40 ఏళ్లకు అరెస్టు.. రూ.100 జరిమానా!
40 ఏళ్ల క్రితం పాలు కల్తీ చేసిన వ్యక్తిని మంగళవారం అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. పాలు కల్తీ చేసిన మోతీలాల్ నాయి(64)కు పెద్ద వయసు కావడంతో కనికరించిన న్యాయమూర్తి అతని నేరానికి రూ.100 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. కల్తీ పాలతో తయారు చేసిన స్వీట్లను అమ్మినందుకు 40 ఏళ్ల క్రితం నాయి అనే వ్యక్తిని అరెస్టు చేయాలని రాజస్ధాన్‌లోని నగౌర్ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో షాక్ తిన్న మోతీలాల్.. ఆంధ్రప్రదేశ్‌కు పారిపోయి వచ్చాడు.
ఏపీలో బతుకుదెరువు కోసం టీ షాపును పెట్టుకున్నాడు. కొద్ది రోజుల క్రితం నాయి భార్య మరణించడంతో తిరిగి రాజస్ధాన్‌కు వచ్చాడు. పాత కేసుల విచారణ చేపట్టిన పోలీసులకు నాయి కేసు ఫైల్ కనిపించింది. అతని అడ్రస్‌ను పట్టుకుని అక్కడికి వెళ్లిన పోలీసులకు నాయి తారసపడ్డాడు. అతన్ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చగా.. రూ.100 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి పాల కల్తీకి పాల్పడిన వ్యక్తులకు జీవిత ఖైదును శిక్షగా విధించొచ్చని గతేడాది ఆగష్టులో సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే, నాయి వయసు దృష్ట్యా అతనికి శిక్ష లేకుండా జరిమానా విధిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు.