రవాణా రంగంపైవిభజన భారం
విశాఖపట్నం, న్యూస్‌లైన్: ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న మోటార్ ట్రాన్స్పోర్ట్ రంగంపై మరో పెనుభారం పడుతోంది. బీమా పెరుగుదల, డీజిల్ ధరలు పెంపు, త్రైమాసిక పన్నులు, టోల్గేట్ల ధరలు రవాణా రంగానికి భారమయ్యాయి. ఖర్చు అధికం కావడంతో ఈ రంగం నష్టాల ఊబి నుంచి బయటపడటం లేదు. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోవటంతో రవాణా రంగానికి ఇబ్బందులు తప్పదని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో రాకపోకలు చేయడానికి రవాణా, ప్యాసింజర్ తరహా వాహనాలు ఎటువంటి రుసుం, పన్ను చెల్లించనవసరం లేదు.
ఇక తెలంగాణ జిల్లాలలో అడుగుపెట్టాలంటే ప్రవేశ, ఇతరత్రా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశ పన్ను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించాల్సి ఉంది. ఇరు రాష్ట్రాలకు భారీగా ఆదాయం కూడబెట్టడం కోసం పన్నుల భారం మోయలేని విధంగా ఉంటుందని విశ్లేషకుల అంచనా. ఆంధ్ర నుంచి తెలంగాణలోకి వాహనం ప్రవేశించేందుకు బోర్డర్ చెక్ పోస్టులు దాటాలి. విజయవాడ మీదుగా ప్రయాణించే వాహనాలు నల్గొండ జిల్లా కోదాడ చెక్ పోస్టులో, కొవ్వూరు, దేవరపల్లి, జంగారెడ్డిగూడెం మీదుగా వెళ్లే వాహనాలకు ఖమ్మం జిల్లా అశ్వారావుపేట చెక్‌పోస్టులో పత్రాలు చూపించి ప్రవేశ పన్ను చెల్లింపుతో ప్రవేశించాలి. జూన్ 2 నుంచి ప్రవేశ పన్నులు ఇరు రాష్ట్రాల లో అమలుకు కసరత్తు జరుగుతోంది.
పర్మిట్ ఉండాల్సిందే
ఆంధ్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశం పొందడానికి పర్మిట్ విధిగా ఉండాలి. రవాణా వాహనాలకు తాత్కాలిక పర్మిట్ చెక్ పోస్టులలో మంజూరు చేస్తారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి ప్రవేశించడానికి ప్రవేశ పన్ను చెల్లించి దేశంలో ఎక్కడి నుంచైనా ‘కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్’ ముందస్తుగా పొందవచ్చు. ఆంధ్ర నుంచి తెలంగాణ జిల్లాల మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లడానికి పర్మిట్ ఉండాల్సిందే. నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు (వ్యక్తిగత కార్లు, బైక్‌లు) మోటార్ వాహనాల చట్టం ప్రకారం గరిష్టంగా ఐదేళ్ల వరకూ గడువు ఉంటుంది. ఆంధ్రలో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జీవితపన్ను చెల్లించాలి.
వడ్డన తప్పదు
సీమాంధ్రలో రవాణా వాహనాలకు వడ్డన తప్పదని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేలాది లారీలు తెలంగాణకు తరలివెళతాయి. ప్రముఖ సిమెంట్ కంపెనీలు నల్గొండ, మంచిర్యాల, కరీంనగర్‌లలో వెలిశాయి. ఇంకా వైజాగ్ స్టీల్‌ప్లాంట్ నుంచి వేల కొద్దీ టన్నుల ఉక్కు హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాలకు వెళుతుంది. కోరమండల్ ఫెర్టిలైజర్స్, హెచ్‌పీసీఎల్, జింక్, పోర్టు నుంచి సరుకులు విశాఖ నుంచి మార్కెట్ అవుతాయి. అసలే నష్టాలతో ఉన్న తమపై కొత్తగా ప్రవేశ పన్ను భారం మోపడాన్ని ట్రాన్స్పోర్ట్ యజమానులు వ్యతిరేకిస్తున్నారు.
ఫీజులు ఇలా ఉండవచ్చు
వారం రోజులు తాత్కాలిక పర్మిట్ కోసం 15 టన్నుల లోపు సామర్థ్యం గల వాహనాలకు రూ.2,000, నెల రోజులకు రూ.4,000గా ఉండవచ్చు. 15 నుంచి 49 టన్నుల సామర్థ్యం గల వాహనాలకు ఏడు రోజులకు రూ.2,500, నెల రోజులకు రూ.8,600గా తెలిసింది. ప్యాసింజర్ తరహా వాహనాలు ఒక్కో సీటుకు వారం రోజుల వ్యవధితో రూ.350 నుంచి రూ.400గా ఉంటుంది. ప్యాసింజర్ వాహనాలకు వారం రోజుల కంటే ఎక్కువ వ్యవధి ఇవ్వరు. ఆయా రాష్ట్రాలలో ఇప్పటికే అమలులో ఉన్న సర్వీస్, మెకానికల్ చార్జీలు అదనంగా వసూలు చేయవచ్చు.