ టౌన్ : కన్నతల్లిని భారంగా భావించటంతో అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్న మాతృమూర్తి కేసులో కొడుకులు, కోడళ్లను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ జి.శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. కుందుర్తి బజార్‌కు చెందిన షేక్ బషీరూన్ భర్త వలి దశాబ్దం క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి తన ఇద్దరు బిడ్డలను కూలి పనులు చేసి పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసింది. భార్యలు వచ్చిన తర్వాత ఇద్దరు కుమారులు తల్లి ఆలనాపాలన చూడకపోవటంతో బషీరూన్ అదే వీధిలో ఒక గది అద్దెకు తీసుకుని కూలి పని చేసుకుంటూ జీవించింది.
ఇటీవల బషీరూన్కు చూపు మందగించటంతో పాటు అనారోగ్య కారణాలతో తప్పనిసరి అయి కొడుకుల పంచన చేరింది. అయితే ఇద్దరు కుమారులు వంతులు వేసుకుని నెలకొకరు చొప్పున చూస్తున్నారు. అయితే కోడళ్ల వేధింపులు, చీత్కారాలు, చేయి చేసుకోవడాలతో మానసికంగా బషీరూన్ విసిగిపోయింది. ఈ నెల 25వ తేదీ కొడుకులిద్దరూ తల్లిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నీ వల్ల ఇళ్లలో తగాదాలు అవుతున్నాయి చస్తే పీడా పోతుంది’ అనటంతో బషీరూన్కి విరక్తి కలిగి ఎదురింటి మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కాంట్రాక్ట్ గౌస్ బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు బషీరూన్ కొడుకులు, కోడళ్లు కొండ్రముట్ల షేక్ కరిముల్లా, కాలేషా, హసీనా, మహబూబ్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపర్చనున్నట్లు చెప్పారు. సమావేశంలో ఎస్సైలు లక్ష్మీనారాయణ రెడ్డి, నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.