మోటార్ లెసైన్సు కోసం కఠిన పరీక్షలుండాలి
ముంబై: రోడ్డు ప్రమాదాల నివారణకుగాను వాహనాలకు సంబంధించి డ్రైవింగ్ లెసైన్సు మంజూరులో కఠినంగా వ్యవహరించాలని ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ రవాణా శాఖకు విజ్ఞప్తి చేశాడు. శుక్రవారం దక్షిణ ముంబైలోని సహ్యాద్రిలో ఉన్న మహారాష్ట్ర హైవే ట్రాఫిక్ పోలీస్ నిర్వహించిన రోడ్డు రక్షణపై సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నగరంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. వాటిని సాధ్యమైనంత వరకు తగ్గించాలంటే డ్రైవింగ్ లెసైన్సు నిమిత్తం పెట్టే పరీక్షలను మరింత కఠినతరం చేయాల’ని చెప్పారు.‘ సినిమాల్లో చూపించిన స్టంట్లను బయట రోడ్లపై చేసేందుకు ప్రయత్నించవద్దు.
సినిమాకు వాస్తవానికి చాలా తేడా ఉంది.. సినిమాల్లో మేం నిపుణుల సమక్షంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ స్టంట్స్ చేస్తాం. వాస్తవ జీవితంలో అలా చేసేందుకు యత్నించొద్దు.. అది చాలా ప్రమాదం..’ అని యువతకు సూచించారు. ‘నాకు తెలుసు.. ఈ రోజుల్లో ఇంట్లోంచి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి క్షేమంగా ఇంటికి చేరేంతవరకు అందరికీ భయమే.. నేను కూడా నా కుటుంబసభ్యుల విషయంలో అలాగే ఫీలవుతుంటాను. మన దేశంలో ప్రతి వెయ్యిమందిలో ఒకరు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని ఒక సర్వేలో తేలింది. ఇది చాలా దారుణం. ప్రాణాంతక జబ్బుకన్నా ఇది ప్రమాదకరమైంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపకపోతే అది రోడ్డుపై ఎవరినో ఒకరిని బలిగొంటుంది. దాన్ని దృష్టిలోపెట్టుకుని బండి మీద వెళ్లేటప్పుడు జాగ్రత్తగా నడపడం అవసరం’ అని యువతకు ఆయన చెప్పారు. ఇటీవల విడుదలైన ‘ధూమ్ - 3’ సినిమాలో ఆమిర్ చేసిన బైక్ విన్యాసాలు యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.